కూడేరు : మండలంలో నిరుపయోగంగా ఉన్న సమగ్ర గ్రామీణ రక్షిత మంచినీటి పథకాన్ని ప్రారంభించాలంటూ రాష్ట్ర పంచాయతీ రాజ్ ప్రిన్సిపల్ సెక్రటరీ జవహార్‌రెడ్డిని ఉరవకొండ ఎమ్మెల్యే విశ్వేశ్వరరెడ్డి అభ్యర్థించారు. రాజధాని అమరావతిలోని సచివాలయంలో సోమవారం జవహార్‌రెడ్డిని ఆయన ప్రత్యేకంగా కలిసి, మాట్లాడారు. రక్షిత మంచి నీటి పథకానికి పీఏబీఆర్ డ్యాం వద్ద రూ. 56 కోట్ల వ్యయంతో 11 నెలల క్రితం పనులు పూర్తి చేశారన్నారు. దీనిపై పలుమార్లు ట్రయల్ రన్ కూడా చేశారని గుర్తు చేశారు.
వేసవిలో దాహార్తితో 90 గ్రామాల ప్రజలు పడిన ఇబ్బందులను ప్రిన్సిపల్ సెక్రటరీకి వివరిస్తూ.. ఆ సమయంలో ప్రాజెక్ట్ ప్రారంభించాలంటూ ఆందోళనలు చేపడితే అరెస్ట్‌లు చేశారే తప్ప నీటి పథకాన్ని మాత్రం ప్రారంభించలేదని ఆవేదన వ్యక్తం చేశారు. ఎమ్మెల్సీ పయ్యావులు కేశవ్ ప్రమేయంతోనే ఈ ప్రాజెక్ట్ ప్రారంభానికి నోచుకోలేకపోతోందని, ప్రజల ఇబ్బందులు దృష్టిలో ఉంచుకుని వెంటనే ప్రారంభించేందుకు చర్యలు చేపట్టాలని కోరారు.