కూడేరు: కూడేరు మండలంలోని జల్లిపల్లివాసులు గురువారం ప్రధాన రహదారి విస్తరణ చేపడుతున్న ఎస్‌ఆర్‌సీ కంపెనీకి చెందిన లారీలను, జీపులను అడ్డుకున్నారు. రెండు నెలల క్రితం రోడ్డు వెడల్పు చేసి కంకర వేశారు. ఇంతవరకు దానిపై తారు రోడ్డు వేయలేదు. ప్రధాన రహదారిపై వాహనాల రద్దీ అధికంగా ఉంటోంది. కంకర రోడ్డుపై వాహనాలు వెళ్లినపుడు పెద్ద ఎత్తున దుమ్ము పైకి లేచి రోడ్డు పక్కన ఉన్న నివాస గృహాల్లోకి, బ్యాంక్‌లోకి, హోటల్స్, దుకాణాల్లోకి వెళుతోంది. రాత్రి పూట మాత్రమే కంపెనీ వారు ఒక ట్రిప్ నీటిని కంకర రోడ్డుపై చల్లి చేతులు దులుపుకుంటున్నారు. దీంతో ఆగ్రహించిన ప్రజలు ఆ కంపెనీకి చెందిన వాహనాలు రోడ్డుపై తిరగకుండా అడ్డుకున్నారు. నెలల తరబడి రోడ్డు నిర్మాణం జాప్యం చేస్తే తాము దుమ్ముతో ఎలా జీవించాలని నిలదీశారు. కంపెనీ యజమానుల దృష్టికి తీసుకుపోతామని వారు చెప్పడంతో వాహనాలను వదిలివేశారు.