త్రినేత్రం
సాంకేతికతతో నేరాల నియంత్రణ
ప్రతి దృశ్యం... సీసీకెమెరాల్లో నిక్షిప్తం
త్వరలో కమ్యూనిటీ సీసీటీవీ ప్రాజెక్ట్
మహంకాళిలో పైలట్ ప్రాజెక్ట్‌గా అమలు
ముఖ్యమంత్రితో ప్రారంభానికి యోచన
మూడు నెలల్లో నగరమంతటా అమలు
అన్ని ఠాణాల్లో కమాండ్ అండ్ కంట్రోల్ రూమ్స్
మహంకాళి మార్కెట్‌లో ఓ మహిళ న డచి వెళుతోంది. మోటార్ సైకిల్‌పై వచ్చిన అగంతకుడు కన్నుమూసి తెరిచేలోగా ఆమె
మెడలోని బంగారు నెక్లెస్‌ను తెంచుకొని పరారయ్యాడు. కేకలు విన్న స్థానికులు పోలీసులకు సమాచారమిచ్చారు. అరగంట
తరువాత ఆమె సెల్‌ఫోన్‌కు పోలీసు స్టేషన్ నుంచి ఫోన్...
నగలు దొరికాయనేది సారాంశం. సాధారణంగా ఇలాంటి కేసులు ఎప్పుడో గానీ తేలవు. కానీ అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానం దొంగను ఇట్టే పట్టిచ్చింది. ఇటీవల ఆ ప్రాంతంలో ఏర్పాటు చేసిన సీసీ కెమెరాల్లోని దృశ్యాల ఆధారంగా అరగంటలోనే పోలీసులు దొంగను పట్టుకోగలిగారు. త్వరలో నగరమంతటా ఈ తరహా కెమెరాలు అందుబాటులోకి రాబోతున్నాయి. మన ప్రతి కదలికనూ కనిపెట్టబోతున్నాయి. నేరాలకు చెక్ పెట్టబోతున్నాయి. అంతేకాదు.. కిలోమీటర్ దూరంలోని సూక్ష్మ దృశ్యాలను సైతం స్పష్టంగా చూపించగలిగే ప్రత్యేకత ఈ కెమెరాల సొంతం.
ఒక కొత్త వ్యక్తి నగరంలోని ఏదైనా పోలీసు స్టేషన్ పరిధిలోకి వచ్చి... వె ళ్తే .. కనీసం ఐదు సీసీటీవీలలో ఆ దృశ్యాలు కనబడేలా ఉంటుంది జంట కమిషనరేట్లలోని భవిష్యత్తు చిత్రం. నగరంలోని ప్రతి అంగుళం కవరయ్యేలా మూడు నెలల్లో కమ్యూనిటీ సీసీటీవీ ప్రాజెక్ట్‌ను పూర్తి చేసేందుకు పోలీసులు ముమ్మర కసరత్తు చేస్తున్నారు. దీనిని పైలట్ ప్రాజెక్ట్‌గా ముందుగా మహంకాళి పోలీసు స్టేషన్ పరిధిలో అమలు చేశారు. 15 రోజుల క్రితం ఐదు కిలోమీటర్ల పరిధిలో కమ్యూనిటీ సీసీటీవీ ప్రాజెక్ట్ కింద 40 సీసీ కెమెరాలను ఏర్పాటు చేశారు. ఈ దృశ్యాలను ఎప్పటికప్పుడు చూసేందుకు ఠాణాలో ప్రత్యేకంగా కమాండ్ కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేశారు. అందులోని పెద్ద ఎల్‌సీడీ టీవీలలో ఠాణా పరిధిలోని ప్రతి అంగుళాన్నీ పోలీసు సిబ్బంది వీక్షించే వీలు కల్పించారు. ఇది సత్ఫలితాలిచ్చినట్టు పోలీసు అధికారులు తెలిపారు. దీంతో మహంకాళిలో త్వరలో అధికారికంగా సీఎం కేసీఆర్‌తో కమ్యూనిటీ సీసీటీవీ ప్రాజెక్ట్‌ను ప్రారంభించేందుకు సన్నాహాలు చేస్తున్నారు. ఇది ప్రారంభించిన మూడు నెలల్లో జంట పోలీసు కమిషనరేట్ల పరిధిలోని 160 ట్రాఫిక్, లా అండ్ ఆర్డర్ ఠాణాలలో దీన్ని అందుబాటులోకి తెచ్చేందుకు సిద్ధమవుతున్నారు.
50 మీటర్ల దూరంలో...
మహంకాళి పీఎస్ పరిధిలోని ప్రతి 50మీటర్ల దూరం లో ప్రత్యేకంగా తయారు చేసిన స్తంభాలకు మొత్తం 40సీసీ కెమెరాలను అమర్చారు. ఈ స్తంభాలకు జంక్షన్ బాక్స్(కస్టర్)లు ఏర్పాటు చేశారు. ఒక్కో బాక్స్ లో 16 సీసీ కెమెరాలు కవర్ అవుతాయి. వీటి నిర్వహణ ఖర్చు ఐదేళ్లకు రూ.16 లక్షల వరకు ఉంటుంది.
తక్కువ ఖర్చు... ఎక్కువ ప్రయోజనం
కమ్యూనిటీ సీసీటీవీ ప్రాజెక్ట్ కింద ఏర్పాటు చేసే కెమెరాలు, నిర్వహణ ఖర్చు ప్రజలే భరించాల్సి ఉంటుంది. ప్రజా భద్రతా చట్టం కింద ప్రతి వ్యాపారి సీసీ కెమెరాలు ఏర్పాటు చేసుకోవాల్సిందే. ఎవరికి వారు ఏర్పాటు చేసుకోవడంతో కెమెరాల ఖర్చు, నిర్వహణ భారమవుతుంది. కొత్త ప్రాజెక్ట్‌తో వ్యాపారులకు అతి తక్కువ ఖర్చుతో పాటు నిర్వహణ భారం తగ్గుతుందని పోలీసులు చెబుతున్నారు. ఉదాహరణకు ఒక రూట్‌లో 50 మీటర్ల దూరంలోపు ఎడమ, కుడి వైపు కలిసి 40 షాపులుంటే... చట్టప్రకారం వారంతా 40 కెమెరాలు పెట్టాల్సిందే. కమ్యూనిటీ ప్రాజెక్ట్ కింద కేవలం అటువైపు వచ్చి, పోయే మార్గంలోనే కెమెరాలు అమర్చుకోవడంతో ఐదారు సీసీ కెమెరాలు సరిపోతాయి. వీటి ఖరీదులో వ్యాపారి కొద్ది మొత్తం చెల్లిస్తే సరిపోతుంది.
నాణ్యమైనవి...
వ్యాపారులు తక్కువ నాణ్యత గల సీసీకెమెరాలు ఏర్పాటు చేస్తే భవిష్యత్తులో నష్టం జరిగే అవకాశాలు ఉన్నాయి. ఈ విషయం గ్రహించిన కమిషనర్ ఎం.మహేందర్ రెడ్డి నాణ్యత గల కెమెరాల కోసం టెండర్లు ఆహ్వానించారు. 18 కంపెనీలు టెండర్లు దాఖలు చేయగా... అందులో 15 సంస్థలు నాణ్యమైన కెమెరాలు సరఫరా చేయగలవని తేలింది. ప్రభుత్వం తరఫున నిపుణులు, పోలీసు అధికారులు వాటి పనితీరును పరిశీలించి... నిర్ధారించిన వాటిని మాత్రమే కమ్యూనిటీ సీసీటీవీ ప్రాజెక్ట్ కింద ఏర్పాటు చేయాల్సి ఉంటుంది.
ఠాణాల్లో కంట్రోల్ రూమ్‌లు
జంట పోలీసు కమిషనరేట్లలోని అన్ని ట్రాఫిక్, లా అండ్ ఆర్డర్ పోలీసు స్టేషన్‌లలో ప్రత్యేకంగా కమాండ్ అండ్ కంట్రోల్ రూమ్‌లను ఏర్పాటు చేస్తారు. వీటిలో అమర్చిన పెద్ద ఎల్‌సీడీలలో సీసీ కెమెరాల దృశ్యాలను చూసేందుకు ముగ్గురేసి పోలీసు సిబ్బంది విధుల్లో ఉంటారు. ఇలా 24 గంటలూ సీసీ కెమెరాలు పని చేస్తుంటాయి.ఇక్కడ అమర్చిన సర్వర్ ద్వారా బషీర్‌బాగ్‌లోని కమిషనర్ కార్యాలయంలో ఉన్న కమాండ్ అండ్ కంట్రోల్ రూమ్‌తో అనుసంధానం చేస్తారు.
ప్రయోజనాలు..
బంజారాహిల్స్‌లోని రోడ్డు నెంబర్ 12లోని దృశ్యాలు కావాలనుకుంటే బషీర్‌బాగ్‌లోని తన కార్యాలయంలో కూర్చునే కమిషనర్ వీక్షించే అవకాశం కల్పించారు.
ఇలా ఏ ఠాణా పరిధిలోని ఏ రోడ్డునైనా వీక్షించవచ్చు.
ఊరేగింపులు, ర్యాలీలు, బహిరంగ సభలు, పండుగలు జరుగుతున్న ఏరియాను కమిషనర్ తన కార్యాలయం నుంచే వీక్షించే సదుపాయం.
ఇక ఠాణా పరిధిలోని అన్ని గల్లీలు, రూట్లను కవర్ చేస్తూ ప్రణాళిక ప్రకారం సీసీటీవీలను ఏర్పాటు చేస్తారు. ఆ సెక్టార్ల ఎస్‌ఐలు ఠాణాల్లోనే కూర్చుని తమ పరిధిలో శాంతి భద్రతలు పర్యవేక్షించవచ్చు.
మహిళలు ఇక నిర్భయంగా బంగారు గొలుసులు వేసుకుని తిరుగాడవచ్చు.
ఎవరైనా స్నాచింగ్‌కు పాల్పడితే సీసీటీవీలో ఇట్టే గుర్తించవచ్చు.
నిందితుడు ఏ రూట్‌లో... ఏ వాహనంపై వెళ్లాడనే వివరాలు స్పష్టంగా కనిపిస్తాయి.
తద్వారా నేరం మిస్టరీ వెంటనే వీడడంతో పాటు నిందితుడు పట్టుబడేందుకు అవకాశం ఉంటుంది.
నేరాలు తగ్గుముఖం పడతాయి.
మహిళలను రోడ్లపై వేధించేవారు, ఈవ్‌టీజింగ్‌కు పాల్పడే వారిని సులువుగా సాక్ష్యాలతో పసిగట్టవచ్చు.
నిందితులకు శిక్ష పడేందుకు ఉపయోగపడుతుంది.
రోడ్డు ప్రమాదాల్లో తప్పొప్పులు దొరికిపోతాయి.
షట్టర్ తాళాలు పగులగొట్టి దొంగతనాలకు పాల్పడే వారిని కనిపెట్టవచ్చు.
{పతి ఠాణాలో 30 రోజులు ఈ దృశ్యాలను భద్రపరుస్తారు.
ఆ తరువాత ఠాణాల ఫీడ్‌ను ప్రధాన సర్వర్‌లో భద్రపరుస్తారు.
ఇదీ కెమెరాల ప్రత్యేకత
పైలట్ ప్రాజెక్ట్‌లో ఏర్పాటు చేసిన కెమెరాలు తైవాన్ దేశానికి చెందినవి.
మోటరైజ్ వురిఫికల్ ఫిక్స్‌డ్ ఐపీ కెమెరా 180 డిగ్రీల కోణంలో దృశ్యాలను చిత్రీకరిస్తుంది.
పీటీజెడ్ కెమెరాలు 360 డిగ్రీల కోణంలో దృశ్యాలను కవర్ చేస్తాయి. కమ్యూనిటీ సీసీటీవీ ప్రాజెక్ట్‌లో ఈ రెండు కెమెరాలను అమర్చుతారు.
ఐపీ కెమెరా 50 మీటర్ల వరకూ... జీటీజెడ్ కెమెరా కిలోమీటర్ దూరం వరకు దృశ్యాలను కవర్ చేస్తాయి.