- నీరు, పారిశుద్ధ్యం, పరిశుభ్రత అంశాలకు ప్రాధాన్యం
- పైలట్ ప్రాజెక్టుగా ప్రతీ జిల్లా నుంచి రెండేసి గ్రామాలు
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో మానవ అభివృద్ధి సూచిక మెరుగుదల నిమిత్తం గ్రామీణ ప్రాంతాల్లో పరిశుభ్రతకు అధిక ప్రాధాన్యమివ్వాలని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయిం చింది. ఈ మేరకు ఎంపిక చేసిన 150 మండలాల్లో ‘వాష్’(వాటర్, శానిటేషన్, హైజిన్) పథకాన్ని అమలు చేయాలని సంకల్పించింది. తద్వారా గ్రామీణ ప్రాంత ప్రజలకు వ్యక్తిగత పరిశుభ్రత పట్ల విస్తృతమైన అవగాహన కల్పించడం, ఆయా ప్రాంతాల్లో మరుగుదొడ్ల నిర్మాణాన్ని చేపట్టేలా ప్రోత్సహించాలని తెలంగాణ ప్రభుత్వం భావించింది.
పైలట్ ప్రాజెక్టు కింద ప్రతీ జిల్లా నుంచి రెండు గ్రామాల్లో ‘వాష్’ను అమలు చేయనున్నారు. ఫలితాలను సమీక్షించాక దీన్ని విస్తరించాలని గ్రామీణ పేదరిక నిర్మూలన సంస్థ(సెర్ప్) అధికారులు నిర్ణయించారు. ప్రపంచ బ్యాంకు నిధులతో ప్రభుత్వం చేపట్టిన ‘తెలంగాణ పల్లె ప్రగతి’ పథకంలో భాగంగానే ‘వాష్’ ఈ నెల 13 నుంచి ఎంపిక చేసిన గ్రామాల్లో పైలట్ ప్రాజెక్ట్‌గా అమలు కానుంది.
ప్రాజెక్టు అమలు ఇలా..
ఎంపిక చేసిన గ్రామంలో ‘వాష్’ బాధ్యతలను గ్రామ సమాఖ్యలు చేపడతాయి. గ్రామాల్లో మార్పు కమిటీలను ఏర్పాటు చేసి, వాటిని బలోపేతం చేయనున్నారు.
ప్రధానంగా ఆరుబయట మల విసర్జనను రూపుమాపేందుకు ప్రజలను చైతన్య పరుస్తారు.
ఎంపిక చేసిన వాలంటీర్లు నీరు, పరిశుభ్రత, పారిశుద్ధ్యం.. అంశాలకు సంబంధించి గ్రామంలోని కుటుంబాల వారీగా ప్రస్తుత పరిస్థితిపై బేస్‌లైన్ సర్వే నిర్వహిస్తారు. వాలంటీర్లకు అవసరమైన సహకారాన్ని ఇందిరా క్రాంతి పథం సిబ్బంది అందజేస్తారు.
ప్రతీ పల్లెలోను గ్రామసభ నిర్వహించి బేస్‌లైన్ సర్వేలో వెల్లడైన వివరాలను ప్రజలతో ముఖాముఖి చర్చిస్తారు. ప్రజలను భాగస్వాములను చేస్తూ నిర్ణీత సమయంలోగా ప్రతీ కుటుంబం మరుగుదొడ్డి నిర్మించుకునేలా తీర్మానం చేస్తారు. ‘వాష్ ’ అమలు చేసే నిమిత్తం మూడు (ప్రొక్యూర్‌మెంట్, కనస్ట్రక్షన్, విజిలెన్స్) ఉప కమిటీలను నియమిస్తారు. ఈ కమిటీల్లో గ్రామ సమాఖ్య సభ్యులు, సర్పంచ్, వార్డు సభ్యులు ఉంటారు.
మరుగుదొడ్ల నిర్మాణానికి సంబంధించి ప్రణాళికకు ముందు మేస్త్రీలు, మెటీరియల్ పంపిణీదారులతో ‘వాష్’ సంప్రదింపులు చేయాలి. ప్రతీ మరుగుదొడ్డి నిర్మాణానికి ముందస్తుగా రూ.1,200లను గ్రామ సమాఖ్య ద్వారా‘సెర్ప్’ అందజేస్తుంది. ఇతరుల నుంచి కూడా విరాళాలను సేకరించవచ్చు.
ఈ నిర్మాణాన్ని పర్యవేక్షించడంతో పాటు, దానిని సక్రమంగా వినియోగిస్తున్నారా, ఆరుబయట మల విసర్జనను మానేశారా.. లేదా వంటి అంశాలను నిర్ధారించాల్సిన బాధ్యత విజిలెన్స్ కమిటీలదే.
‘వాష్’ ప్రణాళిక, అమల్లో గ్రామ పంచాయతీ సమగ్రమైన భాగస్వామ్యం వహించాలి. గ్రామ సభల నిర్వహణ, వాష్ ప్రణాళిక అభివృద్ధికి సహకరించాలి. వాష్ కమిటీలకు సర్పంచులే నేతృత్వం వహిస్తారు.
జిల్లా గ్రామీణాభివృద్ధి సంస్థ(డీఆర్‌డీఏ)ల ఆధ్వర్యంలో పనిచేసే గ్రామ సమాఖ్యలకు రూ.50 లక్షలు చక్రనిధిని గ్రామీణ నీటి పారుదల, పారిశుద్ధ్య(ఆర్‌డబ్ల్యూఎస్‌ఎస్) విభాగం అందజేస్తుంది. వాటిని గ్రామ సమాఖ్యలు మరుగుదొడ్ల నిర్మాణానికి అడ్వాన్స్‌గా వినియోగించుకోవచ్చు.