
రెవెన్యూ శాఖకు రాష్ట్ర విభజన పిడుగు
ఇప్పటికే పని భారం.. ఆపై సిబ్బంది కొరతతో సతమతమవుతున్న రెవెన్యూ శాఖకు రాష్ట్ర విభజన పిడుగుపాటుగా పరిణమించింది. ఈ శాఖ పరిధిలోని భూసేకరణ యూనిట్ల రద్దు నిర్ణయంతో ఔట్ సోర్సింగ్, కాంట్రాక్ట్ ఉద్యోగులకు మంగళం పాడగా.. ఉన్న యూని ట్లలోని సిబ్బందిని సైతం కుదించడం.. కొత్త నియామకాలపై నీలినీడ లు కమ్ముకోవడంతో రెవెన్యూ శాఖ కుదేలు కానుంది. ఉద్యోగుల ప్రమోషన్లు, ఇతరత్రా ప్రయోజనాలకు తీవ్ర విఘాతం కలగనుంది.
శ్రీకాకుళం కలెక్టరేట్, న్యూస్‌లైన్: రాష్ట్రం ముక్కలు కావ డం.. రెవెన్యూ శాఖను చిక్కుల్లోకి నెట్టింది. ఈ శాఖలోని ఉద్యోగు లు తీవ్ర ఇబ్బందులపాలు కానున్నారు. ఇప్పటికే పనిభారంతో సతమతమవుతున్న సిబ్బందిపై మరింత బరువు పడనుంది. ఈ శాఖలో పనిచేస్తున్న ఔట్ సోర్సింగ్ ఉద్యోగులను దశలవారీగా ఇంటికి పంపించేందుకు ప్రభుత్వం సిద్ధమవుతోంది. ఇప్పటికే కొన్ని పోస్టులు రద్దు కాగా,, కొత్త పోస్టుల మంజూరయ్యే అవకాశాలు లేవు. కొన్నేళ్లుగా అరకొర జీతాలతోనే పనిచేస్తున్న ఔట్ సోర్సింగ్ ఉద్యోగుల తొలగింపుతో ప్రభుత్వ ఉద్యోగులకు కష్టాల పర్వం ప్రారంభమైంది. ఈ నెల 17న అధికారులు జారీ చేసిన జీవో నెం.67 దీనికి నాంది పలి కింది. ప్రస్తుతం రాష్ట్రంలో రాష్ట్రపతి పాలన ఉంది. ఎన్నికలు ముగిసి కొత్త ప్రభుత్వం త్వరలోనే కొలువుదీరనున్న తరుణంలో ఇప్పటికిప్పుడే ఇటువంటి కీలక ఉత్తర్వుల జారీ చేయడం చర్చనీయాంశమైంది.
జీవో నెం. 67లో ఏముంది?
సమైక్య రాష్ట్రంలోని 23 భూసేకరణ యూనిట్లు ఎత్తివేయాలని నెం.67 జీవో ద్వారా ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. ఇందులో శ్రీకాకుళం జిల్లాకు సంబంధించి మూడు యూనిట్లు ఉన్నాయి. వంశధార ప్రాజెక్టుకు సంబంధించి ఆమదాలవలసతోపాటు శ్రీకాకుళంలోని 3, 4 యూనిట్లకు అధికారులు మంగళం పాడారు. ఈ ఉత్తర్వుల ఫలితంగా 45 మంది వివిధ స్థాయిల సిబ్బంది ఉద్యోగాలు కొల్పోతున్నారు. ప్రస్తుతం భూసేకరణ యూనిట్లలో పది మంది సిబ్బంది పని చేస్తున్నారు. కొన్ని యూనిట్లను ఎత్తివేయడం వల్ల అక్కడ సిబ్బందిని రెవెన్యూ శాఖలోని ఖాళీ పోస్టుల్లో సర్దుబాటు చేస్తారు. అక్కడ పని చేస్తున్న ఔట్ సోర్సింగ్ సిబ్బందిని తొలగిస్తారు. అంతేకాకుండా మిగిలిన భూసేకరణ యూనిట్లలో కూడా సిబ్బందిని కుదించి ఐదు మందే ఉండేలా చూడాలని జీవోలో స్పష్టంగా పేర్కొన్నారు. జిల్లాలో ఉన్న ఐదు భూసేకరణ యూనిట్ల లో మూడింటిని రద్దు చేయడం వల్ల రెండు యూనిట్లే మిగులుతున్నాయి.
వీటిలోకి రెగ్యులర్ ఉద్యోగులను సర్దుబాటు చేస్తే.. ప్రస్తుతం పని చేస్తున్న 150 మంది ఔట్ సోర్సింగ్ ఉద్యోగుల్లో సగం మంది ఉపాధి కోల్పోతారు. యూనిట్లు కుదించడం.. సిబ్బందిని తగ్గించడం వల్ల రానున్న రోజు ల్లో పదోన్నతులు ఉండవు. ఇప్పటికే పదోన్నతులు వారు తగిన పోస్టులు లేకపోవడం తో వెనక్కి వెళ్లాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. ముఖ్యంగా డిప్యూటీ తహశీల్దార్(డీటీ) క్యాడర్ అధికారులకు ఇటువంటి ఇబ్బంది ఎదురయ్యే ప్రమాదముంది. జిల్లాలో 14 డీటీలు పాత స్థానాలకు వెళ్లాలి రావ చ్చు. ఎన్నికల విధుల్లో ఉన్న మరో 10 డీటీలకు కూడా ఈ పరిస్థితి తప్పదు.
ప్రస్తుతం రెవెన్యూ, భూసేకరణ విభాగంలో 12 మంది స్పెషల్ డిప్యూటీ కలెక్టర్లు, 42 మంది త హశీల్దారు, 44 మంది డిప్యూటీ తహశీల్దార్లు, 30 మంది సీనియర్ అసిస్టెంట్లు, 38 మంది రెవెన్యూ పర్యవేక్షకులు, 114 మంది జూనియన్ అసిస్టెంట్లు 159 మంది అటెండర్లు ఉన్నారు. వీరు కాకుం డా ఔట్ సోర్సింగ్ విధానంలో డేటా ఎంట్రీ అపరేటర్లు, జూనియర్ అసిస్టెంట్లు, అటెండర్లు, స్వీపర్లు తదితర క్యాడర్లలో మరో 150 మంది వరకు పని చేస్తున్నారు. యూ నిట్ల రద్దు, ఉద్యోగుల కుదింపు జీవోతో వీరందరికీ ఇక్కట్లు తప్పేలా లేవు.