సాక్షి ప్రతినిధి, తిరుపతి/సాక్షి, అమరావతి: రాష్ట్రంలో అస్మదీయులకు ప్రభుత్వం భూసంత్పరణ కొనసాగిస్తోంది. చిత్తూరు జిల్లా తెలుగుదేశం పార్టీ ఉపాధ్యక్షుడు, తిరుపతి కేంద్రంగా వైద్యరంగంలో స్థిరపడ్డ డాక్టర్ కోడూరి బాలసుబ్రహ్మణ్యంకు చెందిన అలైట్ సూపర్ స్పెషాలిటీ ఆస్పత్రి నిర్మాణానికి అత్యంత విలువైన భూమిని కారుచౌకగా కేటాయించింది.
తిరుపతి శివారు కరకంబాడిలో రూ.15 కోట్ల విలువైన భూమిని కేవలం రూ.1.20 కోట్లకే ఇవ్వాలని జిల్లా అధికారులను ఆదేశించింది. ఈ మేరకు రెవెన్యూ శాఖ ప్రత్యేక ముఖ్య కార్యదర్శి డాక్టర్ మన్మోహన్‌సింగ్ బుధవారం ఉత్తర్వులు (జీవో ఎంఎస్ నెం.266) జారీ చేశారు.
మంత్రుల ద్వారా పైరవీలు
తిరుపతి నుంచి మంగళం మీదుగా కడప హైవేకు వెళ్లే మార్గంలో కరకంబాడి గ్రామం ఉంది. దీనిపక్కనే అమరరాజా ఫ్యాక్టరీ ఉంది. దీనికి సమీపంలోనే విలువైన ప్రభుత్వ భూమి ఉంది. సర్వే నెంబరు 774/3లో ఉన్న 15 ఎకరాల ప్రభుత్వ భూమిని 500 పడకలతో నిర్మించే అలైట్ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ కోసం కేటాయించాలని ప్రభుత్వం నిర్ణయించింది.
ఇక్కడ మార్కెట్ విలువ ఎకరం రూ.35 లక్షలుగా నిర్ధారించినప్పటికీ తక్కువ ధరకే ఇవ్వాలంటూ ప్రభుత్వంపై ఒత్తిడి తెచ్చారు. డాక్టర్ బాలసుబ్రహ్మణ్యం రాష్ట్ర మంత్రులు నారా లోకేశ్, అమరనాథరెడ్డిల ద్వారా భూమి కోసం ప్రయత్నాలు చేశారని సమాచారం. దీంతో ప్రభుత్వం ఇదే సర్వే నెంబరులో ఉన్న 15 ఎకరాల భూమిని ఎకరం కేవలం రూ.8 లక్షలకే ఇవ్వాలని నిర్ణయానికొచ్చింది.
మూడేళ్లలో భూమిని వినియోగంలోకి తీసుకురావాలని, కేటాయించిన భూమిలో జల వనరుల రూపురేఖలు మార్చకూడదని జీవోలో స్పష్టం చేశారు. సంబంధిత అవసరాలకే భూమిని వినియోగించుకోవాలని పేర్కొన్నారు. రూ.15 కోట్ల విలువైన భూమిని కేవలం రూ.1.20 కోట్లకే కట్టబెట్టడంతో ఆగ్రహావేశాలు వ్యక్తమవుతున్నాయి. ఈ వ్యవహారంలో ప్రభుత్వం పెద్దలకు ముడుపులు ముట్టినట్లు విమర్శలు వినిపిస్తున్నాయి.
పలు సంస్థలకు భూముల కేటాయింపు
వివిధ సంస్థలకు భూములను కేటాయిస్తూ ప్రభుత్వం గురువారం ఉత్తర్వులు జారీ చేసింది. అనంతపురం జిల్లా పెనుగొండ మండలం ఎర్రమంచి గ్రామంలో ట్రక్ టెర్మినల్ ఏర్పాటు కోసం ఆంధ్రప్రదేశ్ పారిశ్రామిక మౌలిక సదుపాయాల కల్పన సంస్థ (ఏపీఐఐసీ)కి ప్రభుత్వం 402.32 ఎకరాలు ఉచితంగా కేటాయించింది.
ఇదే జిల్లా పెనుగొండ మండలంలో డంపింగ్ యార్డు, ఇతర అవసరాల కోసం ఏపీఐఐసీకి 129 ఎకరాలను ఉచితంగా కేటాయించింది. చిత్తూరు జిల్లా నగరి మండలంలో పారిశ్రామిక పార్కు ఏర్పాటు కోసం ఏపీఐఐసీకి 101.18 ఎకరాలను కేటాయించింది. వీటితోపాటు మరికొన్ని సంస్థలకు భూములను కేటాయిస్తూ రెవెన్యూ శాఖ జీవోలు జారీ చేసింది.
Comments
Please login to add a commentAdd a comment