కలెక్టరేట్, న్యూస్‌లైన్ : జిల్లా రెవెన్యూ శాఖలో బదిలీల వ్యవహారంపై తీవ్రస్థాయిలో చర్చ సాగుతోంది. ఇటీవల వీడియో కాన్ఫరెన్స్‌లో సీసీఎల్‌ఏ కమిషనర్ మాట్లాడుతూ జిల్లా స్థాయిలో తహసీల్దార్ల పోస్టులు ఖాళీగా ఉంటే అఫీషియేటింగ్ ద్వారా గానీ, ఇతర పరిపాలనా సౌలభ్యంగా గానీ వాటిని భర్తిచేసుకోమని సూచించారు. ఈ ప్రక్రియ నవంబర్ 3లోగా పూర్తిచేసుకోవాలని చెప్పారు. తదుపరి ఓటర్ల జాబితా రివిజన్ ఉంటుందని, జనవరి మొదటివారం వరకు బదిలీలకు అవకాశం ఉండదన్నారు.
బదిలీల వ్యవహారం తెరపైకి రావడానికి ఈ అంశం కూడా కారణంగా కనిపిస్తోంది. ఇదిలావుంటే బదిలీలకు ఉన్నతాధికారులు సానుకూలంగా స్పందించడంతో ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న ఆశావహులు బదిలీ విషయంలో తమ వ్యూహాలకు పదునుపెడుతున్నారు. బదిలీ బాటపట్టే వారిలో సుమారు డజను మంది అధికారుల పేర్లు వినిపిస్తున్నాయి. సాధారణంగా బదిలీలు ఉన్నతాధికారుల ఆదేశాల ప్రకారం జరిగితే వ్యవహారం సాధారణంగా సమసిపోతుంది. కానీ ప్రస్తుతం మాత్రం స్థానిక ఎమ్మెల్యేలు, ఉద్యోగ సంఘాల నేతల జోక్యం చర్చనీయాంశమవుతోంది.
స్థానికంగా పనికాదనుకున్న కొదరు ఏకంగా రెవెన్యూ మంత్రితో కూడా ఓ మాట చెప్పించేందుకు సిద్ధంగా ఉన్నారు. మరికొందరు తాము కోరుకున్న చోటుకు బదిలీచేయిస్తే కాస్తో కూస్తో ఖరుచ పెట్టేందుకు కూడా వెనకాడమంటూ చెపుతుండడం గమనార్హం. అయితే బదిలీ విషయం ముదుకుతెస్తే తేనెతుట్టెను కదిపినట్లవుతుందని ఉన్నతాధికారులు ఆసక్తిచూపడం లేదని తెలుస్తోంది.
హన్మకొండ ప్రధాన అంశం
ప్రస్తుతం బదిలీల చర్చలో హన్మకొండ మండలం ప్రధాన అంశంగా మారింది. హన్మకొండ మండలానికి వచ్చేందుకు గతంలో నర్సంపేట తహసీల్దార్‌గా ఉన్న హన్మంతరావు చివరిదాకా ప్రయత్నించారు. పనిలోపనిగా హసన్‌పర్తి ఇచ్చినా సరే అన్నట్లు ఆసక్తి చూపారు. కానీ అప్పటి బదిలీల సమయంలో జేసీగా ఉన్న ప్రద్యుమ్న నాటకీయ పరిణామాల మధ్య హన్మంతరావును వర్ధనన్నపేటకు బదిలీచేశారు. ప్రస్తుతం గెజిటెడ్ అధికారుల సంఘంలో నాయకునిగా ఉన్న హన్మంతరావును జిల్లా కేంద్రానికి గానీ, పక్కన ఉన్న మండలాలకుగానీ బదిలీ స్తే బాగుంటుందనే ప్రతిపాదనతో కొందరు సంఘం నాయకులు ప్రయత్నాలు మొదలెట్టారు. ప్రస్తుతం వర్ధన్నపేటలో కొంత ఇబ్బందికర పరిస్థితులు ఎదుర్కొంటున్నారు.
వివిధ కారణాలతో మరికొందరు..
ఇక గత బదిలీల సమయంలో హన్మకొండ నుంచి నర్సంపేటకు బదిలీ అయి... ఆ వెంటనే మళ్లీ కొడకండ్లకు వెళ్లిన సంజీవ కూడా అక్కడికి అయిష్టంగానే వెళ్లారు. అనారోగ్యం కారణాలతో తనను సమీపంలోని మండలాలకు పంపాలని కోరినా అప్పట్లో అధికారులు వినలేదు. ప్రస్తుత పరిస్థితుల్లో ఖాళీగా ఉన్న ధర్మసాగర్ గానీ... సమీప మండలాల్లో ఏదో ఒక చోటకు అవకాశం కోసం సంజీవ ప్రయత్నిస్తున్నారు. ఈ విషయంలో స్థాకంగా నేతలతోనూ ఇబ్బందులు రాకుండా పనులు చక్కబెట్టుకునే పనిలో ఉన్నట్లు సమాచారం.
వీరితోపాటు అప్పట్లో పూర్తిగా రాజకీయ ఒత్తిళ్లతో నర్సంపేట తహసీల్దార్‌గా విధుల్లో చేరిన రజిని వ్యవహారంలో జిల్లా అధికారులు అసంతృప్తితో ఉన్నారు. ఇటీవల జేసీ పర్యటనలోనూ ఇదే విషయం స్పష్టమైంది. ఇక తహసీల్దార్‌ను బదిలీ చేయాలని అక్కడి ఆర్డీవో కూడా ఉన్నతాధికారులకు నివేదిక ఇచ్చారు. దీంతో బదిలీగనుక జరిగితే నర్సంపేట తహసీల్దార్‌కు స్థానచలనం దాదాపు ఖాయమైంది. వీరితో పాటు ములుగుగణపురం తహసీల్దార్ విషయంలో ప్రభుత్వ చీఫ్ విప్ గండ్ర వెంకటరమణారెడ్డి తీవ్ర అసంతృప్తితో ఉన్నట్లు సమాచారం. దీంతో బదిలీ విషయంలో ఇక్కడి తహసీల్దార్ పేరు కూడా రావచ్చనే ఊహాగానాలు వినవస్తున్నాయి.
అధికారుల ఆగ్రహంతో కొన్ని...
ఇక బదిలీ ప్రయత్నాలు ఇలా ఉంటే.. కొన్ని మండలాల విషయంలో స్వయంగా ఉన్నతాధికారులే తహసీల్దార్లకు స్థాన చలనం కల్పించాలని చూస్తున్నారు. ఇలా ఒకటి రెండింటికి అవకాశం ఉంది. సహజంగా తహసీల్దార్ల బదిలీల విషయంలో జిల్లా కలెక్టర్ సర్వాధికారి. కానీ ప్రస్తుతం జరగుతున్న పరిణామాలు ఉద్యోగవర్గాలు, ఉద్యోగ సంఘాల్లో సాగుతున్న చర్చనీయ అంశాలు మాత్రమే. అయితే కోరుకున్న స్థానాల కోసం చేస్తున్న ప్రయత్నాలు ఎంతవరకు ఫలిస్తాయన్న విషయం బదిలీల ప్రక్రియ జరిగితేనే తెలుస్తుంది.
అసలు బదిలీలు జరిగేనా...?
ఒక వైపు బదిలీ వ్యవహారంపై ఉద్యోగ వర్గాల్లో చర్చ జరుగుతుంటే మరోవైపు అసలు బదిలీలకు కలెక్టర్ ఆసక్తి చూపుతారా అన్నది కూడా ప్రాముఖ్యత సంతరించుకుంది. ఎదుకంటే సాధారణ ఎన్నికలకు ముందే జిల్లా నుంచి తహసీల్దార్లందరూ ఇతర జిల్లాలకు వెళతారు. ఇందుకు అంతా మూడు..నాలుగు నెలల సమయం మాత్రమే ఉంది. ఈ మూడు నెలల కోసం అక్కడివారినిక్కడికి...ఇక్కడివారినక్కడికి మార్చడం ఎందుకని ఆలోచిస్తే బదిలీలు ఉండకపోవచ్చు. ప్రస్తుతం మాత్రం జనగామ డీఏవో పోస్టు, ఖానాపూర్, ధర్మసాగర్ తహసీల్దార్ పోస్టులు ఖాళీగా ఉన్నాయి. నెలాఖరులో దేవరుప్పుల ఖాళీ అవుతుంది. నాలుగైదు తహసీల్దార్ పోస్టులు నింపకుంటే పరిపాలనా పరంగా ఇబ్బందులు తలెత్తే అవకాశాలున్నాయి. ఇలాంటి పరిస్థితుల్లో జిల్లా యంత్రాంగం ఏం నిర్ణయం తీసుకుంటుందో అన్న చర్చ ఉద్యోగ వర్గాల్లో ఆసక్తిగా సాగుతోంది.
‘రెవెన్యూ’లో బదిలీల చర్చ
Published Thu, Oct 24 2013 1:28 AM | Last Updated on Fri, Sep 1 2017 11:54 PM
Advertisement
Advertisement