సీఎంతో రెవెన్యూ నాయకుల భేటీ
కాకినాడ సిటీ : రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడును వివిధ సమస్యలపై ఏపీ రెవెన్యూ సర్వీస్ అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షులు బొప్పరాజు వెంకటేశ్వర్లు నాయకత్వంలో సంఘ నాయకులు ఆదివారం కలిసినట్టు జిల్లా సంఘ అధ్యక్షుడు పితాని త్రినాథరావు హైదరాబాద్ నుంచి ‘న్యూస్‌లైన్’కు ఫోన్‌లో తెలిపారు. వివిధ శాఖల్లో పనిచేస్తున్న ఔట్‌సోర్సింగ్, కాంట్రాక్టు ఉద్యోగులను క్రమబద్ధీకరించాలని ముఖ్యమంత్రిని కోరామన్నారు.
30 ఔట్‌సోర్సిం గ్, కాంట్రాక్టు యూనిట్లను తొలగించాలని తీసుకున్న నిర్ణయాన్ని, 28 ఇరిగేషన్ భూసేకరణ యూనిట్లను ఎత్తివేసే అంశాన్ని పునఃపరిశీలించాలని విజ్ఞప్తి చేశామన్నారు. అలాగే కలెక్టరేట్లలో అన్ని సెక్షన్లకు తహశీల్దార్లను నియమించాలని, సమైక్యాంధ్ర సమ్మె కాలానికి స్పెషల్ లీవు ఇవ్వాలని కోరినట్టు తెలిపారు. అలాగే రాష్ట్ర ఉపముఖ్యమంత్రి, రెవెన్యూ శాఖ మంత్రి కేఈ కృష్ణమూర్తిని మర్యాదపూర్వకంగా కలిసినట్టు త్రినాథ్ తెలిపారు. సంఘ రాష్ట్ర ఉపాధ్యక్షుడు వీఎస్ దివాకర్, జిల్లా కార్యదర్శి ఉదయభాస్కర్ ముఖ్యమంత్రిని కలిసిన వారిలో ఉన్నారన్నారు.