రెవెన్యూ అధికారులు ‘పైసా వసూల్’ పనిలో బిజీగా మారారు. ప్రతి పనికీ ఓ రేటు ఫిక్స్ చేసి అందినకాడికి దండుకుంటున్నారు. అవసరమైతే ప్రభుత్వ భూములకు కూడా పట్టాలు సృష్టించి అమాయకులైన వారికి అంటగట్టి లక్షలాది రూపాయలు వసూలు చేస్తున్నారు. వీరిదెబ్బకు భయపడిన కొందరు ఇప్పటికే ఉన్నతాధికారులకు కూడా ఫిర్యాదు చేశారు. కడుపుమండిన మరికొందరు బాధితులు ఏసీబీ అధికారులకు కూడా పట్టించారు. అయినప్పటికీ రెవెన్యూ సిబ్బంది ప్రవర్తనలో మార్పురాకపోవడంతో జనం తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.
అనంతపురం అర్బన్: రెవెన్యూ శాఖలో ‘పైసా వసూల్’కు అంతులేకుండా పోతోంది. ఇక్కడి అధికారులు పనుల కోసం వచ్చే సామాన్య ప్రజల రక్తం పిండుకుంటున్నారు. ముడుపులు ఇవ్వకపోతే కొర్రీలతో చుక్కలు చూపిస్తున్నారు. కొందరు అవినీతి అధికారుల అండదండలతోనే కింద స్థాయి అధికారులు, సిబ్బంది యథేచ్ఛగా అక్రమాలు సాగిస్తున్నట్లు తెలుస్తోంది.
ముడుపులిస్తేనే పనులు
రెవెన్యూ శాఖలో ప్రధానంగా తహసీల్దారు, రెవెన్యూ డివిజనల్ కార్యాలయాలు అవినీతికి నిలయాలుగా మారినట్లు ఆరోపణలున్నాయి. ముడుపులివ్వందే ఇక్కడ పనులు జరగవన్నది బహిరంగ రహస్యం. ఇక నిరక్షరాస్తులైన రైతులు ఈ కార్యాలయాలకు వెళితే అధికారులు వారి నుంచి భారీగా డబ్బు డిమాండ్ చేస్తున్నారు. డబ్బులివ్వని వారి పట్ల కొందరు రెవెన్యూ సిబ్బంది దురుసుగా కూడా మాట్లాడుతున్నట్లు ఆరోపణలున్నాయి. 1–బి, అండగల్‌లో మ్యుటేషన్(పేరు మార్పు), పట్టాదారు పాసుపుస్తకం, సబ్‌డివిజన్, తదితర పనులకు భారీగా డబ్బులు వసూలు చేస్తున్నట్లు బాధితులే బహిరంగంగా చెబుతున్నారు. ఇక నకిలీ పట్టాదారు పాసుపుస్తకాలు సృష్టించి కోట్ల రూపాయల్లో అవినీతికి పాల్పడుతున్నారనే విమర్శులు ఉన్నాయి. గతంలో నకిలీ పట్టాదారు పాసుపుస్తకాల వ్యవహారంలోనూ కొందరు రెవెన్యూ సిబ్బంది హస్తం ఉన్నట్లు తేలింది.
గతంలో పనిచేసిన అ«ధికారి అండతో...
గతంలో ఇక్కడ పనిచేసిన ఒక ఉన్నతాధికారి అండతో రెవెన్యూ శాఖలో అవినీతి తారస్థాయికి చేరిందనే ఆరోపణలున్నాయి. పైకి నీతిమంతుడిగా మాట్లాడే సదరు అధికారి... కిందిస్థాయి సిబ్బంది నుంచి నెల మామూళ్లు దండుకుంటుంటారనే విమర్శులు ఉన్నాయి. ఆ అధికారే రెవెన్యూ శాఖలో అవినీతిని పెంచి పోషించారని ఆ శాఖకు చెందిన కొందరు సిబ్బందే చెప్పుకుంటున్నారు.
ఆ ఉన్నతాధికారి, మరో అధికారి సహకారంతో శింగనమల మండలం పరిధిలో పెద్ద ఎత్తున్న అక్రమాలు జరిగాయనీ, ఈ క్రమంలో వీరికి పెద్దమొత్తంలో ముడుపులూ ముట్టాయనే ఆరోపణలు ఉన్నాయి. అత్యంత కీలకమైన రెవెన్యూ శాఖలో అవినీతి అడ్డుకట్ట వేయకపోతే ప్రమాదకరంగా మారుతుందనీ, ఇప్పటికైనా ఉన్నతాధికారులు స్పందించి అన్ని స్థాయిల్లో అవినీతికి ఆస్కారం లేకుండా చూడాల్సిన అవసరం ఉంది.
►పెనుకొండ మండలం గుట్టూరు వీఆర్‌ఓ రంగనాథ్ ఈ నెల 23న రైతు నుంచి రూ.5 వేలు లంచం తీసుకుంటూ అవినీతి నిరోధక శాఖ అధికారులకు పట్టబడ్డాడు.
► పెద్ద వడుగూరు మండలం పరిధిలోని ఒక గ్రామ వీఆర్‌ఓ ప్రతి పనికీ వేలాది రూపాయలు వసూలు చేస్తున్నారు. ఇతని వైఖరిపై ఇటీవలే కొందరు రైతులు రెవెన్యూ ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేశారు.
► శింగనమల మండల పరిధిలో రెవెన్యూ సిబ్బంది పెద్ద ఎత్తున అక్రమాలకు పాల్పడ్డారు. సర్వే నంబర్లకు లెటర్లు సృష్టించి దాదాపు 1,500 ఎకరాలకు నకిలీ పాసు పుస్తకాలు ఇచ్చారు. ఈ వ్యవహారంలో రూ.2 కోట్ల మేర అవినీతి జరిగినట్లు ఆరోపణలు ఉన్నాయి.
►పెనుకొండ వద్ద కియా పరిశ్రమకు కేటాయించిన 179 సర్వే నంబర్ భూమిని ఏకంగా స్కెచ్‌లోంచి తొలగించారనే ఆరోపణలు ఉన్నాయి. దీని వెనుక పెద్ద ఎత్తున్న అవినీతి చోటు చేసుకున్నట్లు ఆరోపణలు ఉన్నాయి.
...వెబ్‌ల్యాండ్‌లో తప్పలు సరిచేసుకోవాలన్నా, పట్టాదారు పాసు పుస్తకం పొందాలన్నా డబ్బులు ముట్టజెబితే కాని పనులకు కాని పరిస్థితి. పనుల కోసం వెళితే డబ్బులు అడుగుతున్నారంటూ ‘మీ కోసం’ కార్యక్రమంలో అధికారులకు బాధితులు విన్నవించిన సందర్భాలు చాలానే ఉన్నాయి.