సాక్షి, అమరావతి: పేదల ఇళ్ల నిర్మాణానికి సంబంధించి ఏపీ టౌన్‌షిప్, ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ (ఏపీటిడ్కో)లో రివర్స్ టెండరింగ్ ప్రక్రియ ప్రజాధనాన్ని భారీగా ఆదా చేస్తోంది. మొదటి దశలో ఇప్పటికే దాదాపు రూ.106 కోట్ల మేర ప్రజాధనం ఆదా కాగా తాజాగా శుక్రవారం రెండో దశ రివర్స్ టెండరింగ్‌లో రూ.46.03 కోట్లు ఖజానాకు మిగలడం గమనార్హం.
6,496 ఇళ్లకు రివర్స్...
అనంతపురం, పశ్చిమ గోదావరి జిల్లాలో 6,496 ఇళ్ల నిర్మాణానికి రూ.317.45 కోట్ల అంచనా వ్యయంతో రివర్స్ టెండరింగ్ ప్రక్రియ చేపట్టారు. అంచనా వ్యయం కంటే 14.50 శాతం తక్కువకు అంటే రూ.271.42 కోట్లతో పనులు పూర్తి చేసేందుకు కాంట్రాక్టు సంస్థలు బిడ్లు దాఖలు చేశాయి. తద్వారా ఖజానాకు రూ.46.03 కోట్లు ఆదా అయ్యాయి.
ఆదా ఇలా..
►అనంతపురం జిల్లాలో (ఫేజ్ – 2) రూ. 220.69 కోట్ల అంచనాతో 4,608 ఇళ్ల నిర్మాణానికి రివర్స్ టెండరింగ్ నిర్వహించారు. ఎన్‌జేఆర్ కన్‌స్ట్రక్షన్స్ రూ.188.69 కోట్లకు బిడ్ దాఖలు చేసి ఎల్–1గా నిలిచింది. ఇదే ప్రాజెక్టుకు గత ప్రభుత్వం చదరపు అడుగుకు రూ.1,596 చొప్పున కాంట్రాక్టు ఖరారు చేసింది. అంతకంటే 14.50% తక్కువకు అంటే చదరపు అడుగు రూ. 1,365కే ప్రస్తుతం రివర్స్ టెండరింగ్‌లో బిడ్ దాఖలు చేయడంతో రూ.32 కోట్లు ఆదా అయ్యాయి.
►పశ్చిమ గోదావరి జిల్లాలో రూ.96.76 కోట్ల అంచనా వ్యయంతో 1,888 ఇళ్ల నిర్మాణానికి రివర్స్ టెండరింగ్ నిర్వహించారు. శ్రద్ధ శబూరి సంస్థ 14.50 శాతం తక్కువకు అంటే రూ.82.73 కోట్లకు బిడ్ దాఖలు చేసి ఎల్–1 గా నిలిచింది. టీడీపీ హయాంలో ఈ ప్రాజెక్టులో చదరపు అడుగుకు రూ. 1,602 చొప్పున కాంట్రాక్టు ఇచ్చారు. ప్రస్తుతం రివర్స్ టెండరింగ్‌లో రూ.1,370 చొప్పున కాంట్రాక్టు ఖరారు చేయడంతో రూ.14.03 కోట్ల ప్రజాధనం ఆదా అయింది.
‘రివర్స్’ విజయవంతం
‘ ప్రజాధనాన్ని ఆదా చేసేందుకు ప్రభుత్వం చేపట్టిన రివర్స్ టెండరింగ్ విధానం విజయవంతమవుతోంది. ఏపీ టిడ్కోరెండో దశ రివర్స్ టెండరింగ్ ద్వారా రూ.46.03 కోట్ల ప్రజాధనాన్ని ఆదా చేశాం. మొదటి దశలో సుమారు రూ. 106 కోట్లు ఆదా అయ్యాయి. ఇదే స్ఫూర్తితో రివర్స్ టెండరింగ్ ప్రక్రియను కొనసాగిస్తాం’ – బొత్స సత్యనారాయణ, పురపాలక శాఖ మంత్రి
మలిదేవి డ్రెయిన్ పనుల్లో రూ.3.02 కోట్లు ఆదా
మలిదేవి డ్రెయిన్ ఆధునికీకరణ పనులకు జలవనరుల శాఖ శుక్రవారం నిర్వహించిన రివర్స్ టెండరింగ్‌లో ఖజానాకు రూ.3.02 కోట్లు ఆదా అయ్యాయి. 4.19 శాతం తక్కువ ధర (రూ. 69.09 కోట్లు) కోట్ చేసిన ఆర్కేఎన్ ప్రాజెక్ట్స్ ఈ పనులు దక్కించుకుంది. సంస్థ అర్హతలను మరోసారి పరిశీలించాక పనులు అప్పగించాలని సిఫార్సు చేస్తూ సీవోటీ (కమిషనర్ ఆఫ్ టెండర్స్)కి నెల్లూరు నీటిపారుదల విభాగం ఎస్‌ఈ ప్రసాదరావు ప్రతిపాదనలు పంపనున్నారు.
ప్రైస్ బిడ్‌లోనే 2.67 కోట్లు ఆదా
నెల్లూరు జిల్లాలో మలిదేవి డ్రెయిన్, మరో 3 అనుబంధ డ్రెయిన్ల ఆధునికీకరణకు రూ.72.11 కోట్ల అంచనా వ్యయంతో ఎల్‌ఎస్–ఓపెన్ విధానంలో జలవనరుల శాఖ గత నెల 19న టెండర్ నోటిఫికేషన్ జారీ చేసింది. ఆర్కేఎన్ ప్రాజెక్ట్స్, టీఎస్సార్ కన్‌స్ట్రక్షన్స్ షెడ్యూళ్లు దాఖలు చేశాయి. ప్రైస్‌బిడ్ శుక్రవారం తెరవగా 3.69 శాతం తక్కువ ధర కోట్ చేసిన సంస్థ ఎల్–1గా నిలిచింది. దీంతో ప్రైస్ బిడ్ స్థాయిలోనే రూ.2.67 కోట్లు ఆదా అయ్యాయి.
ప్రైస్ బిడ్‌లో ఎల్–1గా నిలిచిన సంస్థ కోట్ చేసిన రూ.69.44 కోట్లను కాంట్రాక్టు విలువగా నిర్ణయించి ఈ–ఆక్షన్ (రివర్స్ టెండరింగ్) నిర్వహించారు. గడువు ముగిసే సమయానికి రూ.69.09 కోట్లకు పనులు చేయడానికి ముందుకొచ్చిన ఆర్కేఎన్ ప్రాజెక్ట్స్ సంస్థ ఎల్–1గా నిలిచి పనులు దక్కించుకుంది.
Comments
Please login to add a commentAdd a comment