ఓ రైస్‌మిల్లర్ నిర్వాకం
రూ.కోటిన్నర రుణం పొందిన వైనం
ఫిర్యాదుపై అధికారుల విచారణ
బ్యాంకు అధికారులపై
కేసు నమోదు చేస్తామని హెచ్చరిక
ఏలూరు (టూ టౌన్) : ప్రభుత్వం కొనుగోలు కేంద్రాల ద్వారా రైతుల నుంచి సేకరించిన ధాన్యాన్ని జిల్లాలోని ఒక రైస్‌మిల్లు యజమాని తాకట్టు పెట్టి ప్రైవేటు బ్యాంకు నుంచి రూ.కోటి 50 లక్షలు రుణం తీసుకున్నాడు. దీనిపై జిల్లా ఉన్నతాధికారులకు ఫిర్యాదు అందడంతో రుణం ఇచ్చిన బ్యాంకు మేనేజర్‌పై కేసు నమోదు చేస్తామని బెదిరించడంతో పాటు రైస్‌మిలర్‌ను కూడా అధికారులు హెచ్చరించారు. కామవరపుకోట మండలంలోని రావికంపాడు, కామవరపుకోట, మొండూరు గ్రామాల్లోని ఐకేపీ కొనుగోలు కేంద్రాల ద్వారా 2014 ఖరీఫ్‌లో రైతుల నుంచి సేకరించిన రూ.80 లక్షల విలువైన 35వేల 564 క్వింటాళ్ల ధాన్యాన్ని తడికలపూడిలోని శ్రీనివాసా రైస్‌మిల్లుకు పంపించారు.
2015 జూలైలోపు ఈ ధాన్యాన్ని మిల్లింగ్ చేసి బియ్యాన్ని ఏలూరులోని ఎఫ్‌సీఐ గోడౌన్‌కు తరలించాలని జిల్లా పౌరసరఫరాల అధికారులు రైస్‌మిల్లర్ ఈడ్పుగంటి వెంకట శ్రీనివాసరావును ఆదేశించారు. రైస్‌మిల్లు యజమాని ధాన్యాన్ని రైస్‌మిల్లులో కాకుండా గోడౌన్‌లో భద్రపరిచి తానే రైతుల నుంచి కొనుగోలు చేస్తున్నట్టు చూపి రాజమండ్రిలోని ఒక ప్రైవేటు బ్యాంకు నుంచి రూ.కోటి 50 లక్షల రుణం తీసుకున్నారు. దీనిపై జిల్లా పౌరసరఫరాల శాఖాధికారులకు సమాచారం అందడంతో బ్యాంకు మేనేజర్‌కు నోటీసు పంపిస్తూ ప్రభుత్వ ధాన్యానికి రుణం ఎలా ఇచ్చారంటూ కేసు పెడతామని హెచ్చరించారు. బ్యాంకు మేనేజర్, సిబ్బంది తడికలపూడి చేరుకుని రైస్‌మిల్లర్‌ను నిలదీశారు. అతను రెండు రోజుల్లో రుణం మొత్తం కట్టివేస్తానని చెప్పారు.
పౌరసరఫరాల శాఖ అధికారులు కూడా రైస్‌మిల్లు యజమాని శ్రీనివాసరావుకు నోటీసు జారీ చేసి ధాన్యం ఆడించి బియ్యాన్ని ఎఫ్‌సీఐ గోడౌన్‌కు తరలించాలని ఆదేశించారు. పౌరసరఫరాలశాఖ జిల్లా మేనేజర్ వి.వలసయ్య ఆధ్వర్యంలో అధికారులు శుక్రవారం తడికలపూడి రైస్‌మిల్లుకు వెళ్లి కామవరపుకోట తహసిల్దార్ నర్సింహరాజు సమక్షంలో విచారణ నిర్వహించారు. ఐకేపీ కేంద్రాల ద్వారా పంపించిన 35 వేల 564 క్వింటాళ్లకు గాను దానిలో 10 వేల క్వింటాళ్ల ధాన్యం తక్కువగా ఉన్నట్టు గుర్తించారు. ఈ నెలాఖరులోపు ఎఫ్‌సీఐ గోడౌన్‌కు ధాన్యాన్ని మిల్లింగ్ చేసి బియ్యాన్ని పంపిణీ చేస్తానని రైస్‌మిల్లు యజమాని వద్ద హామీపత్రంతో పాటు బ్యాంకు గ్యారంటీ తీసుకున్నారు. ఈ విచారణలో పౌరసరఫరాల శాఖ అసిస్టెంట్ మేనేజర్ సీహెచ్ రామానుజమ్మ, ఫుడ్ ఇన్‌స్పెక్టర్ కె.రమేష్‌కుమార్, ఏజీపీవో టి.శివప్రసాద్, సివిల్ సప్లయ్స్ డీటీ శ్రీనివాస్, ఆర్‌ఐ సుబ్బారావు, వీఆర్వో మురళీ పాల్గొన్నారు.
సర్కారు ధాన్యం సొంతానికి తాకట్టు
Published Sat, Sep 5 2015 12:51 AM | Last Updated on Sun, Sep 3 2017 8:44 AM
Advertisement
Advertisement