రైస్‌మిల్లులో.. ఇంటి దొంగలు! | Ricemill .. Home thieves! | Sakshi
Sakshi News home page

రైస్‌మిల్లులో.. ఇంటి దొంగలు!

Published Thu, Sep 5 2013 3:18 AM | Last Updated on Fri, Sep 1 2017 10:26 PM

Ricemill .. Home thieves!

 సాక్షి ప్రతినిధి, కరీంనగర్ : రైస్ మిల్లర్ల అనుమతి లేకుండా వారికి చెందిన కస్టమ్ మిల్లింగ్ బియ్యం(సీఎంఆర్) పర్మిట్ల బదలాయింపు వ్యవహారంలో భారీగా అక్రమాలు జరిగినట్లు తెలుస్తోంది. 12 మంది మిల్లర్లకు సంబంధించిన సీఎంఆర్ పర్మిట్ల బదలాయింపు వారికి తెలియకుండానే పూర్తి కావడం సంచలనం రేపుతోంది. అధ్యక్షుడిపై నమ్మకంతో సంతకాలు చేసిన పర్మిట్లను అసోసియేషన్‌లో పెడితే... ఇలా చేయడం ఏమిటని కొందరు మిల్లర్లు ప్రశ్నిస్తున్నారు.
 
 అక్రమంగా బదిలీ అయిన పర్మిట్ల విలువ రూ.1.05 కోట్లు ఉంటుందని తెలుస్తోంది. జిల్లా మిల్లర్ల సంఘం నేతృత్వంలో జిల్లా సరఫరాల అధికారి ఆమోదంతోనే ఇదంతా జరిగినట్లు సమాచారం. ఈ పర్మిట్లతో రూ.45 కోట్ల విలువ చేసే బియ్యాన్ని మార్కెట్‌లో అమ్ముకునే అవకాశం ఉందని పౌర సరఫరాల శాఖ అధికారులే చెబుతున్నారు.
 
 2011-12 ఖరీఫ్ మార్కెట్ సీజన్‌కు సంబంధించి జిల్లాలో ఇందిరాక్రాంతి పథం, ప్రాథమిక వ్యవసాయ సహకార సం ఘాల ద్వారా ధాన్యం సేకరించారు. ప్రభుత్వం సేకరించిన ధాన్యాన్ని బియ్యంగా మార్చి (సీఎంఆర్) ఇవ్వడానికి జిల్లాలోని 426 మంది మిల్లర్లకు ఇచ్చారు. ప్రభుత్వం రైతుల నుంచి సేకరించిన ఈ ధాన్యాన్ని బియ్యంగా మార్చి ఇచ్చే మిల్లర్లకు... వాళ్లు సొంతంగా కొనుగోలు చేసిన ధాన్యంతో వచ్చే బియ్యాన్ని బహిరంగ మార్కెట్‌లో అమ్ముకునేందుకు పర్మిట్లు ఇస్తారు. ప్రభుత్వానికి కస్టమ్ మిల్లింగ్ బియ్యం ఎంత ఇస్తే... అంతే పరిమాణం మేరకు మార్కెట్‌లో అమ్ముకోవడానికి పర్మిట్ ఉంటుంది.
 
 పభుత్వానికి కస్టమ్ మిల్లింగ్ బియ్యం ఇచ్చిన కొందరు మిల్లర్ల వద్ద రైతుల నుంచి సేకరించిన ధాన్యం ఉండదు. ఇలాంటి సందర్భాల్లో వీరికి ఉన్న పర్మిట్లను జిల్లా పౌర సరఫరాల అధికారి(డీఎస్‌వో) ఆమోదంతో ఇతరులకు బదలాయిస్తారు. అంతకుముందు కస్టమ్ మిల్లింగ్ పూర్తి చేసిన మిల్లరు దరఖాస్తు చేస్తే పౌర సరఫరాల అధికారి ఆమోదంతో ఇతరులకు బదలాయింపు జరిగేది. ఏడాది క్రితం ఈ విధానంలో మార్పులు చేశారు. రైస్ మిల్లరుతోపాటు రైస్ మిల్లర్ల సంఘం జిల్లా అధ్యక్షుడి సంతకాలతో వచ్చిన దరఖాస్తులనే జిల్లా సరఫరా అధికారి పరిశీలించి బదిలీ చేస్తారు. ఈ నిబంధనే జిల్లాలో కస్టమ్ మిల్లింగ్ పర్మిట్లలో అక్రమాలకు కారణమైంది. పర్మిట్ల బదలాయింపునకు అధ్యక్షుడి సంతకం తప్పనిసరి అనే ఉద్దేశంతో జిల్లా సంఘంలో సభ్యత్వం ఉన్న మిల్లర్లందరూ సంతకాలు చేసిన పత్రాలను సంఘం కార్యాలయంలోనే పెడుతున్నారు. నిబంధనలు మార్చినప్పటి నుంచి ఇలాగే చేస్తున్నారు. ఏడాదిగా బియ్యం ధరలు భారీగా పెరుగుతుండడంతో మిల్లర్ల సంఘం బాధ్యులు అసలు మిల్లర్లకు తెలియకుండానే పర్మిట్ల బదిలీల దరఖాస్తులను జిల్లా సరఫరా అధికారికి పంపించారు. మిల్లరు, జిల్లా అధ్యక్షుడి సంతకంతో వచ్చిన దరఖాస్తులను అధికారులు వెంటనే ఆమోదించారు. 12 మంది మిల్లర్లకు చెందిన 15 వేల టన్నుల బియ్యం పర్మిట్లు వారికి తెలియకుండానే బదలాయింపు అయ్యాయి. తమ కోటా పర్మిట్లను బదిలీ చేయాలని ఆ మిల్లర్లు నాలుగు రోజుల క్రితం అధికారులను సంప్రదించగా కోటా పూర్తయిందని చెప్పడంతో వారు అవాక్కయ్యారు. తాము ఒప్పుకోకుండానే ఎలా తమ కోటా పూర్తయిందని ఆందోళన చెందారు. ఆరా తీస్తే అక్రమాల విషయం బయటపడింది.
 
 2011-12 ఖరీఫ్ మార్కెట్ సీజన్‌లో జిల్లాలో 5.91 లక్షల టన్నుల కస్టమ్ మిల్లింగ్ బియ్యం సేకరణ లక్ష్యంగా ఉంది. ఇంతే పరిమాణంలో బియ్యం విక్రయాలకు పర్మిట్లను మిల్లర్లకు ఇవ్వాల్సి ఉంది. రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటివరకు 2.06 లక్షల టన్నుల పర్మిట్లకు అనుమతించింది. వీటిలో 84 వేల టన్నుల మేరకు జిల్లా పౌర సరఫరాల అధికారి అనుమతి ఇచ్చారు. వీటిలోనే 15 వేల టన్నుల మేర అక్రమాలు జరిగినట్లు బయటపడింది. ఇక పర్మిట్ల ప్రక్రియ మొత్తం పూర్తి చేస్తే ఈ అక్రమాలు ఎంత మేరకు ఉంటాయనేది అంతుపట్టకుండా ఉందని పలువురు మిల్లర్లు పేర్కొంటున్నారు.
 
 పొరపాట్లు నిజమే..
 - కె.మారుతి, జిల్లా అధ్యక్షుడు, రైస్ మిల్లర్ల సంఘం
 మిల్లర్ల సంఘంలో సభ్యత్వం ఉన్న అందరు మిల్లర్ల పర్మిట్ బదిలీకి సంబంధించిన పత్రాలు వారు సంతకాలు చేసినవి సంఘం కార్యాలయంలో ఉంటాయి. పర్మిట్ల బదలాయింపు విషయంలో పొరపాట్లు జరిగాయని కొందరు మిల్లర్లు అంటున్నమాట నిజమే. అయితే వారు ఫోన్ ద్వారా చెప్పిన తర్వాతే పర్మిట్లను బదలాయించాలని సంఘం ద్వారా డీఎస్వోకు పంపిం చాం. వారు ఇప్పుడు మాట మారుస్తున్నారు.
 చర్యలు తీసుకుంటాం
 - చంద్రప్రకాశ్, జిల్లా సరఫరాల అధికారి
 
 రైస్ మిల్లర్ల సంఘం అధ్యక్షుడు మారుతి సంతకంతో వచ్చిన సీఎంఆర్ పర్మిట్లనే నేను బదిలీ చేశాను. 12 మంది మిల్లర్ల పర్మిట్ల బదలాయిం పులో పొరపాటు జరిగినట్లు నాకు మౌఖి కంగా తెలిసింది. దీనిపై ఎవరు ఫిర్యాదు చేయలేదు. నష్టపోయిన వారు ఫిర్యాదుచేస్తే విచారణ జరిపి చర్యలు తీసుకుంటాం. ఇక ముందు ఇలా జరగకుండా చర్యలు తీసుకుంటున్నాం. 12మంది మిల్లర్ల విషయం తెలియగానే సీఎం ఆర్ పర్మిట్ల బదలాయింపు నిలిపివేశాం. ఇక నుంచి పర్మిట్ బదలాయింపు దరఖాస్తులో ఉన్న రైస్ మిల్లర్‌తో ఫోన్‌లో మాట్లాడిన తర్వాతే బదిలీ చేస్తాం.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement