సర్కారు ధాన్యం హాంఫట్ | Confiscated grain hamphat | Sakshi
Sakshi News home page

సర్కారు ధాన్యం హాంఫట్

Published Tue, Oct 1 2013 4:05 AM | Last Updated on Fri, Sep 1 2017 11:12 PM

Confiscated grain hamphat

ప్రభుత్వ ధాన్యాన్ని కొందరు రైస్‌మిల్లర్లు సొంత ఆస్తిగానే భావిస్తున్నారు. ధాన్యం తీసుకుని గడువులోగా బియ్యం అప్పగించాలనే నిబంధనలను అస్సలు పట్టించుకోవడం లేదు. రాజకీయ పలుకుబడితో వరుసగా మూడో ఏడాది కూడా రైస్‌మిల్లర్లు గడువులోగా బియ్యం అప్పగించడం మరిచిపోయారు. వ్యవసాయ ఉత్పత్తుల క్రయవిక్రయాలకు సంబంధించి ప్రతి ఏటా ప్రభుత్వం ఖరీఫ్ మార్కెట్ సీజన్‌గా భావిస్తుంది.
 
 ఖరీఫ్, రబీల్లో వచ్చే ఉత్పత్తులను కలిపి మార్కెటింగ్ పరంగా ఖరీఫ్ సీజన్‌గానే పేర్కొంటుంది. అక్టోబర్ ఆరంభం నుంచి వచ్చే ఏడాది సెప్టెంబర్ వరకు ఈ సీజను ఉంటుంది. 2012-13 ఖరీఫ్ మార్కెట్ సీజన్ సోమవారం(సెప్టెంబరు 30)తో ముగిసింది. జిల్లాలోని మిల్లర్లు మాత్రం ఇంకా 14,281 టన్నుల బియ్యాన్ని అప్పగించకుండా తమ వద్దే పెట్టుకున్నారు. రాజకీయ అండదండలతోనే వీరు నిబంధనలను పట్టించుకోవడంలేదనే అభిప్రాయం వ్యక్తమవుతోంది.
 

 సాక్షిప్రతినిధి, కరీంనగర్ : రెండుమూడేళ్లుగా జిల్లాలో ప్రభుత్వ ధాన్యాన్ని రైస్‌మిల్లర్లు స్వాహా చేయడం రివాజుగా మారుతోంది. 2012-13 ఖరీఫ్ మార్కెట్ సీజన్‌లోనూ ఇదే జరిగింది. సోమవారంతో గడువు ముగిసినా ఇప్పటికీ ఇంకా 5056 టన్నుల బియ్యాన్ని రైస్‌మిల్లర్లు తమ వద్దే పెట్టుకున్నారు. 2012-13 ఖరీఫ్, రబీల్లో కలిపి ఇందిరా క్రాంతిపథం(ఐకేపీ), ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘాలు(పీఏసీఎస్), గిరిజన సహకార సంఘాలు(జీసీసీ) ద్వారా రాష్ట్ర ప్రభుత్వం 7,31,497 టన్నుల ధాన్యాన్ని సేకరించింది. ఈ ధాన్యాన్ని బియ్యంగా మార్చి ఇచ్చేందుకు ఖరీఫ్‌లో 357 మంది మిల్లర్లకు, రబీలో 253 మంది మిల్లర్లకు ఇచ్చింది. రెండు సీజన్లలో కలిపి ధాన్యం తీసుకున్న మిల్లర్లు 4,97,418 టన్నుల బియ్యాన్ని పౌరసరఫరాల శాఖకు అప్పగించాలి.
 
 ఇదంతా గడువు ముగిసేలోపే జరగాలి. ప్రభుత్వ ధాన్యాన్ని సొంత ఆస్తిగా భావించే ధోరణిలో జిల్లాలోని మిల్లర్లు ఉండడంతో ఇంకా 14,281 టన్నుల బియ్యం వీరి వద్దే ఉండిపోయింది. ఇలా మిల్లర్లు ప్రభుత్వానికి ఇవ్వకుండా దాచిపెట్టుకున్న బియ్యం విలువ బహిరంగ మార్కెట్‌లో ధర ప్రకారం అయితే ఏకంగా రూ.42.84 కోట్లు ఉంటుంది. ఇలా ప్రభుత్వ బియ్యం ఇవ్వని మిల్లర్లు ఖరీఫ్‌లో 10 మంది ఉన్నారు. రబీ సీజన్ బియ్యం ఇవ్వని వారి సంఖ్య రెట్టింపు సంఖ్యలో ఉంది.
 మన బియ్యం.. లక్ష్యానికి దూరం..
 ప్రజాపంపిణీ వ్యవస్థ(పీడీఎస్) కింద రేషన్ డీలర్ల ద్వారా పేదలకు సబ్సిడీపై పంపిణీ చేస్తున్న బియ్యం నాణ్యతపై విమర్శలు వస్తుండడంతో ప్రభుత్వం మన బియ్యం విధానాన్ని తీసుకువచ్చింది. గతంలో రైతుల నుంచి ధాన్యం సేకరించిన రైస్‌మిల్లర్లు భారత ఆహార సంస్థ(ఎఫ్‌సీఐ)కి బియ్యం లెవీగా ఇచ్చేవారు. ఎఫ్‌సీఐ నుంచి రాష్ట్ర ప్రభుత్వం ఈ బియ్యాన్ని తీసుకుని పౌర సరఫరాల సంస్థ ద్వారా రేషన్ దుకాణాలకు చేరవేసేది. దీంతో ఒక్కోసారి ఇతర రాష్ట్రాల్లో పండించిన బియ్యం కూడా జిల్లాలో పంపిణీ అయ్యేవి. దీంతో నాణ్యతపై విమర్శలు వచ్చేవి. దీనికి విరుగుడుగా ప్రభుత్వం స్థానికంగా పండిన ధాన్యంతో వచ్చిన బియ్యాన్నే పేదలకు పంపిణీ చేయాలని, దీనివల్ల గోదాములు, రవాణా సమస్యలు తగ్గుతాయని భావించింది.
 
 2012-13 ఖరీఫ్‌లో ప్రారంభించిన ఈ విధానం కింద జిల్లాలో రెండు లక్షల టన్నుల నాణ్యమైన పచ్చిబియ్యం సేకరించాలని ప్రభుత్వం నిర్ణయించింది. ధాన్యం ఉత్పత్తితో మొదటి స్థానంలో ఉండే జిల్లాలో గడువు ముగిసినా ‘మన బియ్యం’ లక్ష్యం మాత్రం చేరలేదు. బహిరంగ మార్కెట్‌లో బియ్యం ధరలు ఎక్కువగా ఉండడంతో రైస్‌మిల్లర్లు ప్రభుత్వానికి ఇవ్వకుండా అధిక ధరలకు అమ్ముకున్నారు. దీంతో సోమవారం నాటికి లక్ష్యం కంటే 11 వేల టన్నులు తక్కువగా ప్రభుత్వం సేకరించింది.
 
 ఎఫ్‌సీఐకి ఎగనామం
 రైతుల నుంచి రైస్‌మిల్లర్లు సేకరించిన ధాన్యంతో వచ్చే బియ్యాన్ని భారత ఆహార సంస్థకు లెవీ ఇవ్వడం అనేది జిల్లాలో సరిగా అమలు కావడంలేదు. మన బియ్యం విధానం కింద పచ్చి బియ్యాన్ని మిల్లర్ల ద్వారా తీసుకోవాలని నిర్ణయించగా... జిల్లాలోని 283 మంది మిల్లర్ల నుంచి 2.25 లక్షల టన్నుల ఉప్పుడు బియ్యాన్ని భారత ఆహార సంస్థతో లెవీగా సేకరించాలని లక్ష్యంగా నిర్ణయించారు.
 
 బహిరంగ మార్కెట్‌లో లాభాలు వచ్చే పరిస్థితి ఉండడంతో ఎఫ్‌సీఐకి సైతం మిల్లర్లు లక్ష్యం మేరకు బియ్యం ఇవ్వలేదు. ఖరీఫ్ మార్కెట్ సీజన్ గడువు ముగిసిన సెప్టెంబరు 30 నాటికి 1.20 లక్షల టన్నులు మాత్రమే ఇచ్చారు. మిగిలిన లక్ష్యం ఎప్పటికి పూర్తవుతుందనేది అంతుపట్టని విషయంగా మారింది.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement