సాక్షి ప్రతినిధి, కరీంనగర్ : బియ్యం అక్రమ పర్మిట్ల వ్యవహారానికి సెటిల్‌మెంట్ తో ముగింపు పలికింది. రైస్ మిల్లర్ల సంఘం జిల్లా కార్యాలయంలోనే ఈ బేరం కుదిరింది. వ్యాపారులకు కలిసి వచ్చే శుక్రవారం రోజునే ఈ సెటిల్‌మెంట్ పూర్తయ్యింది. పౌర సరఫరాల అధికారి సూచనతో రైస్ మిల్లర్ల సంఘం అధ్యక్షుడు కోలేటి మారుతి పూనుకుని ఈ తతంగం పూర్తి చేశా రు. మిల్లర్లకు తెలియకుండా వారి ప్రోత్సాహక పర్మిట్లను అమ్ముకోవడం తప్పేనని మిల్లర్ల సంఘం పెద్దలు ఒప్పుకున్నారు. అధికారులకు ఫిర్యాదులు చేస్తే అక్రమాల బాగోతం అంతా బయటపడుతుందని, పరిహారం చెల్లిస్తామని 12 మంది మిల్లర్లను ఒప్పించారు. వీరందరికీ కలిపి రూ.13.50 లక్షలు ఇచ్చేలా సంఘం ముఖ్యులు పంచాయితీ తెంపారు. పర్మిట్లను తమకు తెలియకుండా అమ్ముకోవడం వల్ల కలిగిన నష్టం కంటే ఇది ఎక్కువ మొత్తం కావడంతో నష్టపోయిన మిల్లర్లు కూడా వెంటనే ఒప్పుకున్నట్లు తెలిసింది.
సెటిల్‌మెంట్ మొత్తం తీసుకున్న తర్వాత, ఈ 12 మంది మిల్లర్లకు భవిష్యత్తులో అధికారుల నుంచి ఇబ్బంది కలగకుండా చూస్తామని మిల్లర్ల సంఘం గట్టి హామీ ఇచ్చినట్లు ఈ ప్రక్రియలో పాల్గొన్న మిల్లర్లు చెప్పారు. పర్మిట్ల అమ్మకంలో నష్టపోయిన మిగిలిన మిల్లర్లు వస్తే వారికి సైతం మంచిగానే సెటిల్ చేస్తామని, అనవసరంగా అధికారులకు ఫిర్యాదు చేస్తే అందరికీ ఇబ్బందులు వస్తాయని చెప్పినట్లు తెలిపారు. ఇక నుంచి ఎలాంటి అక్రమాలు బయటికి రాకుండా చూసుకోవాలని, అంతర్గతంగానే మాట్లాడుకోవాలని సంఘం ముఖ్యులు నిర్ణయించుకున్నట్లు తెలిసింది.
అక్రమాలిలా..
2011-12 ఖరీఫ్ మార్కెట్ సీజన్‌లో జిల్లాలో 5.91 లక్షల టన్నుల కస్టమ్ మిల్లింగ్ బియ్యం సేకరణ లక్ష్యంగా ప్రభుత్వం నిర్ణయించింది. జిల్లాలో ఇప్పటివరకు 226 మంది మిల్లర్లు మాత్రమే వందశాతం బియ్యం అప్పగించడంతో వీరికి 2.06 లక్షల టన్నుల బియ్యం విక్రయానికి పర్మిట్లు ఇవ్వాలని ప్రభుత్వం ఆదేశించింది. రైస్ మిల్లర్ల సంఘం పెత్తనంతో అధికారులు ఇప్పటి వరకు 87 వేల టన్నుల బియ్యం విక్రయానికి పర్మిట్లు ఇచ్చారు. దీంట్లో 15 వేల టన్నుల బియ్యం పర్మిట్ల బదలాయింపులో అక్రమాలు జరిగినట్లు ఆరోపణలు వచ్చాయి. రైతుల నుంచి ప్రభుత్వం కొనుగోలు చేసిన ధాన్యాన్ని బియ్యంగా మార్చి గడువులోగా అప్పగించిన రైస్ మిల్లర్లకు ప్రభుత్వం ప్రత్యేక ప్రోత్సాహక పర్మిట్లు ఇస్తుంది. ఈ పర్మిట్లతో రైతుల నుంచి నేరుగా కొనుగోలు చేసిన ధాన్యంతో వచ్చే బియ్యాన్ని మిల్లర్లు బహిరంగ మార్కెట్‌లో ఎక్కడైనా అమ్ముకునే వెసులుబాటు ఉంటుంది.
ఇలా సొంతంగా బియ్యం లేని వారు బహిరంగ మార్కెట్‌లో బియ్యం అమ్ముకునే అర్హతను ఇతరులకు బదిలీ చేసుకోవచ్చు. గతేడాది వరి విస్తీర్ణం తగ్గి బియ్యం ధరలు పెరగడంతో పర్మిట్లకు డిమాండ్ పెరిగింది. ఇదే అదనుగా అర్హులైన కొందరు రైస్ మిల్లర్ల ప్రత్యేక ప్రోత్సాహక పర్మిట్లను వారికి తెలియకుండానే ఇతరులకు బదిలీ అయినట్లు నాలుగు రోజుల క్రితం బయటపడింది. జిల్లా పౌర సరఫరాల అధికారి ఆమోదంతో రైస్ మిల్లర్ల సంఘం అధ్యక్షుడు ఇతరులకు ఎక్కువ ధరకు అమ్ముకున్నట్లు 12 మంది మిల్లర్లు ఆరోపించారు. వీరందరికీ పరిహారం చెల్లించడంతో ఈ అక్రమాలు నిజమేనని ఇప్పుడు స్పష్టమవుతోంది. పర్మిట్ల బదిలీతో నష్టపోయివారు గురువారమే ఫిర్యాదు చేసేందుకు కరీంనగర్‌కు రావాలని అనుకున్నారు. మిల్లర్ల సంఘం ముఖ్యుల ‘మధ్యవర్తిత్వం’తో ఆగిపోయారు. 12 మంది కలిసి శుక్రవారం కరీంనగర్‌కు వచ్చారు. అధికారులకు ఫిర్యాదు చేయాలనే ఉద్దేశంతోనే బయలుదేరినా... ఇలా చేస్తే భవిష్యత్తులో వ్యాపారం విషయంలో అధికారుల నుంచి ఇబ్బందులు వస్తాయని మిల్లర్ల సంఘం నుంచి హెచ్చరికలు వెళ్లినట్లు తెలిసింది. ఫిర్యాదు చేయకుండా సెటిల్‌మెంట్ చేసుకుంటే ఎక్కువ మొత్తంలో డబ్బులు వస్తాయని, అధికారుల నుంచి ఎలాంటి ఇబ్బంది ఉండకుండా చూస్తామని చెప్పినట్లు సమాచారం. పర్మిట్ల అక్రమాలతో నష్టపోయిన వారిలో ఎక్కువ మంది కొత్తగా రైస్ మిల్లింగ్ వ్యాపారంలోకి వచ్చిన వారే కావడంతో... సెటిల్‌మెంట్‌కే మొగ్గుచూపినట్లు సమాచారం.
బేరం కుదిరింది
Published Sat, Sep 7 2013 5:34 AM | Last Updated on Fri, Sep 1 2017 10:32 PM
Advertisement