సాక్షిప్రతినిధి, కరీంనగర్ : బహిరంగ మార్కెట్‌లో బియ్యం అమ్ముకునేందుకు ప్రభుత్వం రైస్‌మిల్లర్లకు ఇచ్చే ప్రత్యేక ప్రోత్సాహక పర్మిట్ల బదిలీల్లో అక్రమాల వ్యవహారం రాజకీయ మలుపు తిరిగింది. పర్మిట్ల బదిలీల్లో మోసపోయిన వారిలో అధికార పార్టీ నేత టి.కరుణాకర్ ఉన్నారు. 1300 క్వింటాళ్ల బియ్యానికి సంబంధించిన ప్రత్యేక ప్రోత్సాహక పర్మిట్లు తనకు తెలియకుండానే రైస్‌మిల్లర్ల సంఘం అధ్యక్షుడు కె.మారుతి సంతకంతో బదిలీ అయ్యాయని అంటున్నారు. క్వింటాల్‌కు సగటున రూ.3 వేలు ఉండే పర్మిట్ల విలువ తక్కువే అయినా... పంట ఉత్పత్తుల క్రయవిక్రయాలపై నియంత్రణ ఉండే కరీంనగర్ వ్యవసాయ మార్కెట్ కమిటీ డెరైక్టరుగా తనకే ఇలా జరగడంపై ఆయన అసహనంగా ఉన్నారు.
కరుణాకర్ తనకు జరిగిన మోసంపై ఎంపీ పొన్నం ప్రభాకర్‌కు ఫిర్యాదు చేశారు. దీనిపై ఎంపీ స్పందించి మారుతిని ప్రశ్నించినట్లు తెలిసింది. ఇద్దరినీ పిలిచి మంగళవారం మాట్లాడతానని పొన్నం ప్రభాకర్ చెప్పినట్లు తెలిసింది. మిగిలిని 12 మంది మిల్లర్లలాగే నష్టపరిహారం విషయంలో రాజీకుదిరే అవకాశం ఉందని రైస్‌మిల్లర్ల సంఘం వర్గాలు చెబుతున్నాయి. ఇవన్నీ ఎలా ఉన్నా... మంత్రి శ్రీధర్‌బాబు సొంత శాఖలో ఇలా వరుసగా అక్రమాలు వెలుగుచూస్తుండడం, ఇవి మంత్రికి వ్యతిరేక వర్గమైన పొన్నం ప్రభాకర్ వద్దకు చేరడం జిల్లాలో చర్చనీయాంశంగా మారింది.
పభుత్వ సంస్థలు రైతుల నుంచి కొనుగోలు చేసిన ధాన్యాన్ని బియ్యంగా మార్చే ప్రక్రియను కస్టమ్ మిల్లింగ్ రైస్(సీఎంఆర్) అంటారు. 2011-12 ఖరీఫ్ మార్కెట్ సీజనులో జిల్లాలో 5.91 లక్షల టన్నుల కస్టమ్ మిల్లింగ్ బియ్యం సేకరించాలని ప్రభుత్వం నిర్ణయించింది. జిల్లాలో 426 రైస్‌మిల్లులు ఉన్నాయి. ప్రభుత్వ ధాన్యం తీసుకున్న వారిలో 281 మంది మిల్లర్లు మాత్రమే వందశాతం బియ్యాన్ని అప్పగించారు. వీరికి 2.06 లక్షల టన్నుల బియ్యం బహిరంగ మార్కెట్‌లో అమ్ముకునే ప్రత్యేక ప్రోత్సాహక అర్హత పర్మిట్లను ఇవ్వాలని ప్రభుత్వం ఆదేశించింది. అధికారులు ఇప్పటివరకు 87 వేల టన్నుల బియ్యం విక్రయానికి పర్మిట్లు ఇచ్చారు. దీంట్లో 15 వేల టన్నుల బియ్యం పర్మిట్ల బదలాయింపులో అక్రమాలు జరిగినట్లు ఆరోపణలు వచ్చాయి.
రైతుల నుంచి ప్రభుత్వం కొనుగోలు చేసిన ధాన్యాన్ని బియ్యంగా మార్చి గడువులోగా అప్పగించిన రైస్‌మిల్లర్లకు ప్రభుత్వం ప్రత్యేక ప్రోత్సాహక అర్హత పర్మిట్లను ఇస్తుంది. ఈ పర్మిట్లతో రైతుల నుంచి నేరుగా కొనుగోలు చేసిన ధాన్యంతో వచ్చే బియ్యాన్ని మిల్లర్లు బహిరంగ మార్కెట్‌లో ఎక్కడైనా అమ్ముకునే వెసులుబాటు ఉంటుంది. ప్రభుత్వ బియ్యం లెక్కప్రకారం సకాలంలో అప్పగించి... తమ దగ్గర ఇతర బియ్యం లేని రైస్‌మిల్లర్లు ఈ ప్రత్యేక ప్రోత్సాహక అర్హత పర్మిట్లను ఇతర మిల్లర్లుకు బదిలీ చేసుకోవచ్చు. కరువు కారణంగా గత ఏడాది వరి విస్తీర్ణం తగ్గి బియ్యం ధరలు పెరగడంతో పర్మిట్లకు డిమాండ్ పెరిగింది. ఇదే అదనుగా అర్హులైన కొందరు రైస్‌మిల్లర్ల ప్రత్యేక ప్రోత్సాహక అర్హత పర్మిట్లను వారికి తెలియకుండానే ఇతరులకు బదిలీ అ య్యాయి. రైస్‌మిల్లర్ల సంఘం అధ్యక్షుడు ఇతరులకు ఎక్కువ ధరకు అమ్ముకున్నట్లు 12మంది మిల్లర్లు ఆరోపించారు. దీనిపై అధికారులకు ఫిర్యాదు చేసేందుకు సిద్ధమయ్యారు. ఇలా చేస్తే అందరికీ చట్టపరంగా ఇబ్బందులు తప్పవనే ఉద్దేశంతో వీరికి నష్టపరిహారంకింద రూ.13.50 లక్షలు ఇచ్చి పంచాయతీని ముగించుకున్నారు. ఈ విషయం సద్దుమణిగిందనుకున్న తరుణంలో మరో రైస్‌మిల్లరు అక్రమాలతో నష్టపోయానని బయటికి వచ్చారు. ఇలాంటి వారు ఇంకా చాలామంది ఉన్నారని వీరు త్వరలోనే బయటికి వస్తారని తెలుస్తోంది.
అక్రమాలు అవాస్తవం..
బియ్యం ప్రోత్సాహక పర్మిట్ల బదిలీల్లో అక్రమాలు జరిగాయనడంలో వాస్తవం లేదు. రైస్ మిల్లర్లు వారి గుమాస్తాలను పంపిస్తేనే నేను సంతకాలు పెట్టా. నా ప్రతిష్ట దిగజార్చేందుకే ఇలా తప్పుడు ఆరోపణలు చేస్తున్నారు. ఇప్పటికి 281 మంది మిల్లర్ల పర్మిట్లపై సంతకాలు చేశా. నేను ఎలాంటి అక్రమాలకు పాల్పడలేదు.
- కోలేటి మారుతి,
జిల్లా అధ్యక్షుడు, రైస్‌మిల్లర్ల సంఘం
ఎన్నికల వరకే..
రైస్‌మిల్లర్ల సంఘం వ్యవహారాల్లో నాకు సంబంధంలేదు. కేవలం సంఘం ఎన్నికల వరకే జోక్యం చేసుకున్నా. నాకు ఏ పర్మిట్ల విషయం తెలియదు. కరుణాకర్ నాకు ఏ విషయం చెప్పలేదు. నేను ఎవరినీ పిలిచి మాట్లాడుతా అనలేదు. నా పేరు ఎందుకు వాడుకుంటున్నారో నాకు తెలియదు.
- పొన్నం ప్రభాకర్, ఎంపీ
మంత్రి శాఖలో... ఎంపీ పంచాయితీ!
Published Wed, Sep 25 2013 5:02 AM | Last Updated on Fri, Sep 1 2017 11:00 PM
Advertisement