రైలొస్తే చాలు... కళ్లల్లో ఆశల దీపాలు వెలుగుతాయి. బస్సొస్తే చాలు కాళ్లన్నీ ఉత్సాహంతో పరుగులు తీస్తాయి. ప్రయాణికుల్ని చుట్టుముడతాయి. ఆప్యాయంగా పలకరిస్తాయి. బేరాల కోసం పోటీ పడతాయి. నెగ్గిన వాళ్లకు ఆ పూట సంబరం. మిగిలిన వాళ్లకు మళ్లీ నిరీక్షణం. వయసు మీరుతోంది. శరీరం మొరాయిస్తోంది. బతుకు బండిని లాగలేనంటోంది. ఎదుగూ బొదుగూ లేని జీవితం.. చరమాంకంలో తీరని విషాదం. బొబ్బిలి రిక్షా కార్మికుల వేదనకు అక్షర రూపం.
బొబ్బిలి రూరల్: ఒకప్పుడు బొబ్బిలి ప్రాంతంలో 500 వరకు రిక్షాలుండేవి. ఆటోల రంగ ప్రవేశంతో వారి బతుకు చిత్రం మారిపోయింది. వయసు మీరడం.. రిక్షాలకు డిమాండ్ తగ్గిపోవడంతో రిక్షాల సంఖ్య ప్రస్తుతం 200కు చేరుకుంది. కారాడ, అలజంగి, జగన్నాథపురం, పాతబొబ్బిలి, బొబ్బిలి ప్రాంతాలతో పాటు సీతానగరం మండలం లచ్చయ్యపేట తదితర ప్రాంతాల నుంచి రిక్షా కార్మికులు బొబ్బిలిలో రైల్వేకూడలి, చినబజారు సెంటర్, తాండ్ర పాపారాయ కూడలి, వేణుగోపాల కోవెల సెంటర్లలో వీరు అందుబాటులో ఉంటారు.
భరోసా లేని బతుకులు
రిక్షా కార్మికుల రోజు సంపాదన రూ.వంద లోపే. వారి బాగోగుల కోసం ప్రభుత్వంతో పోరాడేందుకు సంఘాల్లేవు. కొత్త రిక్షాలు లేక పాత రిక్షాలే నడుపుతున్న కార్మికులకు శక్తి ఉన్నంతవరకే పని.
ఇళ్లకు నోచని కార్మికులు
ప్రభుత్వ సంక్షేమ పథకాలపై అవగాహన లేకపోవడంతో సద్వినియోగం చేసుకోలేకపోతున్నారు. దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్‌రెడ్డి పాలనలో వీరికి ఇళ్లు మంజూరయ్యాయి. అప్పట్లో కట్టుకోలేని వారికి మరి అవకాశం రాలేదు. చంద్రన్న బీమా, పొదుపు సంఘాలపై అవగాహన లేకపోవడంతో వాటి లబ్ధి పొందలేకపోతున్నారు. కొందరికి ఆరోగ్యశ్రీ కార్డులు ఉన్నాయి. లేనివారు డబ్బు లేక ఎక్కడికీ వెళ్లలేక అనారోగ్యంతో బాధపడుతున్నారు. మద్యం, పాన్‌పరాగ్‌లతో పాటు కొందరు గంజాయి తదితర వ్యసనాల బారిన పడుతున్నారు.
Comments
Please login to add a commentAdd a comment