rikshaw wala
-
ఐఏఎస్ కొడుకు ఐఏఎస్ అయితే కిక్ ఏముంటుంది? ఈ సక్సెస్ స్టోరీ తెలిస్తే..!
Govind Jaiswal IAS Sucess Story: పేదరికాన్ని భరించడం కష్టంగానే ఉంటుంది. కానీ ఆ కష్టంలోంచి, బాధలోంచి పుట్టిన పట్టుదల, చిత్తశుద్ధి మాత్రం ఒక రేంజ్లో ఉంటుంది. విజయం సాధించేదాకా నిద్ర పోదు. అలాంటి ఐఏఎస్ స్ఫూర్తిదాయకమైన కథను తెలుసుకుందాం. యాక్టర్ కొడుకు, యాక్టర్.. కలెక్టర్ సన్ కలెక్టర్ , డాక్టర్ తనయుడు డాక్టర్ అయితే స్టోరీ ఎలా అవుతుంది. రిక్షా నడుపుకునే సాధారణ వ్యక్తి కుమారుడు ఐఏఎస్ అవ్వడంలోనే సక్సెస్ కిక్ ఉంటుంది. కార్మికుడి కొడుకుగా అవమానాల్ని, అవహేళల్ని ఎదుర్కొని ఐఏఎస్‌గా నిలిచిన స్టోరీ ఆదర్శవంతంగా నిలుస్తుంది. గోవింద్ జైస్వాల్ వారణాసికి చెందినవారు.గోవింద్ జైస్వాల్ తండ్రి నారాయణ్ జైస్వాల్ ఒక గవర్నమెంట్ రేషన్ షాప్ లో పని చేసేవాడు. అయితే ఆ రేషన్ షాప్ అనుకోకుండా మూసివేయడంతో ఉపాధి కోల్పోయాడు. తన దగ్గర డబ్బులతో కొన్ని రిక్షాలను కొన్నాడు. వాటిని అద్దెకు తిప్పేవాడు. ఇంతలో గోవింద్ తల్లి తీవ్ర అనారోగ్యం పాలైంది. వైద్య ఖర్చుల నిమిత్తం ఉన్నదంతా ఖర్చయిపోయింది.దురదృష్టవశాత్తు 1995లో ఆమె కన్నుమూసింది దీంతో గోవింద్ తండ్రి పరిస్థితి మళ్లీ మొదటికొచ్చింది. ఎలాగోలా ఆడపిల్లకు పళ్లి చేసాడు. కానీ కొడుకుని చదివించాలన్న పట్టుదలతో నారాయణ స్వయంగా రిక్షా తొక్కడం మొదలు పెట్టాడు. అయితే తనతో పాటు చదువుకుంటున్న స్నేహితుల ఇంటికి వెళ్లినపుడు వారి తల్లిదండ్రులు గోవింద్‌ను అవమానించారు. తమ కుమారుడితో ఎప్పుడూ కనిపించొద్దంటూ దురుసుగా ప్రవర్తించారు. అదే అతని జీవితాన్ని మలుపు తిప్పింది. ఎలాగైనా గౌరవంగా బతకాలని నిశ్చయించుకున్నాడు తాను కలెక్టర్ చదువుతానని తండ్రికి చెప్పాడు. దీంతో ఆయన కష్టమైనా సరే రూ 40వేల వెచ్చించి ఢిల్లీలోని ఒక కోచింగ్ సెంటర్లో చేర్పించాడు. అక్కడ తన ఖర్చుల కోసం గోవింద్ జైస్వాల్ చిన్న చిన్న ఉద్యోగాలు చేస్తూ వచ్చాడు. రాత్రి పగలు కష్టపడి చదివాడు. 2006లో గోవింద్ తొలి ప్రయత్నంలోనే జాతీయ స్థాయిలో యూపీఎస్సీలో 48వ ర్యాంక్ సంపాదించుకున్నాడు. గోవాలో స్పోర్ట్స్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్‌గా,ఆరోగ్య మంత్రిత్వ శాఖలో డిప్యూటీ సెక్రటరీగా పనిచేశారు. జైస్వాల్ భార్య ఐపీఎస్ చందన్ చౌదరి. వీరికి ఒక కుమారుడున్నాడు. 12th ఫెయిల్ స్టోరీలా, మరో బయోపిక్: ఐఏఎస్ అధికారి గోవింద్ జైస్వాల్ జీవితం ఆధారంగా కమల్ చంద్ర దర్శకత్వంలో ‘అబ్ దిల్లీ దుర్ నహీ’ మూవీ కూడా సిద్దమవుతోంది. -
వాట్ ఏ గట్స్ బాస్! నీ ఆత్మవిశ్వాసానికి సెల్యూట్!
మనం కొంచెం కష్టం వస్తే చాలు నాకే ఎందుకు ఇలా అనుకుంటాం. కుంగిపోయి దిగులుపడిపోతాం. ఛాలెంజ్‌గా తీసుకోం. పైగా ఈ కష్టం మనకు ఏమైన నేర్పుతుందా! లేక మనకు తెలియంది ఏదో చెబుతుందని అని పాజిటివ్‌గా అస్సలు ఆలోచించాం. మరికొంతమంది ఆత్మహత్యలకు వరకు వెళ్లిపోతారు. ఇంకొందరు నాబతుకింతే అన్నట్టుగా ఉండిపోయి ఏ తాగుడో లేక డ్రగ్స్కో బానిసైపోతారు. కొందరే ఎలాంటి కష్టమైన సరే తెగువతో పోరాడాలనుకుంటారు. వారే ఏదో ఒకరోజు గొప్పస్థాయికి ఎదుగుతారు. ఒకవేళ అందుకోలేకపోయినా ఎందరికో స్ఫూర్తిని అయినా నింపుతారు. అలాంటి వారే ఈ ప్రపంచానికి కావాల్సింది. ఇదంతా ఎందుకు చెబుతున్నానంటే ఇక్కడొక వ్యక్తి ఒక కాలు లేదు అయినా సరే మరో కాలితో తన జీవనాన్ని సాగిస్తున్నాడు. కుమిలిపోలేదు కాదుగదా అయ్యో! ఈ ఒంటి కాలితో ఏ పని చేయగలను అని కూడా అనుకోలేదు. తన పొట్ట పోషించుకుని ఏదో విధంగా బతకాలని తపించాడు. బహుశా అదే అతని ఆత్మశక్తి కాబోలు. ఒక దివ్యాంగుడు ఒక చేతిలోని ఊతకర్ర సాయంతో మరో చేతితో రిక్షా లాగుతూ జీవనం సాగిస్తున్నాడు. ఆ సంఘటన ప్రేరణ ఇచ్చేలానే గాక ధైర్యంగా ఎలా బతకాలో నేర్పించే పాఠం. అందుకు సంబంధించిన వీడియో నెట్టింట తెగ వైరల్ అవుతోంది. దీంతో బాస్ నీ గట్స్‌కి సెల్యూట్ అంటూ అతన్నిప్రశంసిస్తూ ట్వీట్ చేశారు చాలా మంది నెటిజన్లు. जीना है गर कुछ प्रयास तो करना होगा स्वर्ग देखना है तो खुद को मारना होगाhttps://t.co/PwsFvru9b7 pic.twitter.com/PLzGJd3YdG — Aamir Khan ₚₐᵣₒdy (@AamirKhanfa) January 17, 2023 (చదవండి: ఎంజాయ్ చేద్దామని వెళ్తే ఊహించని షాక్.. పెండ్యులం రాడ్ విరగడంతో..) -
ఇదేనా మీకు నేర్పింది? రిక్షా బోల్తాపడినా ఆగని కలెక్టర్ కాన్వాయ్
లక్నో: ఉత్తర్‌ప్రదేశ్ సీతాపుర్‌లో జరిగిన ఓ ఘటనకు సంబంధించిన వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారింది. గుంతలమయం, వర్షపు నీటితో కూడిన రోడ్డుపై జిల్లా మెజిస్ట్రేట్ కాన్వాయ్ వెళ్తుండగా.. దానికి ఆటోరిక్షా(ఈ-రిక్షా) సైడ్ ఇవ్వబోయింది. ఈ క్రమంలోనే అదుపుతప్పి బోల్తాపడింది. అందులోని ప్రయాణికులందరు బురద నీటిలో పడిపోయారు. ఇంత జరిగినా కన్వాయ్‌లో వెళ్తున్న అధికారులు, సిబ్బంది మాత్రం ఏమీ పట్టనట్టు అలాగే వెళ్లిపోయారు. కనీసం వాహనం దిగి ఎవరికైనా ఏమన్నా అయిందా అని కూడా చూడలేదు. ఇందుకు సంబంధించిన వీడియోను స్థానికులు ఒకరు ఫోన్లో వీడియో తీసి సోషల్ మీడియాలో షేర్ చేయగా.. అది వైరల్‌గా మారింది. అధికారుల తీరుపై నెటిజన్లు తీవ్రంగా స్పందించారు. ఐఏఎస్, ఐపీఎస్ శిక్షణలో నేర్పింది ఇదేనా? సామాన్యులను పట్టించుకోరా అని మండిపడ్డారు. సామాన్యులు నడిరోడ్డుపై కిందపడినా పట్టించుకోని అధికారులు, ఇక ప్రభుత్వ కార్యాలయాలకు పని కోసం వెళ్తే వాళ్లను అసలు పట్టించుకుంటారా? అని ఆవేదన వ్యక్తం చేశారు. Ignore the common people....Is this what civil servants being taught at their training academy after qualifying India's toughest exam ? #IAS #IPS #Sitapur #CivilServices @ChiefSecyUP pic.twitter.com/MHZYP22cxM — Anand Tripathi (@dranandtripathi) October 11, 2022 ఉత్తర్‌ప్రదేశ్‌లో నవంబర్ 15నాటికి గుంతల రోడ్లు ఉండొద్దని సీఎం యోగి ఆదిత్యనాథ్ ఇటీవలే అధికారులను ఆదేశించారు. మెరుగైన రోడ్లు ప్రజల హక్కు అని ఉన్నతస్థాయి సమావేశంలో చెప్పారు. ఆ తర్వాత కొద్ది రోజులకే ఈ ఘటన జరగడం ప్రభుత్వంపై విమర్శలకు దారితీసింది. చదవండి: అశ్రునయనాల మధ్య ములాయం అంత్యక్రియలు -
రిక్షాలో మినీ గార్డెన్...ఫోటోలు వైరల్
Man Converts Rickshaw Into Mini Garden: పర్యావరణ కాలుష్యం నుంచి రక్షించుకోవడానికి ప్రభుత్వ యంత్రాంగం సైతం ముందుకు వచ్చి రకరకాలుగా విన్నూతన పద్ధతుల్లో మొక్కలు పెంచే కార్యక్రమాలను చేపట్టారు. అంతేకాకుండా స్థలం లేకపోయిన ప్రజలు మొక్కలు ఎలా పెంచుకోవచ్చు వంటివి చెప్పి మరీ పంచేలా ప్రోత్సహిస్తున్నారు. ప్రజలు కూడా మిద్దే తోటని, వాల్ గార్డినింగ్ అని తమకు తోచిన రీతిలో మొక్కలను పెంచేందుకు ఆసక్తి కనబరుస్తున్నారు. అయితే వాటన్నింటిని కాలదన్నేలా ఇక్కడొక వ్యక్తి విన్నూతన రీతిలో మొక్కలను పెంచి ఔరా అనిపించుకున్నాడు. వివరాల్లోకెళ్తే...ఇక్కడొక వ్యక్తి తన రిక్షానే మినీగార్డెన్‌గా మార్చేశాడు. రిక్షాని చక్కని పూల మెక్కలు, పచ్చదనంతో నింపేశాడు. అంతేకాదు రిక్షాలో చిన్న చిన్న పూలకుండీలను కూడా ఏర్పాటు చేశాడు. ఈ మేరకు ఆ వ్యక్తి రిక్షాకు సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి. అవి కాస్త యునైటెడ్ నేషన్స్ ఎన్విరాన్మెంట్ ప్రోగ్రామ్ మాజీ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ ఎరిక్ సోల్‌హీమ్‌ని తెగ ఆకర్షించాయి. ఆయన ట్విట్టర్లో ...ఈ భారతీయుడు ఎండలో కూడా చల్లగా ఉండేందుకు తన రిక్షా మీద గడ్డిని పెంచాడు. నిజంగా చాలా బాగుంది!. ఈ వేసవి వేడి తట్టుకునేందుకు ఇలా పచ్చటి మొక్కలతో రిక్షాని ఏర్పాటు చేసుకున్నాడు కాబోలు. అని అన్నారు. అంతేకాదు నెటిజన్లు కూడా ఆ రిక్షా డ్రైవర్ సృజనాత్మకతను మెచ్చుకోవడమే కాకుండా కస్టమర్లను ఆకర్షించేందకు ఇది చాల చక్కటి మార్గం అంటూ రకరకాలుగా ట్వీట్ చేశారు. This Indian 🇮🇳 man grew grass on his rickshaw to stay cool even in the heat. Pretty cool indeed! pic.twitter.com/YnjLdh2rX2 — Erik Solheim (@ErikSolheim) April 4, 2022 (చదవండి: అమ్మాయి పుట్టిందని తండ్రి సంతోషం.. హెలికాప్టర్లో స్వాగతం) -
బారులుదీరిన బతుకు‘బండి’
కరోనా పొట్టగొట్టింది. ఆకలి రోడ్డెక్కింది. దాతల సాయం కోసం బతుకు‘బండి’ ఇలా బారులుదీరింది. రోజంతా రెక్కలు ముక్కలు చేసుకుంటే కానీ నాలుగు మెతుకులు నోట్లోకి వెళ్లని రిక్షావాలాలు వీరంతా. సోమవారం వరంగల్ నగరంలో శాప్ మాజీ డైరెక్టర్ రాజనాల శ్రీహరి.. పోలీస్ కమిషనర్ తరుణ్‌జోషి చేతుల మీదుగా రిక్షా కార్మికులకు 25 కిలోల చొప్పున బియ్యం పంపిణీ చేశారు. కార్మికులు తమ రిక్షాలతో సహా పెద్దసంఖ్యలో తరలివచ్చారు. – స్టాఫ్ ఫొటోగ్రాఫర్, వరంగల్ రూరల్ -
15 మంది చిన్నారులను బలిగొన్న రిక్షా బాంబు
కాబూల్ : అఫ్గానిస్తాన్‌లో జరుగుతున్న అంతర్యుద్ధం అభంశుభం తెలియని చిన్నారుల ప్రాణాలను బలి తీసుకుంది. రిక్షాకు అమర్చిన బాంబు పేలడంతో 15 మంది బాలలు మృత్యుఒడికి చేరగా మరో 20 మంది క్షతగాత్రులయ్యారు. తాలిబన్ అదీనంలో ఉన్న ఘజ్ని ప్రావిన్స్ గిలాన్ జిల్లాలోని ఓ గ్రామంలో శుక్రవారం ఈ ఘటన చోటుచేసుకుంది. చిరు వ్యాపారి ఒకరు రిక్షాలో రకరకాల వస్తువులను తీసుకుని ఓ గ్రామానికి వెళ్లగా పిల్లలంతా అతడి చుట్టూ మూగారు. ఇంతలోనే, రిక్షాకు అమర్చిన బాంబు పేలి 15 మంది చిన్నారులు మృత్యువాతపడ్డారు. మరో 20 మంది వరకు గాయపడ్డారని అధికారులు తెలిపారు. ఈ దాడికి బాధ్యులుగా ఎవరూ ప్రకటించుకోలేదు. -
పేద కుటుంబానికి సాయం
ప్రొద్దుటూరు : పేద కుటుంబానికి ఓ దాత సాయం చేశారు. రిక్షా కార్మికుడు అబ్దుల్ ఖాదర్ కుటుంబ పరిస్థితిపై ‘విరిగిన బతుకు బండి’ అనే కథనం ‘సాక్షి’లో గురువారం ప్రచురితమైంది. ఇందుకు స్పందించిన శ్రీనివాసనగర్‌కు చెందిన ఏసీ మెకానిక్ గౌస్ బాషా నిత్యావసర వస్తువులతోపాటు ఆర్థిక సాయం అందించారు. తనకు చేతనైన సాయం చేశానని ఆయన చెప్పారు. కార్యక్రమంలో ఎంపీటీసీ మాజీ సభ్యుడు సత్యం పాల్గొన్నారు. -
విరిగిన బతుకు బండి
వైఎస్ఆర్ జిల్లా, ప్రొద్దుటూరు : విధి రాతను ఎవరూ తప్పించలేరు అంటే ఇదేనేమో.. ప్రొద్దుటూరు మండలంలోని ప్రకాష్‌నగర్‌లో నివసిస్తున్న పఠాన్ అబ్దుల్‌ఖాదర్ దయనీయ స్థితి ఇందుకు నిలువుటద్దంగా నిలుస్తోంది. పెనుగాలులకు మంగళవారం సాయంత్రం సమీపంలోని విద్యుత్ స్తంభం విరిగి అబ్దుల్ ఖాదర్ రిక్షాపై పడటంతో పూర్తిగా విరిగిపోయింది. ఇప్పటి వరకు విరిగిన స్తంభాన్ని తీయడం గానీ, రిక్షాను పక్కకు తీయడం చేయలేదు. వివరలు ఇలా ఉన్నాయి. అబ్దుల్ ఖాదర్ సుమారు 30 ఏళ్లుగా వీధుల్లో రిక్షా తొక్కుతూ ప్లాస్టిక్ వ్యర్థాలను సేకరించి బొంగు బజార్లో అమ్మేవాడు. తద్వారా వచ్చిన డబ్బు కుటుంబ పోషణ కోసం వినియోగించేవాడు. ఈయనకు భార్య దావుద్దీతోపాటు పిల్లలు మహబూచాన్, మహబూబ్‌బీ, గైబుసా వలి ఉన్నారు. ఆయనకు వయసు మీరిపోగా మిగతా వారందరూ దివ్యాంగులే. దావుద్దీ, మహబూబ్‌చాన్, మహబబూబ్‌బీలు శారీరక వికలాంగులు కాగా గైబుసా వలి మానసిక వికలాంగుడు. ప్రతినెలా అబ్దుల్‌ఖాదర్‌కు వృద్ధాప్య పింఛన్, దావుద్దీ, మహబూబ్‌బీలకు దివ్యాంగుల పింఛన్ వస్తోంది. వయసులో ఉన్నప్పుడు అతడు రేకులతో ఇల్లు నిర్మించుకున్నారు. ప్రస్తుతం పింఛన్లతో పాటు రేషన్ బియ్యం వీరికి ఆసరాగా నిలుస్తోంది. రిక్షా విరిగిపోవడంతో వృద్ధుడు తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్నాడు. దాతలు ఆదుకోవాలి అబ్దుల్ ఖాదర్‌ది నిరుపేద కుటుంబం. కేవలం ఆయన రిక్షా ద్వారా వచ్చే ఆదాయంతోపాటు ఇంట్లో వారి పింఛన్లు, రేషన్ బియ్యం ఆ కుటుంబాన్ని ఆదుకుంటున్నాయి. వారు దివ్యాంగులు కావడంతో పనులకు వెళ్లలేని పరిస్థితి నెలకొంది. దాతలు స్పందించి వీరిని ఆదుకోవాలి. – సత్యం, మాజీ ఎంపీటీసీ సభ్యుడు,ప్రొద్దుటూరు మండలం -
మా బతుకులు మారాలంటే మార్పు రావాలి..
‘బతుకు బండి భారమైందయ్యా.. ఒంట్లో ఓపిక లేదు.. మోకాళ్లలో సత్తువా లేదు. రోజంతా చెమటోడ్చినా ఐదువేళ్లూ నోట్లోకి పోయిన రోజే లేదు. ఏళ్ల తరబడి కష్టాల సంద్రాన్ని ఈదుతూనే ఉన్నా.. ఇంకా ఎన్నాళ్లీ అగచాట్లు. మా బతుకులు మారాలి. మార్పు రావాలి’ అంటున్నాడు రిక్షా కార్మికుడు పరమేశ్వర్. విజయవాడలోని సిద్థార్థ ఆర్ట్స్ అండ్ సైన్స్ కళాశాల సమీపంలో బుధవారం తన రిక్షాలో కూర్చొని సాక్షిదినపత్రిక చదువుతున్న ఆయనను పలుకరించగా.. ప్రస్తుత రాజకీయాలపై ఆవేదన వ్యక్తం చేశాడు. ‘రాష్ట్రంలో అవినీతి పెరిగిపోయింది. దోపిడీ పర్వం సాగుతోంది. ఈ అరాచక పాలన పోవాలన్నా.. పేదల బతుకుల్లో వెలుగులు విరబూయాలన్నా.. వైఎస్ జగన్ ముఖ్యమంత్రి కావాలి. నా ఓటు రాజన్న బిడ్డకే’ అని ఘంటాపథంగా చెబుతున్నాడు. -
ట్రంకురోడ్డుపై మృతదేహాల కలకలం
నెల్లూరు, కావలిఅర్బన్: స్థానిక తహసీల్దారు కార్యాలయం ఎదురుగా ట్రంకురోడ్డు మీద చెక్క రిక్షాలోని రెండు మృతదేహాలు కలకలం సృష్టించాయి. వివరాల్లోకి వెళ్తే.. కావలి పరసర ప్రాంతాల్లో ఇద్దరు గుర్తుతెలియని వ్యక్తులు మృతి చెందారు. వీటికి ఏరియా వైద్యశాలలో పోస్టుమార్టం నిర్వహించా రు. అనాథ శవాలు కావడంతో మున్సిపల్ సిబ్బం ది ఆ మృతదేహాలకు అంత్యక్రియలు నిర్వహిం చాల్సి ఉంది. శ్మశానికి తరలించడానికి వీటిని ఓ రిక్షా కార్మికుడికి అప్పగించారు. అయితే అతను ట్రంకురోడ్డులో వెళ్తూ మధ్యలో మద్యం షాపు కనిపించడంతో ఆగి ఫూటుగా మద్యం తాగేసి పడిపోయాడు. సుమారు 2 గంటల పాటు ట్రంకురోడ్డు పక్కనే మద్యం మత్తులో నిద్రించాడు. రిక్షాపై మృతదేహాలు ఉండడం, దుర్గంధం వెదజల్లుతుండడంతో అటువైపుగా వెళ్తున్న వాహనాదారులు, పాదచారులు గుర్తించి భయాందోలళనకు గురయ్యారు. మద్యం మత్తులో నుంచి తేరుకున్న రిక్షా కార్మికుడు మృతదేహాలను శ్మశానవాటికకు తరలించాడు. మున్సిపల్ అధికారుల నిర్లక్ష్యం కారణంగానే ఇటువంటి ఘటను చోటు చేసుకుందని స్థానికులు మండిపడ్డారు. -
సమాజ సేవలో రిక్షావాలా
భద్రాచలంఅర్బన్: సమాజ సేవే పరమార్థంగా ఎక్కడో కేరళలోని పాల్ఘడ్ జిల్లా లఖిడిలో పుట్టిన ‘పద్మావతి పుదుచ్చేరి’ అనే వ్యక్తి రిక్షా తొక్కుతూ పలు రాష్ట్రాలు పర్యాటిస్తున్నాడు. మధర్ తెరిస్సా స్ఫూర్తితో సమాజ సేవే లక్ష్యంగా ఎంచుకోని తన పేరును ‘నిజం’గా మార్చుకున్నాడు. తండ్రి మరణించిన తరువాత శవంను తీసుకువెళ్లడానికి ఎవరు ముందుకు రాలేదు ఖర్మకాండలకు తన రిక్షాపైనే తీసుకు వెళ్లి నిర్వహించారు. తాను ఎదురుకొన్న గడ్డు పరిస్థితులు నలుగుకు రాకూడదని తన సాయశక్తుల ప్రయత్నాలు చేస్తున్నాడు. తన రిక్షాలో ఉచితంగా ఎక్కించుకున్న వృద్ధులను, వికలాంగులను తమ గమ్య స్థానాల్లో దింపుతూ సాగిపోతున్న పుదుచ్చేరి మంగళవారం భద్రాచల పట్టణంకు చేరుకున్నాడు. కొన్ని ప్రాంతాల్లో దాతలు ఇచ్చిన ఆర్థిక సహకారంతో అనాధ ఆశ్రమాలలోని పిల్లలకు పుస్తకాలు, పెన్నులు, తినుభాండారాలు అందిస్తూ వారి పట్ల ఉడత భక్తి చాటుకుంటున్నాడు. -
విషమ ప'రిక్షా'
రైలొస్తే చాలు... కళ్లల్లో ఆశల దీపాలు వెలుగుతాయి. బస్సొస్తే చాలు కాళ్లన్నీ ఉత్సాహంతో పరుగులు తీస్తాయి. ప్రయాణికుల్ని చుట్టుముడతాయి. ఆప్యాయంగా పలకరిస్తాయి. బేరాల కోసం పోటీ పడతాయి. నెగ్గిన వాళ్లకు ఆ పూట సంబరం. మిగిలిన వాళ్లకు మళ్లీ నిరీక్షణం. వయసు మీరుతోంది. శరీరం మొరాయిస్తోంది. బతుకు బండిని లాగలేనంటోంది. ఎదుగూ బొదుగూ లేని జీవితం.. చరమాంకంలో తీరని విషాదం. బొబ్బిలి రిక్షా కార్మికుల వేదనకు అక్షర రూపం. బొబ్బిలి రూరల్: ఒకప్పుడు బొబ్బిలి ప్రాంతంలో 500 వరకు రిక్షాలుండేవి. ఆటోల రంగ ప్రవేశంతో వారి బతుకు చిత్రం మారిపోయింది. వయసు మీరడం.. రిక్షాలకు డిమాండ్ తగ్గిపోవడంతో రిక్షాల సంఖ్య ప్రస్తుతం 200కు చేరుకుంది. కారాడ, అలజంగి, జగన్నాథపురం, పాతబొబ్బిలి, బొబ్బిలి ప్రాంతాలతో పాటు సీతానగరం మండలం లచ్చయ్యపేట తదితర ప్రాంతాల నుంచి రిక్షా కార్మికులు బొబ్బిలిలో రైల్వేకూడలి, చినబజారు సెంటర్, తాండ్ర పాపారాయ కూడలి, వేణుగోపాల కోవెల సెంటర్లలో వీరు అందుబాటులో ఉంటారు. భరోసా లేని బతుకులు రిక్షా కార్మికుల రోజు సంపాదన రూ.వంద లోపే. వారి బాగోగుల కోసం ప్రభుత్వంతో పోరాడేందుకు సంఘాల్లేవు. కొత్త రిక్షాలు లేక పాత రిక్షాలే నడుపుతున్న కార్మికులకు శక్తి ఉన్నంతవరకే పని. ఇళ్లకు నోచని కార్మికులు ప్రభుత్వ సంక్షేమ పథకాలపై అవగాహన లేకపోవడంతో సద్వినియోగం చేసుకోలేకపోతున్నారు. దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్‌రెడ్డి పాలనలో వీరికి ఇళ్లు మంజూరయ్యాయి. అప్పట్లో కట్టుకోలేని వారికి మరి అవకాశం రాలేదు. చంద్రన్న బీమా, పొదుపు సంఘాలపై అవగాహన లేకపోవడంతో వాటి లబ్ధి పొందలేకపోతున్నారు. కొందరికి ఆరోగ్యశ్రీ కార్డులు ఉన్నాయి. లేనివారు డబ్బు లేక ఎక్కడికీ వెళ్లలేక అనారోగ్యంతో బాధపడుతున్నారు. మద్యం, పాన్పరాగ్లతో పాటు కొందరు గంజాయి తదితర వ్యసనాల బారిన పడుతున్నారు. -
రిక్షావాలా ఆత్మహత్య
హిందూపురం అర్బన్: పట్టణంలోని ధనలక్ష్మి రోడ్డులో గురువారం అర్థరాత్రి దాటిన తర్వాత బాబాఫకృద్దీన్ (38) అనే రిక్షావాలా దారుణహత్యకు గురయ్యాడు. రైల్వేస్టేషన్ సమీపంలోని తిలక్‌నగర్‌లో నివాసముండే ఇతనికి వైట్నర్ (మత్తు) పీల్చే అలవాటు ఉందని టూటౌన్ పోలీసులు తెలిపారు. సహచరులతో గొడవల కారణంగా మత్తులో దాడిచేసి ఉంటారన్న అనుమానం వ్యక్తం చేస్తున్నారు. బాబాఫకృద్దీన్‌కు భార్య, ఇద్దరు కొడుకులు, ఒకకుమార్తె ఉన్నారు. పోస్టుమార్టం నిమిత్తం మృతదేహాన్ని ఆస్పత్రికి తరలించినట్లు పోలీసులు తెలిపారు.