రిక్షాపై విరిగిపడిన విద్యుత్‌స్తంభం ,కుటుంబ సభ్యులతో అబ్దుల్ ఖాదర్
వైఎస్‌ఆర్ జిల్లా, ప్రొద్దుటూరు : విధి రాతను ఎవరూ తప్పించలేరు అంటే ఇదేనేమో.. ప్రొద్దుటూరు మండలంలోని ప్రకాష్‌నగర్‌లో నివసిస్తున్న పఠాన్ అబ్దుల్‌ఖాదర్ దయనీయ స్థితి ఇందుకు నిలువుటద్దంగా నిలుస్తోంది. పెనుగాలులకు మంగళవారం సాయంత్రం సమీపంలోని విద్యుత్ స్తంభం విరిగి అబ్దుల్ ఖాదర్ రిక్షాపై పడటంతో పూర్తిగా విరిగిపోయింది. ఇప్పటి వరకు విరిగిన స్తంభాన్ని తీయడం గానీ, రిక్షాను పక్కకు తీయడం చేయలేదు. వివరలు ఇలా ఉన్నాయి.
అబ్దుల్ ఖాదర్ సుమారు 30 ఏళ్లుగా వీధుల్లో రిక్షా తొక్కుతూ ప్లాస్టిక్ వ్యర్థాలను సేకరించి బొంగు బజార్‌లో అమ్మేవాడు. తద్వారా వచ్చిన డబ్బు కుటుంబ పోషణ కోసం వినియోగించేవాడు. ఈయనకు భార్య దావుద్దీతోపాటు పిల్లలు మహబూచాన్, మహబూబ్‌బీ, గైబుసా వలి ఉన్నారు. ఆయనకు వయసు మీరిపోగా మిగతా వారందరూ దివ్యాంగులే. దావుద్దీ, మహబూబ్‌చాన్, మహబబూబ్‌బీలు శారీరక వికలాంగులు కాగా గైబుసా వలి మానసిక వికలాంగుడు. ప్రతినెలా అబ్దుల్‌ఖాదర్‌కు వృద్ధాప్య పింఛన్, దావుద్దీ, మహబూబ్‌బీలకు దివ్యాంగుల పింఛన్ వస్తోంది. వయసులో ఉన్నప్పుడు అతడు రేకులతో ఇల్లు నిర్మించుకున్నారు. ప్రస్తుతం పింఛన్లతో పాటు రేషన్ బియ్యం వీరికి ఆసరాగా నిలుస్తోంది. రిక్షా విరిగిపోవడంతో వృద్ధుడు తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్నాడు.
దాతలు ఆదుకోవాలి
అబ్దుల్ ఖాదర్‌ది నిరుపేద కుటుంబం. కేవలం ఆయన రిక్షా ద్వారా వచ్చే ఆదాయంతోపాటు ఇంట్లో వారి పింఛన్లు, రేషన్ బియ్యం ఆ కుటుంబాన్ని ఆదుకుంటున్నాయి. వారు దివ్యాంగులు కావడంతో పనులకు వెళ్లలేని పరిస్థితి నెలకొంది. దాతలు స్పందించి వీరిని ఆదుకోవాలి. – సత్యం, మాజీ ఎంపీటీసీ సభ్యుడు,ప్రొద్దుటూరు మండలం
Comments
Please login to add a commentAdd a comment