మంత్రి అచ్చెన్న మాటతో సెలవుపై ఆర్డీవో
రింగ్ రోడ్డు వ్యవహారంలో కొత్త మలుపు
టీడీపీ నేతల మేలు కోసమే ఈ పరిణామం
శ్రీకాకుళం టౌన్: శ్రీకాకుళం పట్టణం చుట్టూ నిర్మించ తలపెట్టిన రింగ్ రోడ్డు వ్యవహారం ఆర్డీవో దయానిధి మెడకు చుట్టుకుంది. ఐదు కిలోమీటర్ల చుట్టు కొలతతో నిర్మించనున్న రింగ్‌రోడ్డు పరిధిలో ఖరీదైన భూములున్నాయి. రూ.కోట్లు విలువ చేసే భూములను రింగ్ రోడ్డుకు ఇచ్చేందుకు రైతులు ముందుకురావడం లేదు. ఇప్పటికే పెద్దపాడు, కునుకుపేట రైతులు సర్వే అధికార్లను అడ్డుకున్నారు. కలెక్టర్ పి.లక్ష్మీనృసింహాన్ని కలసినపుడు ఆయన నచ్చజెప్పే ప్రయత్నం చేశారు. చివరకు అధికార టీడీపీ నేతల భూములను రింగ్ రోడ్డు నుంచి తప్పించి అలైన్‌మెంట్ మార్చాలని కొందరు నేతలు ఒత్తిడి తీసుకొచ్చారు.
ఈ ప్రాంతానికి చెందిన ‘దేశం’ నేత, మంత్రి అచ్చెన్నకు సన్నిహితుని భూములు రోడ్డు అలైన్‌మెంటు నుంచి తప్పించడంతోపాటు రోడ్డు పక్కనే ఆ భూమి ఉన్నట్టు మార్చాలని సూచించడంతో రెవెన్యూ అధికారులు సందిగ్ధంలో పడ్డారు. దీంతో ఉన్నతాధికార్లను, రైతులకు ఒప్పించే బాధ్యతలను ఆర్డీవో దయానిధికి అప్పగించినట్టు తెలుస్తోంది. ఆయన కూడా అదే ప్రాంతానికి చెందిన వారు కావడంతో రైతులతో నేరుగా మంచి సంబంధాలున్నాయని, ఒప్పించలేక పోతే సెలవుపై వెళ్లాలని ఆ పార్టీ నాయకులు అతనిపై ఒత్తిడి తెచ్చినట్టు తెలుస్తోంది. ఎమ్మెల్యే గుండ లక్ష్మీదేవి ఆయనకు నచ్చజెప్పే ప్రయత్నం చేసినా టీడీపీ నాయకులు అందుకుఅంగీకరించలేదని సమాచారం. గతంలో డీలర్ల నియామకంలో కోర్టు ఉత్తర్వులను పక్కనపెట్టి అనుకూలమైన వారికి పగ్గాలు ఇమ్మని ఒత్తిడి చేశారు.
తాజాగా రింగ్ రోడ్డు వ్యవహారంలో ఆయన కొరకరాని కొయ్యగా తయారై.. చెప్పినట్టు చేయడం లేదని మంత్రి అచ్చెన్నాయుడితో అదేపనిగా చెప్పడంతో సెలవుపై వెళ్లమని సూచించినట్టు వదంతులు వస్తున్నాయి. ఈ పరిస్థితిలో ఆర్డీవో దయానిధి జనవరి ఒకటి నుంచి ఫిబ్రవరి 28 వరకు సెలవుపై వెళ్లనున్నారు.ఇది కేవలం వ్యక్తి గత సెలవుగానే ఆయన చెప్పుకొచ్చారు. కాగా నియోజకవర్గంలో తన ప్రమేయం లేకుండా ఆర్డీవో సెలవుపై వెళ్లడాన్ని ఎమ్మెల్యే జీర్ణించుకోలేకపోతున్నారు.
ఏందయా నీ తీరు!
Published Mon, Dec 28 2015 1:09 AM | Last Updated on Sun, Sep 2 2018 4:48 PM
Advertisement
Advertisement