సాక్షి,తిరుపతి : చంద్రబాబూ... పెయిడ్ ఆర్టిస్టులతో ఆడుతున్న డ్రామాలు కట్టిపెట్టు.. అని ఏపీఐఐసీ చైర్మన్, నగరి ఎమ్మెల్యే ఆర్‌కే రోజా హితవు పలికారు. శనివారం తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. అనంతరం ఆలయం వెలుపల ఆమె మాట్లాడుతూ జగన్‌ను ప్రజలు అభినందిస్తుంటే టీడీపీ జీర్ణించుకోలేక ఆయనపై బురద చల్లేందు కు ప్రయత్నిస్తోందని మండిపడ్డారు. గుంటూరు జిల్లా పల్నాడులో యరపతినేని, కోడెల లాంటి కీచకుల బారి నుంచి విముక్తి పొందిన ప్రజలు సంతోషంగా ఉన్నారన్నారు.
వైఎస్సార్‌సీపీ పాలనపై బురద చల్లే ప్రయత్నం చేసిన టీడీపీ అభాసుపాలైందని విమర్శించారు.కోడెల, యరపతినేని, దేవినేని, అచ్చెన్నాయుడు, బోండా ఉమ లాంటి వారి అరాచకాల వల్ల ఎంతోమంది బలైతే అప్పు డు ఎందుకు పునరావాస కేంద్రాలు ఏర్పాటు చేయలేదని ప్రశ్నించారు. నారాయణ విద్యాసంస్థల్లో వందల మంది ఆత్మహత్య చేసుకున్నప్పుడు ఎందుకు పునరావాస కేంద్రాలను ఏర్పాటు చేయలేదన్నారు. గోదావరి పుష్కరాలలో చంద్రబాబు పబ్లిసిటీ పిచ్చికోసం 30మంది చనిపోతే పునరావాస కేంద్రాలు పెట్టి ఎందుకు ఆ కుటుం బాలను పరామర్శించలేదన్నారు. ఎన్నికల ముందు ప్రజలను మభ్య పెడితే అధికారంలోకి రావచ్చన్న చంద్రబాబు కుట్రలకు ప్రజలు తగిన బుద్ధి చెప్పారన్నారు. జనం 151 సీట్లతో వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డికి పట్టం కట్టారని చెప్పారు.
ప్రశాంతంగా రాష్ట్రం
జగన్ సీఎం అయిన తరువాత రాష్ట్రం ప్రశాంతంగా ఉందన్నారు. కృష్ణ, గోదావరి నదులకు జలకళ సంతరించుకుందని కొనియాడారు. 100 రోజుల జగన్ పాలనలో సంక్షేమ ప«థకాలను ప్రవేశపెట్టి, ప్రజల గుండెల్లో చెరగని ముద్ర వేసుకున్నారని చెప్పారు. అమ్మఒడి, పూర్తి స్థాయిలో ఫీజు రీయింబర్స్‌మెంట్ అమలు చేశారని గుర్తు చేశారు. మంచి వర్షాలు పడి ప్రాజెక్టుల్లో నీళ్లు తొణికిసలాడుతూ రాష్టం సుభిక్షంగా మారుతోందన్నారు. రైతులకు వచ్చే నెల నుంచి రైతు భరోసా పథకం కింద 12,500 రూపాయలు ఇవ్వనున్నారన్నారు. రాజశేఖరరెడ్డి లాగా జగన్‌మోహన్‌రెడ్డి కూడా రైతు బాంధవుడు అనే పేరును తెచుకుంటున్నారని తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment