సాక్షి, కొత్తగూడెం: రాష్ట్రీయ మాధ్యమిక శిక్షాభియాన్ (ఆర్‌ఎంఎస్‌ఏ ) నిధులు ఆగమాగం అవుతున్నాయి. నిధులు మంజూరై ఏళ్లు గడుస్తున్నా సంబంధిత అధికారులు మాత్రం అవసరమున్న చోట ఖర్చు చేయడంలో నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారు. ఈ నిధులు ఖజానాలో మూలుగుతున్నా అధికారులు మాత్రం టెండర్ల పేరుతో కాలయాపన చేస్తుండటం గమనార్హం.
జిల్లా వ్యాప్తంగా 150 ఉన్నత పాఠశాలలకు ఆర్‌ఎంఎస్‌ఏ కింద రూ. 3 కోట్లు మంజూరై రెండేళ్లు గడిచింది. ఒక్కో పాఠశాలకు రూ. 2 లక్షల చొప్పున ప్రభుత్వం నిధులు విడుదల చేసింది. వీటితో ఆయా పాఠశాలల్లో మరుగుదొడ్లు, శిథిలావస్థలో ఉన్న గదులు, ఫర్నిచర్‌కు మరమ్మతులు చేయించాలి. ఫ్యాన్లు, ట్యూబ్‌లైట్ల వంటి చిన్నచిన్న వసతులను ఏర్పాటు చేసుకునేందుకు ఈ నిధులు మంజూరయ్యాయి. ఆర్‌ఎంఎస్‌ఏ ద్వారా ఏటా జిల్లాకు రూ.కోట్ల నిధులు వస్తున్నా సంబంధిత అధికారులు మాత్రం పాఠశాలల్లో వసతులు కల్పించడంలో విఫలమవుతున్నారు. 150 పాఠశాలలకు ఈ నిధులు విడుదలైతే 110 పాఠశాలలకు మాత్రమే ఖర్చు చేసేందుకు ఇటీవల ఆన్‌లైన్ ఈ ప్రొక్యూర్‌మెంట్ టెండర్లను ఆహ్వానించారు. టెండర్ల పేరుతో అధికారులు కాలయాపన చేయడంతో పాఠశాలల్లో ఇప్పటికే అధ్వానంగా గదులు పూర్తి శిథిలావస్థకు చేరుకున్నాయి. అసలు ఈ నిధులు ఉన్న విషయం కొందరు ప్రధానోపాధ్యాయులకే తెలియకపోవడం గమనార్హం. నిధుల విడుదల గురించి తెలిసిన హెచ్‌ఎంలు ఈ విషయాన్ని విద్యాశాఖ ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్తే వారు పట్టీపట్టనట్టు వ్యవహరిస్తున్నారు.
కమీషన్ల వేట..
రాజీవ్ విద్యామిషన్, ఆర్‌ఎంఎస్‌ఏ ద్వారా విడుదలైన నిధులతో నిర్వహించే ప్రతిపనికీ సంబంధిత అధికారులు కమీషన్ అడుగుతున్నట్లు ఆరోపణలున్నాయి. పాఠశాలల్లో చేపడుతున్న అదనపు తరగతి గదులు, మరుగుదొడ్ల నిర్మాణంలో కాంట్రాక్టర్లు ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నారని అంటున్నారు. ప్రస్తుతం ఈ నిధులతో చేపట్టే పనులకు కూడా అధికారులు ముందుగానే తమకు తెలిసిన కాంట్రాక్టర్లతో ఆన్‌లైన్ టెండర్లు వేయించినట్లు సమాచారం. ముందుగా కమీషన్ మాట్లాడుకొని ఈ నిధులతో చేపట్టే పనులను చూసీచూడనట్లు పర్యవేక్షించేటట్లు ఒప్పందం కుదుర్చుకున్నారని ఆరోపణలు వెలువడుతున్నాయి. 150 పాఠశాలల్లో ఏయే మరమ్మతులు ఉన్నాయో ఇప్పటికే అధికారులు నివేదిక రూపొందిం చారు. కమీషన్లు పుచ్చుకున్న అధికారులు నిద్రావస్థలో ఉంటే ఇక కాంట్రాక్టర్లు ఈ పనులను ఇష్జారాజ్యంగా చేయడం.. అవి ఇక మూణ్నాళ్ల ముచ్చటగా మారే అవకాశం ఉందనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.
సమన్వయం లేక నిధులు వృథా..
విద్యాశాఖకు సంబంధించి రాజీవ్ విద్యామిషన్, డీఈఓ కార్యాలయం, ఆర్‌ఎంఎస్‌ఏల మధ్య పూర్తిగా సమన్వయం లేకపోవడంతో ఎన్ని నిధులు ఖర్చు చేసినా ప్రయోజనం లేకుండా పోతోందనే విమర్శలు ఉన్నాయి. ప్రధానంగా ఆర్‌ఎంఎస్‌ఏ, ఆర్‌వీఎం నిధుల ఖర్చు విషయంలో ఇటీవల భారీగా అవకతవకలు జరిగాయి. సరైన ఆడిట్ లేక, క్షేత్రస్థాయిలో చేసిన పనులపై పర్యవేక్షణ లేక అధికారులు అందినకాడికి దిగమింగారనే ఆరోపణలు ఉన్నాయి. ఇప్పుడు కూడా ఇదే పరిస్థితి నెలకొంది. ఆర్‌ఎంఎస్‌ఏ నిధులతో చేపట్టే పనులపై పూర్తిగా ఆయా అధికారుల పర్యవేక్షణ ఉండకుంటే ఖర్చు చేసిన నిధులు వృథా కానున్నాయి. అధికారుల మధ్య సక్యత కొరవడటంతో కూడా నిధులను సద్వినియోగం చేసే విషయంలో ఎవరికివారే యమునా తీరుగా వ్యవహరిస్తున్నారు. గత విద్యా సంవత్సరం ఆర్‌వీఎం నిధులతో చేపట్టిన మరుగుదొడ్ల నిర్మాణంలోనూ నాణ్యత లోపించడంతో అవి ఆనవాళ్లు లేకుండా పోయాయి. ఉన్నతాధికారులు దృష్టి పెడితేనే ఆర్‌ఎంఎస్‌ఏ నిధులతో చేపట్టే పనులు నాణ్యతగా జరుగుతాయని పలువురంటున్నారు.
ఆర్‌ఎంఎస్‌ఏ నిధులు ఆగమాగం
Published Tue, Jan 7 2014 2:30 AM | Last Updated on Sat, Sep 2 2017 2:21 AM
Advertisement