► రోడ్డు ప్రమాదాల్లో
► ముగ్గురి దుర్మరణం
► మరో పది మందికి గాయాలు
విధి బలీయమైందంటారు. నిజమే. అది ఆడే వింత నాటకంలో బంధాలు, అనుబంధాలు అన్నీ తెగిపోవాల్సిందే. బిడ్డలతో కలసి బైక్‌లో బయలుదేరిన ఓ తండ్రి రోడ్డు ప్రమాదంలో మరణిస్తే, భార్యతో కలసి ప్రయాణిస్తున్న ఆటో ప్రమాదానికి గురై మరో భర్త ప్రాణం పోగొట్టుకున్నాడు. తమ ఇంటి దేవుడ్ని దర్శించుకునేందు కు రెండు కుటుంబాల వారు కలసి ఆనందంగా ప్రయాణిస్తున్న కారు మరి కాసేపట్లో ఆలయానికి చేరుకునేలోపే.. అదుపు తప్పి బోల్తాపడి ఓ కుటుంబ యజమానిని కాటికి పంపింది. వేర్వేరు ప్రాంతాల్లో జరిగిన పై సంఘటనల్లో మరో పది మంది గాయపడ్డారు. వారిలో ఇద్దరి పరిస్థితి విషమంగా ఉండడం అందరినీ విషాదంలోకి నెట్టింది.
యాడికి : యాడికి మండలం రాయలచెరువు సమీపంలో ఆదివారం జరిగిన రోడ్డు ప్రమాదంలో తండ్రి మరణించగా, ఇద్దరు పిల్లలు గాయపడ్డారు. ఎస్‌ఐ కత్తి శ్రీనివాసులు కథనం ప్రకారం... మండలంలోని లక్ష్ముంపల్లికి చెందిన కొండారెడ్డి(40) తన కుమార్తె నవ్య, కుమారుడు సాయికృష్ణారెడ్డితో క లసి బైక్‌లో తాడిపత్రి నుంచి స్వగ్రామానికి బయలుదేరారు. మార్గమధ్యంలో రాయలచెరువు సమీపంలోని ఆయిల్ ఫ్యాక్టరీ వద్దకు రాగానే విపరీతమైన వేగంతో వచ్చిన గుర్తు తెలియని వాహనం ఢీకొనడంతో ముగ్గురూ గాయపడ్డారు. స్థానికుల సమాచారం మేరకు 108 సిబ్బంది రంగంలోకి గాయపడ్డ వారిని వెంటనే తాడిపత్రి ఆస్పత్రికి తరలించారు. ప్రథమ చికిత్స అనంతరం ముగ్గురినీ అనంతపురం తరలిస్తుండగా కొండారెడ్డి మార్గమధ్యంలో మరణించారు. నవ్య, సాయికృష్ణారెడ్డి అనంతపురంలోని ఓ ప్రైవేట్ వైద్యశాలలో చికిత్స పొందుతున్నారు. మృతుని బంధువుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్‌ఐ వివరించారు. ఈ సంఘటన గ్రామంలో విషాదం నింపింది.
ఆటో బోల్తా పడి మరొకరు..
నార్పల : మండల పరిధిలో ఆదివారం జరిగిన ఓ రోడ్డు ప్రమాదంలో ఒకరు చనిపోగా.. మరో ముగ్గురు గాయపడ్డారు. వివరాల్లోకెళితే.... శింగనమల మండలంలోని పెరవలికి చెందిన గౌస్‌మోద్దీన్ భార్య ఇమాంబీతో కలిసి వ్యక్తిగత పనుల నిమిత్తం తాడిపత్రికి ఆటోలో వెళ్తుండగా మద్దలపల్లి సమీపంలోని కనుమవద్ద వాహనం టైర్ పగిలి అదుపుతప్పి బోల్తాపడింది. ఈ ప్రమాదంలో గౌస్ మోదీన్(45) అక్కడికక్కడే మృతి చెందాడు. ఆటోలో ఉన్న పెద్దిరాజు, ఆయన భార్యతో పాటు అంజనమ్మ అనే మహిళ గాయపడ్డారు. మృతుని భార్య ఇమాంబీ ఫిర్యాదు మేరకు నార్పల ఎస్‌ఐ రాంప్రసాద్ కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేపట్టారు.
దైవ దర్శనానికి వెళ్తుండగా..
తాడిపత్రి రూరల్: అనంతపురం జిల్లా తాడిపత్రి మండలం ఎర్రగుంటపల్లి సమీపంలో జరిగిన రోడ్డు ప్రమాదంలో కర్ణాటక రాష్ట్రం దావణగేరికి చెందిన రాఘవేంద్రరావు(40) మరణించగా, అదే గ్రామానికి చెందిన సరోజమ్మ(68), ప్రజ్వల్(16), హాంజీ(35), రామచంద్ర(30), కృష్ణమూర్తి(50) గాయపడినట్లు పోలీసులు తెలిపారు. దావణగేరికి చెందిన కృష్ణమూర్తి, రాఘవేంద్రరావు తోడళ్లుల్లు. రెండు కుటుంబాల వారు కలసి శివమొగ్గ నుంచి మారుతీ వ్యాన్‌లో కర్నూలు జిల్లా అహోబిలంలోని నరసింహస్వామి ఆలయానికి బయలుదేరారు. మార్గమధ్యంలో ఎర్రగంటపల్లి గ్రామ సమీపానికి చేరుకోగానే ఒక్కసారిగా వ్యాన్ టైరు పగిలిపోవడంతో అదుపు తప్పి డివైడరును ఢీకొని బోల్తాపడటంతో ఈ సంఘటన జరిగింది. గాయపడిన వారందరినీ అనంతపురం ఆస్పత్రికి తరలించగా అక్కడ చికిత్స పొందుతూ రాఘవేంద్రరావు మరణించారు. సరోజమ్మ, ప్రజ్వల్ పరిస్థితి విషమంగా ఉంది. సమాచారం తెలుసుకున్న రూరల్ పోలీసులు అనంతపురం ఆస్పత్రికి చేరుకుని బాధితుల నుంచి వివరాల సేకరించారు.
ఆదివారం.. తెగిన అనుబంధం
Published Mon, May 23 2016 3:00 AM | Last Updated on Thu, Aug 30 2018 4:07 PM
Advertisement
Advertisement