
మేం ఎవరి కోసం బతకాలి?
♦ ఈ కడుపుకోత పగవారికి కూడా వద్దు
♦ భవిష్యత్తు శూన్యంగా కనిపిస్తోంది..
♦ ఆ భగవంతుడన్నా కనికరించకపోయే..
♦ రోడ్డు ప్రమాద బాధితుల కన్నీటి రోదన
డ్రైవర్ల నిద్రమత్తు ఐదు నిండుప్రాణాలు బలితీసుకుంది. ముక్కుపచ్చలారని నలుగురు చిన్నారుల జీవితాలను చిదిమేసింది. ఒకసారి ప్రమాదం నుంచి తప్పించుకున్న వారిని మృత్యువు టిప్పర్ రూపంలో వెంటాడి మరీ కబళించింది. గురువారం తెల్లవారుజామున మేదరమెట్ల సమీపంలో జాతీయ రహదారిపై ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. తొమ్మిది నెలల పసిపాప పుట్టువెంట్రుకలు తిరుమల వెంకన్నకు సమర్పించి వస్తున్న కుటుంబంలో తీవ్ర విషాదం నింపింది.
సాక్షి ప్రతినిధి, ఒంగోలు : ‘అప్పటి వరకూ మా ఒడిలో ఉన్న బిడ్డలు క్షణాల్లో కళ్లముందే నిర్జీవంగా మారారు. దేవుడి దగ్గరకే కదా.. సార్ వచ్చాం. ఆయనన్నా కనికరించకపాయే. పసిబిడ్డలు సార్. ఒకరు కాదు నలుగురు. వారు పోయాక..మేం ఎవరికోసం బతకాలి.. ఏం సాధించాలి’ అంటూ మేదరమెట్ల రోడ్డు ప్రమాద మృతుల కుటుంబ సభ్యులు భోరున విలపిస్తున్నారు. వారిని రిమ్స్‌లో ‘సాక్షి’ ప్రతినిధి గురువారం ఉదయం పలకరించారు. పలకరించగానే వారు దుఃఖం ఆపుకోలేక కన్నీటిపర్యంతమయ్యారు. మృతి చెందిన చిన్నారులు శ్రీకృష్ణ మనోహర్ (5), వాసవి(4)ల తండ్రి అల్లపు కోటేశ్వరరావు జరిగిన ఘటనను వివరించారు. ఆయన భార్య లక్ష్మీప్రసన్న కూడా గాయాలపాలై ఒంగోలులోని ఓ ప్రైవేటు ఆస్పత్రిలో చికిత్స పొందుతోంది. ఈమె గుంటూరు జిల్లా రేపల్లెలో దేవాదాయశాఖ ఈవోగా పనిచేస్తున్నారు. కోటేశ్వరరావు బావమరిది మురళి ఇద్దరు బిడ్డలు శ్రీకృష్ణ (3), 9 నెలల నిత్య ఈ దుర్ఘటనలో మృతి చెందారు. దీంతో ఆ రెండు కుటుంబాల్లో తీవ్ర విషాదం నెలకొంది.
తిరుమల వెళ్లొస్తూ మృత్యువాత..
పాత గుంటూరు మారుతీనగర్ ఒకటో లైన్‌కు చెందిన మాచర్ల వీరాస్వామి కుమారుడు మురళి, మాధవి దంపతుల బిడ్డ నిత్యకు 9 నెలలు నిండటంతో ఆమెకు పుట్టు వెంట్రుకలు తీయించాలని నిర్ణయించారు. మలేషియాలో సాఫ్ట్‌వేర్ ఇంజినీర్‌గా పనిచేస్తున్న మురళి కుమార్తె వెంట్రుకల కార్యక్రమం కోసం రెండు రోజుల క్రితమే గుంటూరు వచ్చారు. అనంతరం వీరాస్వామి కుమారుడు మురళి, అల్లుడు కోటేశ్వరరావు కుటుంబాలతో కలిసి ఈ నెల 28వ తేదీ మధ్యాహ్నం 12:30 ప్రాంతంలో గుంటూరు నుంచి కారులో తిరుపతి బయల్దేరారు. 29న తిరుమలలో నిత్యకు వెంట్రుకలు తీయించి శ్రీకాళహస్తి దర్శించుకొని సాయంత్రం తిరుగు ప్రయాణమయ్యారు. 2 గంటల ప్రాంతంలో మేదరమెట్లకు సమీపంలో 10 కిలోమీటర్ల దూరంలో ఉండగా డ్రైవర్ నాగరాజు నిద్రమత్తుతో ముందు వెళ్తున్న లారీని కారుతో స్వల్పంగా ఢీకొట్టాడు. కారులో ఉన్న వారు కేకలు వేయడంతో టక్కున మేల్కొని నాగరాజు కారును కంట్రోల్ చేసుకున్నాడు. డ్రైవర్ నిద్రమత్తులో ఉన్నాడని తెలుసుకొని వారు కారు ఆపి టీ తాగించి నిద్రపోమ్మని చెప్పారు. అయినా అతను పట్టించుకోలేదు. లేకుంటే ఇంత ఘోరం జరిగేది కాదు.
వారి మాటలు డ్రైవర్ విని ఉంటే..
15 నిమిషాలు మాత్రమే కునుకు తీసిన డ్రైవర్ నాగరాజు ఇక వెళ్దామంటూ మరోమారు టీతాగి బయల్దేరాడు. గంట పడుకుని వెళ్దామని కారులో ఉన్న వారు చెప్పినా వినిపించుకోలేదు. కారు తిరిగి బయల్దేరి కిలోమీటర్ వెళ్లగానే మరమ్మతులకు గురై ఆగిపోయింది. పిల్లలను మాత్రమే కారులో పడుకోబెట్టి అందరూ కారు దిగారు. కారును నెడితే స్టార్ట్ అవుతుందోమోనని కొందరు డ్రైవర్‌తో చెప్పి నెడుతున్నారు. ఇంతలో హైవే విస్తరణ పనులు చేస్తున్న డీఎస్‌పీసీఐఎల్‌కు చెందిన టిప్పర్ మృత్యువులా దూసుకొచ్చింది.
50 మీటర్ల దూరం నుంచే టిప్పర్ కారు వైపు స్పీడుగా దూసుకొస్తుండటాన్ని గమనించిన వెంకటేశ్వర్లు, మురళీలతో పాటు మిగిలిన వారు పెద్దగా చేతులు ఊపుతూ కేకలు పెట్టారు. అయినా నిద్రమత్తో... లేక మద్యం మత్తులో ఉన్న టిప్పర్ డ్రైవర్ బండిని నిలపకుండా వేగంగా వచ్చి కారును ఢీకొట్టాడు. టిప్పర్.. కారును 150 మీటర్ల వరకు ఈడ్చుకెళ్లింది. టిప్పర్ మొత్తం కారుపైకి ఎక్కేసింది. కారులోని నలుగురు పిల్లలతో పాటు కారు డ్రైవర్ నాగరాజు అక్కడికక్కడే మృతి చెందగా మహిళలు గంగమ్మ, లక్ష్మీప్రసన్న, మాధవి తదితరులు గాయపడ్డారు. కళ్ల ముందే పసిబిడ్డలు చనిపోవడంతో ఆ రెండు కుటుంబాలు శోకసంద్రంలో మునిగిపోయాయి.