విజయనగరం: సెకండ్ షో సినిమా చూసి వస్తున్న రెండు వాహనాలు ప్రమాదానికి గురైన ఘటనలో ఒక వ్యక్తి మరణించగా.. మరో ముగ్గురికి తీవ్రగాయాలయ్యాయి. ఈ సంఘటన విజయనగరం జిల్లా పుసపాటిరేగ మండలం కామవరం జంక్షన్ వద్ద శుక్రవారం అర్ధరాత్రి జరిగింది. చింతపల్లి గ్రామానికి చెందిన నలుగురు యువకులు విజయనగరం నుంచి సినిమా చూసి రెండు బైక్‌ల మీద వస్తుండగా.. కామవరం జంక్షన్‌లోని డివైడర్ వద్ద ఎదురుగా వస్తున్న ఆటోని ఢీకొన్నారు. దీంతో.. బైక్ నడుపుతున్న యువకుడు మృతిచెందగా.. మరో ముగ్గురు యువకులు తీవ్రంగా గాయపడ్డారు. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకొని క్షతగాత్రున్ని ఆస్పత్రికి తరలించి.. కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.