పుట్టెంట్రుకలు ఇవ్వకనే ..
కాణిపాకం వినాయకస్వామిని దర్శించుకోవాలని వెళుతున్న ఓ కుటుంబంలోని ఇద్దరిని మృత్యువు కాటేసింది. పిల్లాడి పుట్టెంట్రుకలు స్వామికి ఇవ్వాలనుకున్న ఆ కుటుంబం కోరిక నెరవేరనేలేదు. రెండేళ్ల బాలుడిని ఆర్టీసీ బస్సు బలితీసుకుంది. ఆ చిన్నారి తల్లినీ పొట్టనపెట్టుకుంది. అగరంపల్లె వద్ద శుక్రవారం జరిగిన ఈ రోడ్డు ప్రమాదంలో పిల్లాడు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోతే... తల్లి ఇంకొంతసేపటికే మృతిచెందింది. తండ్రీకొడుకు గాయాలతో ఆస్పత్రిపాలయ్యారు.
ఐరాల/చిత్తూరుఅర్బన్: మండలంలోని అగరంపల్లె వద్ద శుక్రవారం జరిగిన రోడ్డు ప్రమాదంలో తల్లి,కొడుకు మృతిచెందారు. కాణిపాకం ఎస్‌ఐ మురళి కథనం మేరకు గుడిపాల మండలం రామభద్రాపురం గ్రామానికి చెందిన మురళి(35),భవిత(30), వారి కుమార్తె డింపుల్, కుమారుడు ముఖేష్(2) ద్విచక్రవాహనంపై కాణిపాకం ఆలయానికి బయలుదేరారు. అగరంపల్లె టోల్‌గేటు వద్ద మలుపు తిరుగుతుండగా ఆర్టీసీ బస్సు ఢీకొనడంతో ముఖేష్ అక్కడికక్కడే మృతి చెందాడు. భవిత తీవ్రంగా గాయపడింది. ఆస్పత్రికి తరలిస్తుండగా ఆమె మృతిచెందింది. మురళి,డింపుల్‌ను వైద్యనిమిత్తం చిత్తూరు ప్రభుత్వాస్పత్రికి తరలించారు. మృతదేహాలను పోస్టుమార్టం కోసం తరలించారు. కేసు దర్యాప్తులో ఉంది.
ఆస్పత్రిలో మృతుల బంధువుల ఆర్తనాదాలు
కాణిపాకం వద్ద జరిగిన రోడ్డు ప్రమాద మృతుల కుటుం బీకులు, బంధువులతో చిత్తూరు ప్రభుత్వాస్పత్రి ప్రాంగ ణం నిండిపోయింది. తల్లీకొడుకు భవిత, ముఖేష్ మృతదేహాలను చిత్తూరు ప్రభుత్వాస్పత్రిలోని పోస్టుమార్టం గదికి తరలించారు. తమ్ముడు కొత్త ఆటో కొనడంతో దానికి పూజలు చేసి, పిల్లాడి తలవెంట్రుకలు స్వామికి ఇవ్వడానికి వెళుతుండగా ఈ ప్రమాదం జరిగిందని మురళి పేర్కొన్నారు. మృతుల కుటుంబసభ్యులు, బంధువులు ఆస్పత్రి ఆవరణలో చేసిన ఆర్తనాదాలు అందరినీ కంటతడి పెట్టించింది.