
అతి వేగం.. అజాగ్రత్త..
వారందరిదీ ఒకే కుటుంబం. దైవదర్శనం కోసం నగరం నుంచి తిరుపతి, కాణిపాకం వంటి పుణ్యస్థానాలకు వెళ్లి మొక్కులు చెల్లించుకున్నారు. వెళ్లిన కారులోనే స్వగృహానికి తిరుగు ప్రయాణమయ్యారు. ప్రయాణ బడలికతో డ్రైవర్ సహా అంతా అలసిపోయారు. వేకువజామున కారు రోడ్డు వెంబడి పరుగులు తీస్తోంది. మిగిలినవారు గాఢ నిద్రలోకి జారుకున్నారు. దురదృష్టవశాత్తూ డ్రైవర్ కూడా కునుకు తీయడంతో రెప్పపాటులో ఘోరం జరిగిపోయింది. క్షణాల్లో ముగ్గురి ప్రాణాలు గాలిలో కలిసిపోయాయి.
- ముగ్గురి ప్రాణాలు బలిగొన్న డ్రైవర్ నిద్రమత్తు
- కారు డ్రైవర్‌తో పాటు అల్లుడు, అత్త దుర్మరణం
- మామ, భార్య, ఇద్దరు పిల్లలకు తీవ్ర గాయాలు
- తిరుపతి వెళ్లి వస్తుండగా టంగుటూరు వద్ద ఘటన
- మృతులది పటమటలోని పీఅండ్‌టీ కాలనీ
టంగుటూరు (ప్రకాశం) : దైవదర్శనం అనంతరం తిరుగు ప్రయాణంలో జరిగిన ప్రమాదంలో అల్లుడు, అత్త, కారు డ్రైవర్ మృతి చెందగా మామ, భార్య, ఇద్దరు చిన్నారులు తీవ్రంగా గాయపడ్డారు. ఈ ఘటన జాతీయ రహదారిపై ఐవోసీ వద్ద గురువారం తెల్లవారు జామున జరిగింది. వివరాలిలా ఉన్నాయి.. విజయవాడ మున్సిపల్ ఎంప్లాయీస్ కాలనీకి చెందిన ఒకే కుటుంబానికి చెందిన ఆరుగురు ఈ నెల 17వ తేదీ తెల్లవారు జామున కారులో తిరుపతికి, అక్కడి నుంచి కాణిపాకం వెళ్లారు.
దైవదర్శనం అనంతరం తిరిగి బుధవారం రాత్రి 9.30 గంటల సమయంలో విజయవాడకు బయల్దేరారు. వీరు ప్రయాణిస్తున్న కారులో డ్రైవర్ భరత్‌తో పాటు అమెరికాలో సాఫ్ట్‌వేర్ ఇంజనీర్‌గా పనిచేస్తున్న కొసరాజు వెంకట శశికిరణ్, అతని భార్య సంధ్యామాధవి, వారి తొమ్మిదేళ్ల ఏళ్ల కుమార్తె శ్రీ నిత్య, మూడేళ్ల కుమారుడు శ్రీహేము, మామ శివప్రసాద్, అత్త విజయలక్ష్మి ఉన్నారు. వీరు ప్రయాణిస్తున్న కారు టంగుటూరు సమీపంలోని ఐవోసీ వద్దకు చేరుకుంది. జాతీయ రహదారిలో జరుగుతున్న రోడ్డు విస్తరణ పనుల కారణంగా ఐవోసీ వద్ద ట్రాఫిక్‌ను వన్‌వేకి మళ్లించారు.
డివైడర్‌కు తూర్పు వైపు మార్గాన్ని పూర్తిగా నిలిపి వేసి వాహనాల రాకపోకలను పడమర వైపునకు మళ్లించారు. వీరి కారు వన్‌వేలో వేగంగా వస్తుండగా.. డ్రైవర్ నిద్రమత్తు, అజాగ్రత్త కారణంగా ఎదురుగా వస్తున్న లారీని ఢీకొట్టింది. ఈ ఘటనలో కారులో ప్రయాణిస్తున్న శశికిరణ్ (44), విజయలక్ష్మి (55), డ్రైవర్ భరత్ (25) అక్కడికక్కడే మృతి చెందారు. శశికిరణ్ భార్య, మామ, ఇద్దరు పిల్లలు తీవ్రంగా గాయపడ్డారు. సమాచారం అందుకున్న పోలీసులు హైవే అంబులెన్స్ సిబ్బంది క్షతగాత్రులను 108లో ఒంగోలులోని ఓ ప్రైవేట్ వైద్యశాలకు తరలించారు. మృత దేహాలను పోస్టుమార్టం కోసం రిమ్స్‌కు తరలించారు. ఎస్సై కేసు దర్యాప్తు చేస్తున్నారు.
అమెరికా నుంచి వచ్చి..
అమెరికాలో సాఫ్ట్‌వేర్ ఇంజినీర్‌గా పనిచేస్తున్న శశికిరణ్ తన భార్యాపిల్లలతో కలిసి విజయవాడలోని బంధువుల ఇంట వివాహం కోసం గత నెల 31న ఇండియా వచ్చారు. ఈ నెల 10న బంధువుల ఇంట వివాహానికి హాజరయ్యారు. తిరుమల వెంకటేశ్వరుని దర్శించుకుందామని వెళ్లి తిరిగి వస్తుండగా ఈ ప్రమాదం జరిగింది.