బ్రిడ్జిని ఢీకొట్టిన స్కూల్ బస్సు
-
డ్రైవరు నిర్లక్షం వల్లనే ప్రమాదమని ఆరోపణలు
తాడ్వాయి : ప్రవేటు స్కూల్ బస్సు బ్రిడ్జిని ఢీకొన్న ప్రమాదంలో ముగ్గురు విద్యార్థులు, ఇద్దరు ఆయాలకు గాయాలయ్యాయి. నిజామాబాద్ జిల్లా తాడ్వాయి మండలం ఎర్ర పహాడ్ శివారులో ఈ ప్రమాదం చోటుచేసుకుంది. వివరాలు ఇలా ఉన్నాయి. కామారెడ్డి దగ్గరలో ఉన్న ఎస్‌పీఆర్ పాఠశాలకు చెందిన బస్సు రోజు మాదిరిగానే తాడ్వాయి మండలంలోని నందివాడ, ఎర్రపహాడ్,ఎండ్రియాల్, తాడ్వాయి, క్రిష్ణాజివాడి తదితర గ్రామాల నుంచి విద్యార్థులను తీసుకురావడానికి వెళ్లింది. నందివాడకు చెందిన తొమ్మిది మంది విద్యార్థులు, ఎర్రపహాడ్‌కు చెందిన ఆరుగురు విద్యార్థులను తీసుకొని వస్తుండగా డ్రైవర్ నారాగౌడ్ అజాగ్రత్త వల్ల వాగుపై ఉన్న బ్రిడ్జికి ఢీకొట్టింది. దీంతో ఎర్రపహాడ్‌కు చెందిన సొంటికే జనార్దన్–భారతిల కుమారుడు ఆద్శకుమార్ (యూకేజీ)కు ముఖానికి తీవ్రగాయాలు అయ్యాయి. ఎర్రపహాడ్‌కు చెందిన సొంటికే దశరథ్–వీణల కుమార్తె అమూల్య(4వతరగతి)కు చేతి విరిగింది. ఆదిత్య అనే విద్యార్థికి, అందులో ఉన్న ఆయాలు గంగమణి, సుగుణలకు తీవ్రగాయాలు అయ్యాయి. అదేవిధంగా విద్యార్థులు ఆర్వాన్, శెర్వాన్, రిషికేతన్‌కు స్వల్పగాయాలయ్యాయి,వీరిని చికిత్స నిమిత్తం కామారెడ్డిలోని ప్రవేటు హాస్పిటల్‌కు 108 వాహనంలో తరలించారు. ఘటనా స్థలికి మండలంలోని వివిధ గ్రామాల ప్రజలు తరలి వచ్చారు.