మండలంలోని సుందరపేట సమీపంలో జాతీయ రహదారిపై ఆగి ఉన్న కంటైనర్‌ను పుష్కర యాత్రకు వెళ్లివస్తున్న ప్రైవేట్ బస్సు
భోగాపురం: మండలంలోని సుందరపేట సమీపంలో జాతీయ రహదారిపై ఆగి ఉన్న కంటైనర్‌ను పుష్కర యాత్రకు వెళ్లివస్తున్న ప్రైవేట్ బస్సు ఢీకొనడంతో 22 మంది గాయపడ్డారు. వీరంతా శ్రీకాకుళం జిల్లావాసులే. సుందరపేట సీహెచ్‌సీలో ప్రథమ చికిత్స అనంతరం తీవ్రంగా గాయపడిన 11 మందిని 108 వాహనంలో విజయనగరంలోని జిల్లా కేంద్ర ఆస్పత్రికి తరలించారు. స్వల్పంగా గాయపడిన 11 మంది వేరే వాహనాల్లో తమ గ్రామాలకు వెళ్ళిపోయారు. వివరాలిలా ఉన్నాయి.
శ్రీకాకుళం జిల్లా ఆముదాలవలస, తిమ్మాపురం, భైరిశాస్త్రులపేట, కృష్ణాపురం, కరవంజి గ్రామాల్లో ఉంటున్న 10 కుటుంబాలకు చెందిన 39 మంది మంగళవారం ఉదయం ప్రైవేట్ బస్సులో రాజమండ్రి వెళ్లారు. పుష్కర స్నానాలు ముగించుకుని రాత్రి 7.30 గంటలకు తిరుగు ప్రయాణమయ్యారు. తెల్లవారుజామున 4.30 గంటల సమయంలో డ్రైవర్ నిద్రమత్తులోకి జారుకోవడంతో సుందరపేట టోల్‌ప్లాజా సమీపంలో రోడ్డు పక్కన ఆగి ఉన్న కంటైనర్‌ను బస్సు బలంగా ఢీ కొంది. దీంతో 22 మంది గాయపడ్డారు. తీవ్రంగా గాయపడినవారిలో సిమ్మ నారాయణ, సిమ్మ అప్పన్న, రావాడ సుశీల, లంక శ్రీదేవి, వెలమ భారతిల పరిస్థితి ఆందోళనకరంగా ఉందని వారి బంధువులు తెలిపారు. డెంకాడ ఇన్‌చార్జి ఎస్‌ఐ శ్రీనివాసరావు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
క్షతగాత్రులకు కేంద్రాస్పత్రిలో చికిత్స
విజయనగరం ఆరోగ్యం: సుందరపేట వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో గాయపడినవారిలో 10 మంది జిల్లా కేంద్రాస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. వీరిలో ఆముదాలవలస మండలం తిమ్మాపురానికి చెందిన సిమ్మ నారాయణమ్మ, రావాడ సుశీల, సిమ్మ అమ్మన్నమ్మ, ప్రైవేట్ బస్సు డ్రైవర్ ప్రసాద్‌రావు, క్లీనర్ రాంబాబు, జలుమూరు మండలం కరవంజి గ్రామానికి చెందిన ఎస్.శ్రీరాములు, అతని భార్య నాగమ్మ ఆముదాలవలస మండలం కణుగులవలసకు చెందిన బి.కృష్ణారావు, అతని భార్య బి.సుగుణ, మేనకోడలు భారతి ఉన్నారు.