నార్పల/గుత్తి రూరల్, న్యూస్‌లైన్ : శనివారం సాయంత్రం జిల్లాలో రహదారులు రక్తమోడాయి. ఒకే రోజు ఎనిమిది మంది దుర్మరణం చెందారు. నార్పల మండలంలోని ధర్మవరం- నార్పల ప్రధాన రహదారిపై పప్పూరు సమీపంలో ఆటో, వ్యాన్ ఢీకొనడంతో నలుగురు దుర్మరణం చెందగా.. గుత్తి పట్టణ శివారులోని సత్యసాయి వాటర్ ప్రాజెక్టు వద్ద 44వ నంబరు జాతీయ రహదారిపై రాత్రి ఆటో, బైక్‌ను లారీ ఢీకొనడంతో నలుగురు మృతి చెందారు. మృతుల్లో ఓ ఇంజినీరింగ్ విద్యార్థి ఉన్నాడు. ఈ రెండు ప్రమాదాల్లో 11 మంది తీవ్రంగా గాయపడ్డారు.
పోలీసులు, బాధితుల కథనం మేరకు వివరాలిలా ఉన్నాయి. శనివారం సాయంత్రం నార్పల నుంచి బత్తలపల్లికి ప్రయాణికులతో వెళ్తున్న ఆటోను ధర్మవరం వైపు నుంచి వస్తున్న వ్యాన్ ఢీకొంది. ఈ ప్రమాదంలో ఆటోడ్రైవర్ రహంతుల్లా (35), బత్తలపల్లికి చెందిన సిరింతాజ్(16), ధర్మవరానికి చెందిన జిలాన్ (50), మరో గుర్తు తెలియని మహిళ సంఘటన స్థలంలోనే మృతి చెందారు. తీవ్రంగా గాయపడిన వారిలో తాడిమర్రికి చెందిన ఆంజనేయులు, బండ్లపల్లికి చెందిన నబీసాబ్, బందలేడుకు చెందిన కుళ్లాయమ్మ, బత్తలపల్లికి చెందిన హమీదా, ధర్మవరం రూరల్ మండలం బడన్నపల్లికి చెందిన గంగిరెడ్డి ఉన్నారు. వీరు బత్తలపల్లి ఆర్డీటీ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు.
కుళ్లాయమ్మ, గంగిరెడ్డి ఆరోగ్య పరిస్థితి విషమంగా ఉన్నట్లు వైద్యులు తెలిపారు. సిరింతాజ్ సంఘటన స్థలంలోనే మరణించినప్పటికీ ఆ బాలిక స్వగ్రామం బత్తలపల్లి కావడంతో వెంటనే 108 అంబులెన్స్‌లో బత్తలపల్లి ఆర్డీటీ ఆసుపత్రికి తరలించారు. అప్పటికే మృతి చెందిందని వైద్యులు చెప్పారు. ఆటో డ్రైవర్ రహంతుల్లా బంధువుల రోదనలతో సంఘటన స్థలంలో విషాదచాయలు అలుముకున్నాయి. సంఘటన స్థలాన్ని ఇటుకలపల్లి సీఐ మహబూబ్‌బాష, నార్పల ఎస్‌ఐ శేఖర్ ,తహశీల్దార్ రవీంద్ర, వీఆర్వోలు వెంకటేశ్వరరావు,పెద్దన్న పరిశీలించారు. బాధితుల ఫిర్యాదుతో పోలీసులు కేసు నమోదు చేసుకున్నారు.
ఆటో, బైక్‌ను ఢీకొన్న లారీ..
గుత్తి పట్టణ శివారులోని సత్యసాయి వాటర్ ప్రాజెక్టు వద్ద 44వ నంబరు జాతీయ రహదారిపై శనివారం రాత్రి ఆటో, లారీ ఢీకొన్న ప్రమాదంలో నలుగురు మృతి చెందడం, ఆరుగురు తీవ్రంగా గాయపడటానికి అతి వేగమే కారణంగా తెలుస్తోంది. వాటర్ ప్రాజెక్టు వద్ద గుత్తి నుంచి పామిడి వైపు ప్రయాణికులతో వెళ్తున్న డీజిల్ ఆటోను ఎదురుగా వస్తున్న లారీ ఢీకొని, ఆ వెంటనే ఆటో వెనుక ఉన్న ద్విచక్ర వాహనాన్ని కూడా ఢీకొంది.
దీంతో ఆటోలో ప్రయాణిస్తున్న రామరాజుపల్లికి చెందిన భువనేశ్వర్‌రెడ్డి(27), పామిడి మండలం పి కొండాపురానికి చెందిన కుళ్లాయప్ప(40) , మరో గుర్తు తెలియని వ్యక్తి, గుత్తికోటకు చెందిన రామ్మూర్తి, రామరాజుపల్లికి చెందిన 11 ఏళ్ల బాలుడు గంగాధర్‌రెడ్డి, రామరాజుపల్లికి చెందిన రామిరెడ్డి, చిన్నరాయుడు, చింతలాంపల్లికి చెందిన వసంతకుమార్, పామిడికి చెందిన ఆటో డ్రైవరు మహబూబ్‌బాషా, ద్విచక్ర వాహనంపై వెళ్తున్న ఎస్కేడీ కళాశాలలో బీటెక్ చదువుతున్న బొమ్మనహాళ్‌కు చెందిన అబ్దుల్జ్రాక్(20) తీవ్రంగా గాయపడ్డారు.
వెంటనే స్థానికులు గమనించి గాయపడ్డ వారిని 108, ఇతర వాహనాల ద్వారా గుత్తి ప్రభుత్వాస్పత్రికి తరలించారు. ఆస్పత్రిలో చికిత్స పొందుతూ భువనేశ్వర్‌రెడ్డి, కుళ్లాయప్ప, మరో గుర్తు తెలియని వ్యక్తి మృతి చెందారు. పరిస్థితి విషమంగా ఉండడంతో కర్నూలుకు తరలిస్తుండగా మార్గమధ్యలో అబ్దుల్ రజాక్ మరణించాడు. ఆటోను లారీ వేగంగా ఢీకొనడంతో ప్రయాణికులు చెల్లాచెదురుగా కంప చెట్లపై పడ్డారు. సంఘటన స్థలాన్ని గుత్తి ఇన్‌చార్జి సీఐ మహబూబ్ బాషా, ఎస్‌ఐలు గోపాలుడు, మహ్మద్ బాషాలు సందర్శించారు. పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.
రహదారులు రక్తసిక్తం
Published Sun, Nov 10 2013 2:25 AM | Last Updated on Tue, Aug 21 2018 7:53 PM
Advertisement
Advertisement