ఒంగోలు క్రైం : దొంగలు నగరం నడిబొడ్డులో భారీ చోరీకి తెగబడ్డారు. ఒన్‌టౌన్ పోలీసుస్టేషన్‌కు కూతవేటు దూరంలో బుధవారం అర్ధరాత్రి ఓ ఇంట్లో భారీ చోరీ జరిగింది. స్థానిక ఏనుగు చెట్టుకు తాతా కన్నయ్య బిల్డింగ్‌కు మధ్యలో ఉన్న చేజర్ల లక్ష్మణాచారి వీధిలో పారిశ్రామికవేత్త పల్లపోతు ప్రభాకర గుప్తా ఇంట్లో దొంగలు తమ చేతివాటం చూపారు. 1100 గ్రాముల బంగారు ఆభరణాలు, రూ.2 లక్షల నగదు చోరీ చేసినట్లు ప్రాథమికంగా తేలింది. వీటితో పాటు 2.3 కేజీల వెండి వస్తువులు కూడా మాయమయ్యాయి. ప్రభాకరగుప్తా విజయ టైల్స్ అధినేత. ఈ వ్యాపారంతో పాటు పలు ఇతర వ్యాపారాలు చేస్తుంటారు.
గోదావరి పుష్కరాలకని బుధవారం తెల్లవారు జామున కుటుంబ సమేతంగా వెళ్లారు. పుష్కరాలకు వెళ్తూ తమ షాపులో పని చేసే గుమాస్తాను ఇంట్లో ఉంచారు. తెల్లవారు జామున ఇంటి యజమానులు వెళ్లిపోవటంతో ఉదయం 8 గంటల వరకు గుమాస్తా ఉండి ప్రధాన ద్వారం లోపల తాళం వేసి, ఇంటి వరసందు వైపు తలుపునకు కూడా బయట తాళం వేసి షాపునకు వెళ్లిపోయాడు. తాళాన్ని పక్కింటి వారికి ఇచ్చాడు. యజమానులు సాయంత్రమే వస్తారని తెలిసి గుమస్తా రాత్రికి నేరుగా తన ఇంటికి వెళ్లిపోయాడు. తీరా ప్రభాకర గుప్తా కుటుంబం బుధవారం అర్ధరాత్రి 1.30- 2 గంటల మధ్యలో ఇంటికి చేరుకుంది.
ప్రధాన ద్వారం తెరిచేందుకు ప్రయత్నించారు. లోపల గడియ పెట్టి ఉండటంతో తలుపులు తెరుచుకోలేదు. వరసందు వైపు వె ళ్లి తలుపులు తీసేందుకు చూశారు. తీరా చూస్తే తలుపు గడియ విరగ్గొట్టి తలుపు తీసి ఉంది. అప్పుడే ఇంట్లోకి దొంగలు చొరబడి ఉన్నారని భావించి చుట్టు పక్కలవారిని కేకలు వేశారు. అందరూ వచ్చిన తర్వాత లోనికి వెళ్లి చూస్తే ఎవరూ లేరు. దొంగలు ఇంట్లో సొత్తు దోచుకుపోయారని గుర్తించారు. వెంటనే ఒన్‌టౌన్ ఇన్‌చార్జి సిఐ పి.దేవప్రభాకర్‌కు ఫిర్యాదు చేశారు. ఒంగోలు డీఎస్సీ, జి. శ్రీనివాసరావు, సీసీఎస్ డీఎస్పీ కె.వెంకటేశ్వరరావు, ఒన్‌టౌన్, తాలూకా సీఐలు దేవప్రభాకర్, ఎస్.ఆంటోనిరాజులు సంఘటన స్థలానికి చేరుకున్నారు. నగరంతో పాటు పరిసర ప్రాంత మండలాల పోలీసులను అప్రమత్తం చేశారు. అసలు చోరీజరిగింది పగలా.. రాత్రా అన్నది సందిగ్ధంగా మారింది.
రెండు బ్యాగులు అక్కడే వదిలి..
చోరీకి పాల్పడ్డ దొంగలు భారీ మొత్తంలో ఇంట్లో నుంచి దోచుకుపోయారు. మరి ఇది ఒకరి పనా.. లేక ఇద్దరా, ముఠానా అన్నది పోలీసుల దరాప్తులో తేలాల్సి ఉంది. భారీ మొత్తం బంగారు ఆభరణాలు, నగదుతో పాటు మరో రెండు బ్యాగులను కూడా పట్టుకెళ్లారు. లక్ష్మణాచారి వీధిలో నుంచి ఉత్తరంగా బయల్దేరి ఇంటికి సమీపంలో వెనుక పైపు ఉన్న పాడుపడ్డ ఇళ్ల ప్రాంగణంలో రెండు బ్యాగులను దాచి పెట్టారు. తీరా ఆ బ్యాగులను డాగ్ స్క్వాడ్ గురువారం మధ్యాహ్నం గుర్తించింది.
దొంగతనం జరిగిన ఇంటి నుంచి బయల్దేరిన డాగ్ స్క్వాడ్ రెండిళ్లు దాటిన తర్వాత ఉన్న సందులోకి వెళ్లింది. ఆ సందులోని చివర పాడుపడ్డ ఇళ్లలోని చెట్ల పొదల్లోకి వెళ్లి మురకలు పట్టింది. దీంతో స్క్వాడ్ బృందం సభ్యులు ఆ పరిసర ప్రాంతాలను నిశితంగా గమనించారు. చెట్ల పొదల్లో రెండు బ్యాగులు లభించాయి. తీరా వాటిని తీసి చూస్తే వాటి నిండా వెండి ప్లేట్లు, రూ.10, రూ.5 విలువగల బంగారు రంగుతో ఉన్న నాణేలు, రూ.10 నోట్ల కట్టలు, పూజకు వాడే 108 చిన్న బంగారు పుష్పాలు, రకరకాల నేణేలు, ఇతర వెండి వస్తువులు ఉన్నాయి.
సంఘటన స్థలాన్ని పరిశీలించిన ఎస్పీ
ఎస్పీ చిరువోలు శ్రీకాంత్ చోరీ జరిగిన ఇంటిని గురువారం పరిశీలించారు. బాధితులతో మాట్లాడారు. ఏ మేరకు నష్టం జరిగిందో అడిగి తెలుసుకున్నారు. ఇంటి పరిసరాలను గమనించారు. పరిస్థితులను ఒంగోలు డీఎస్పీ జి.శ్రీనివాసరావును అడిగి తెలుసుకున్నారు. దర్యాప్తు వేగవంతం చేయాలని అధికారులను ఆదేశించారు. అనంతరం అక్కడి నుంచి బయల్దేరి ఒన్‌టౌన్ పోలీసుస్టేషన్‌కు చేరుకున్నారు. చోరీ జరిగిన తీరుపై అధికారులతో లోతుగా చర్చించినట్లు సమాచారం.
పుష్కరాలకు వెళ్తే.. ఇల్లు గుల్ల చేశారు
Published Fri, Jul 17 2015 2:51 AM | Last Updated on Thu, Aug 30 2018 5:27 PM
Advertisement