heavy theft
-
చిదంబరం ఇంట్లో భారీ చోరీ!
సాక్షి ప్రతినిధి, చెన్నై: కేంద్ర మాజీ మంత్రి, కాంగ్రెస్ సీనియర్ నేత చిదంబరం ఇంట్లో భారీ చోరీ జరిగినట్లు తెలిసింది. కోట్ల రూపాయల విలువైన ఆభరణాలు, నగదును దొంగలు ఎత్తుకెళ్లినట్లు వార్తలొచ్చాయి. ఈ కేసులో ఇద్దరు పనిమనుషులను పోలీసులు అదుపులోకి తీసుకుని విచారిస్తున్నట్లు సమాచారం. దొంగతనం జరిగిందని తొలుత చేసిన ఫిర్యాదును చిదంబరం భార్య నళిని చిదంబరం ఆదివారం రాత్రి వెనక్కి తీసుకోవడం గమనార్హం. తమ నివాసంలో ఎలాంటి దొంగతనం జరగలేదన్నారు. మీడియాలో వచ్చిన కథనాల ప్రకారం...చెన్నై నుంగంబాక్కం ఫైవ్‌క్రాఫ్ట్స్ రోడ్డులోని ఇంట్లో చిదంబరం, భార్య నళిని, కొడుకు కార్తీ, కోడలు శ్రీనిధి నివసిస్తున్నారు. ఓ కార్యక్రమానికి వెళ్లడానికి ముందు నగలు అలంకరించుకునేందుకు నళిని శనివారం తన గదిలోని బీరువా తెరచిచూడగా అందులో పెట్టిన పురాతన మరకతాలు, బంగారు ఆభరణాలు, నగదు కనిపించలేదు. వెంటనే పోలీసులకు ఫిర్యాదుచేయగా, వారు ఇంటి ప్రాంగణంలో అమర్చిన సీసీ టీవీ ఫుటేజీలను పరిశీలించారు. సుమారు నెల క్రితం ఇద్దరు మహిళలు ముఖాలకు ముసుగేసుకుని నళిని గదిలోకి వెళ్లడం, కొద్దిసేపటి తరువాత ఒక సంచితో బయటకు వచ్చిన దృశ్యాలు అందులో నమోదయ్యాయి. వాటిలోని వ్యక్తుల రూపురేఖల ఆధారంగా, చిదంబరం ఇంట్లో పనిచేస్తున్న వెన్నెల, విజిలను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. -
విద్యుత్ కార్యాలయంలో భారీ చోరీ
తూప్రాన్: డివిజన్ కేంద్రంలోని పోతరాజ్‌పల్లి సమీపంలో రహదారి పక్కన ఉన్న విద్యుత్ డీఈ కార్యాలయంలో శనివారం రాత్రి భారీ చోరీ జరిగింది. తూప్రాన్ డీఎస్పీ రామ్‌గోపాల్‌రావు, విద్యుత్ డీఈ సుభాష్ తెలిపిన వివరాల ప్రకారం.. డివిజన్ పరిధిలోని గ్రామాల్లో వసూలు చేసిన కరెంట్ బిల్లుల నగదు రూ.16.39 లక్షలను రెండు బ్యాగుల్లో ఉంచి కార్యాలయంలోని లాకర్లో శనివారం రాత్రి భద్రపరిచారు. కార్యాలయం ప్రధాన గేటు తాళాన్ని, లాకర్లను దొంగలు గుణపం సహాయంతో పగలగొట్టి నగదును దోచుకెళ్లారు. కార్యాలయంలోని పై అంతస్తులో నిద్రిస్తున్న సిబ్బంది ఈ విషయాన్ని ఆదివారం ఉదయం గుర్తించి, సంబంధిత అధికారులకు సమాచారం అందించారు. దీంతో ఘటన స్థలానికి చేరుకున్న అధికారులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. నిందితుల వేలిముద్రలను క్లూస్ టీమ్ సేకరించినట్లు డీఎస్పీ రామ్‌గోపాల్‌రావు తెలిపారు. -
కర్నూలులో కిలో బంగారం చోరీ
-
కర్నూలులో భారీ చోరీ.. కిలో బంగారం మాయం!
సాక్షి, కర్నూలు: పట్టణంలోని కృష్ణానగర్‌లో భారీ దొంగతనం జరిగింది. కృష్ణానగర్ కాలనీలోని ఓ ఇంట్లో నుంచి దొంగలు కిలో బంగారం, రూ. 4 లక్షల నగదును దోచుకెళ్లారు. ఈ కాలనీలో వరుసగా దొంగతనాలు జరుగుతున్నాయి. అయినా పోలీసులు నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరిస్తున్నారని కాలనీ వాసులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. దొంగల భయంతో తాము హడలిపోతున్నామని అంటున్నారు. కృష్ణా నగర్‌లోని రవీంద్ర స్కూల్ వెనుక వైపు రైల్వే ట్రాక్ ఎదురుగా ఉన్న ఇంట్లో ఎవరూ లేని సమయంలో దొంగలు చోరీకి పాల్పడ్డారు. బంగారంతోపాటు పిల్లల ఫీజుల కోసం దాచి ఉంచిన నగదును దొంగలు దోచుకెళ్లారని బాధితురాలు శ్రీదేవి ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. శుక్రవారం మధ్యాహ్నం ఇంటికి తాళం వేసి నెల్లూరుకు వెళ్లడంతో ఈ ఘటన జరిగింది. ఇంటికి వేసిన తాళాలు తెరిచి ఉండటంతో ఉదయం పక్కింటివారు గుర్తించడంతో రాత్రి చోరీ జరిగిన వ్యవహారం వెలుగుచూసింది. ఘటనపై బాధితురాలు నాలుగో పట్టణ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. పోలీసులు సంఘటనా స్థలాన్ని పరిశీలించారు. -
పుష్కరాలకు వెళ్తే.. ఇల్లు గుల్ల చేశారు
ఒంగోలు క్రైం : దొంగలు నగరం నడిబొడ్డులో భారీ చోరీకి తెగబడ్డారు. ఒన్‌టౌన్ పోలీసుస్టేషన్‌కు కూతవేటు దూరంలో బుధవారం అర్ధరాత్రి ఓ ఇంట్లో భారీ చోరీ జరిగింది. స్థానిక ఏనుగు చెట్టుకు తాతా కన్నయ్య బిల్డింగ్‌కు మధ్యలో ఉన్న చేజర్ల లక్ష్మణాచారి వీధిలో పారిశ్రామికవేత్త పల్లపోతు ప్రభాకర గుప్తా ఇంట్లో దొంగలు తమ చేతివాటం చూపారు. 1100 గ్రాముల బంగారు ఆభరణాలు, రూ.2 లక్షల నగదు చోరీ చేసినట్లు ప్రాథమికంగా తేలింది. వీటితో పాటు 2.3 కేజీల వెండి వస్తువులు కూడా మాయమయ్యాయి. ప్రభాకరగుప్తా విజయ టైల్స్ అధినేత. ఈ వ్యాపారంతో పాటు పలు ఇతర వ్యాపారాలు చేస్తుంటారు. గోదావరి పుష్కరాలకని బుధవారం తెల్లవారు జామున కుటుంబ సమేతంగా వెళ్లారు. పుష్కరాలకు వెళ్తూ తమ షాపులో పని చేసే గుమాస్తాను ఇంట్లో ఉంచారు. తెల్లవారు జామున ఇంటి యజమానులు వెళ్లిపోవటంతో ఉదయం 8 గంటల వరకు గుమాస్తా ఉండి ప్రధాన ద్వారం లోపల తాళం వేసి, ఇంటి వరసందు వైపు తలుపునకు కూడా బయట తాళం వేసి షాపునకు వెళ్లిపోయాడు. తాళాన్ని పక్కింటి వారికి ఇచ్చాడు. యజమానులు సాయంత్రమే వస్తారని తెలిసి గుమస్తా రాత్రికి నేరుగా తన ఇంటికి వెళ్లిపోయాడు. తీరా ప్రభాకర గుప్తా కుటుంబం బుధవారం అర్ధరాత్రి 1.30- 2 గంటల మధ్యలో ఇంటికి చేరుకుంది. ప్రధాన ద్వారం తెరిచేందుకు ప్రయత్నించారు. లోపల గడియ పెట్టి ఉండటంతో తలుపులు తెరుచుకోలేదు. వరసందు వైపు వె ళ్లి తలుపులు తీసేందుకు చూశారు. తీరా చూస్తే తలుపు గడియ విరగ్గొట్టి తలుపు తీసి ఉంది. అప్పుడే ఇంట్లోకి దొంగలు చొరబడి ఉన్నారని భావించి చుట్టు పక్కలవారిని కేకలు వేశారు. అందరూ వచ్చిన తర్వాత లోనికి వెళ్లి చూస్తే ఎవరూ లేరు. దొంగలు ఇంట్లో సొత్తు దోచుకుపోయారని గుర్తించారు. వెంటనే ఒన్‌టౌన్ ఇన్చార్జి సిఐ పి.దేవప్రభాకర్‌కు ఫిర్యాదు చేశారు. ఒంగోలు డీఎస్సీ, జి. శ్రీనివాసరావు, సీసీఎస్ డీఎస్పీ కె.వెంకటేశ్వరరావు, ఒన్‌టౌన్, తాలూకా సీఐలు దేవప్రభాకర్, ఎస్.ఆంటోనిరాజులు సంఘటన స్థలానికి చేరుకున్నారు. నగరంతో పాటు పరిసర ప్రాంత మండలాల పోలీసులను అప్రమత్తం చేశారు. అసలు చోరీజరిగింది పగలా.. రాత్రా అన్నది సందిగ్ధంగా మారింది. రెండు బ్యాగులు అక్కడే వదిలి.. చోరీకి పాల్పడ్డ దొంగలు భారీ మొత్తంలో ఇంట్లో నుంచి దోచుకుపోయారు. మరి ఇది ఒకరి పనా.. లేక ఇద్దరా, ముఠానా అన్నది పోలీసుల దరాప్తులో తేలాల్సి ఉంది. భారీ మొత్తం బంగారు ఆభరణాలు, నగదుతో పాటు మరో రెండు బ్యాగులను కూడా పట్టుకెళ్లారు. లక్ష్మణాచారి వీధిలో నుంచి ఉత్తరంగా బయల్దేరి ఇంటికి సమీపంలో వెనుక పైపు ఉన్న పాడుపడ్డ ఇళ్ల ప్రాంగణంలో రెండు బ్యాగులను దాచి పెట్టారు. తీరా ఆ బ్యాగులను డాగ్ స్క్వాడ్ గురువారం మధ్యాహ్నం గుర్తించింది. దొంగతనం జరిగిన ఇంటి నుంచి బయల్దేరిన డాగ్ స్క్వాడ్ రెండిళ్లు దాటిన తర్వాత ఉన్న సందులోకి వెళ్లింది. ఆ సందులోని చివర పాడుపడ్డ ఇళ్లలోని చెట్ల పొదల్లోకి వెళ్లి మురకలు పట్టింది. దీంతో స్క్వాడ్ బృందం సభ్యులు ఆ పరిసర ప్రాంతాలను నిశితంగా గమనించారు. చెట్ల పొదల్లో రెండు బ్యాగులు లభించాయి. తీరా వాటిని తీసి చూస్తే వాటి నిండా వెండి ప్లేట్లు, రూ.10, రూ.5 విలువగల బంగారు రంగుతో ఉన్న నాణేలు, రూ.10 నోట్ల కట్టలు, పూజకు వాడే 108 చిన్న బంగారు పుష్పాలు, రకరకాల నేణేలు, ఇతర వెండి వస్తువులు ఉన్నాయి. సంఘటన స్థలాన్ని పరిశీలించిన ఎస్పీ ఎస్పీ చిరువోలు శ్రీకాంత్ చోరీ జరిగిన ఇంటిని గురువారం పరిశీలించారు. బాధితులతో మాట్లాడారు. ఏ మేరకు నష్టం జరిగిందో అడిగి తెలుసుకున్నారు. ఇంటి పరిసరాలను గమనించారు. పరిస్థితులను ఒంగోలు డీఎస్పీ జి.శ్రీనివాసరావును అడిగి తెలుసుకున్నారు. దర్యాప్తు వేగవంతం చేయాలని అధికారులను ఆదేశించారు. అనంతరం అక్కడి నుంచి బయల్దేరి ఒన్‌టౌన్ పోలీసుస్టేషన్‌కు చేరుకున్నారు. చోరీ జరిగిన తీరుపై అధికారులతో లోతుగా చర్చించినట్లు సమాచారం. -
నగల దుకాణంలో భారీ చోరీ
* 7 కిలోల వెండి ఆభరణాలు,రూ.80 వేల నగదు అపహరణ * సీసీ టీవీలో దృశ్యాలు నమోదు * తాండూరులో ఆలస్యంగా వెలుగుచూసిన ఘటన తాండూరు: పట్టణంలోని ఓ నగల దుకాణంలో భారీ చోరీ జరిగింది. ఓ దుండగుడు 7 కిలోల వెండి నగలతో పాటు రూ. 80 వేల నగదు అపహరించుకుపోయాడు. సీసీ టీవీలో దృశ్యాలు నమోదయ్యాయి. పోలీస్‌స్టేషన్‌కు కూతవేటు దూరంగా జరిగిన ఈ సంఘటన ఆలస్యంగా శనివారం వెలుగుచూసింది. అర్బన్ ఎస్ఐ అభినవ చతుర్వేది కథనం ప్రకారం.. తాండూరు పట్టణంలోని ‘బాలాజీ బ్రదర్స్’ కాంప్లెక్స్‌లో నగల, బట్టల దుకాణం నడుస్తున్నాయి. వాటి యజమాని గోపాలకృష్ణ ఈనెల 1న రాత్రి తాండూరు మండలంలోని దస్తగిరిపేటలోని శ్రీదేవి,భూదేవి కల్యాణోత్సవానికి కుటుంబీకులతో సహా హాజరయ్యాడు. దుకాణాన్ని సిబ్బంది రాత్రి 9 గంటలకు మూసివేశారు. శుక్రవారం ఉదయం 10 గంటలకు సిబ్బంది రఘు షాపు తెరిచాడు. దుకాణంలోని వెండి, బంగారు నగలున్న గది తలుపు తీసి ఉండటం, లోపల నగలు కనిపించకపోవడంతో చోరీ జరిగిందని అనుమానించి ఆభరణాలు కనిపించకపోవడంతో చోరీ జరిగిందని భావించి వెంటనే యజమాని గోపాలకృష్ణకు సమాచారం ఇచ్చాడు. అర్బన్ సీఐ వెంకట్రామయ్య, ఎస్ఐ అభినవ చతుర్వేది ఘటనా స్థలానికి చేరుకొని వివరాలు సేకరించారు. దుకాణం వెనుక భాగంలోని డ్రైనేజీ పైపుల ద్వారా దుండగుడు పాకుతూ దుకాణం ఉన్న రెండు అంతస్తుల భవనం పైకి ఎక్కాడు. పై అంతస్తులోని రేకుల షెడ్‌ను ధ్వంసం చేశాడు. ఇనుప తలుపును వంచి బట్టల దుకాణం ఉన్న రెండో అంతస్తులోకి ప్రవేశించాడు. ఆ తర్వాత మూడు గ్రిల్స్లకున్న తాళాలు విరగ్గొట్టి మొదటి అంతస్తులోకి ప్రవేశించాడు. రాత్రి 1:30 గంటల సమయంలో నగల దుకాణం గది వద్దకు వెళ్లాడు. అక్కడ అద్దాల తలుపునకున్న తాళం పగులకొట్టి లోపలికి వెళ్లాడు. సీసీ టీవీలో దుండగుడి కదలికలు నమోదయ్యాయి. నిందితుడు తలకు టోపీ, ముఖానికి మాస్క్ ధరించి, చేతిలో టార్చిలైట్ పట్టుకున్నాడు. మొత్తం 7 కిలోల వెండి నగలతో పాటు క్యాష్ కౌంటర్లో ఉన్న రూ.80వేల నగదును అహపరించి ఓ బ్యాగ్‌లో వేసుకొని పరారయ్యాడు. కాగా దుండగుడు లాకర్లో ఉన్న బంగారు ఆభరణాల జోలికి వెళ్లలేదు. చోరీ జరిగిన విధానం చూస్తే దుండగుడు దుకాణంలో ముందే రెక్కీ నిర్వహించి ఉండొచ్చని, అతడు ప్రొఫెషనల్ దొంగ అయి ఉండొచ్చని పోలీసులు అనుమానిస్తున్నారు. చోరీ ఘటనపై తమ సిబ్బందిపై అనుమానం లేదని యజమాని గోపాలకృష్ణ చెప్పాడు. సీసీ టీవీ ఫుటేజీ ఆధారంగా పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. కాగా చోరీ సమయంలో దుండగుడు తాగి పడేసిన నీళ్ల ప్యాకెట్లు, వండ్రంగి పనులకు ఉపయోగించే బాడ్షా పరికరాన్ని పోలీసులు స్వాధీనం చేసుకొన్నారు. ఈమేరకు కేసు దర్యాప్తులో ఉంది. -
మాసాయిపేట కెనరాబ్యాంకులో భారీ చోరీ
-
మాసాయిపేట కెనరాబ్యాంకులో భారీ చోరీ
కెనరా బ్యాంకులో భారీ చోరీ జరిగింది. మెదక్ జిల్లా వెల్దుర్తి మండలం మాసాయిపేటలోని కెనరా బ్యాంకు గోడకు కొంతమంది దొంగలు కన్నం వేశారు. వాళ్లు బ్యాంకులోకి దూరి ముందుగా అక్కడున్న సీసీటీవీ కెమెరాలను ధ్వంసం చేశారు. ఆ తర్వాత లాకర్ రూంను కూడా ధ్వంసం చేసి, అందులో ఉన్న నగదును ఎత్తుకెళ్లారు. దాంతో పాటు బ్యాంకులో ఉన్న ఆరు కంప్యూటర్లను కూడా దొంగలు తీసుకెళ్లారు. లాకర్ రూం వెనకవైపు గోడకు కూడా వాళ్లు కన్నం వేశారు. ఉదయం బ్యాంకు తెరిచిన తర్వాత గానీ ఈ విషయాన్ని ఎవరూ గుర్తించలేకపోయారు. పోలీసులు సంఘటన స్థలానికి చేరుకున్నారు. అయితే.. హైదరాబాద్ నుంచి క్లూస్ టీం వచ్చి, ఇక్కడి ఆధారాలు సేకరించేవరకు ఎంత మొత్తం పోయినదీ ఇంకా తెలిసే అవకాశం లేదు. ఇంత పెద్ద ఎత్తున ప్లాన్ చేసి చోరీ చేశారంటే, బ్యాంకు ఆనుపానులు ముందునుంచి బాగా తెలిసున్నవాళ్లే అయి ఉంటారని పోలీసులు భావిస్తున్నారు. సాధారణంగా ఇక్కడి కెనరా బ్యాంకులో రైతులకు బంగారు రుణాలు ఎక్కువగా ఇస్తుంటారు. దాంతో ఆ నగలు ఏమయ్యాయన్న ఆందోళన కూడా స్థానిక రైతుల్లో వ్యక్తమవుతోంది.