
మాసాయిపేట కెనరాబ్యాంకులో భారీ చోరీ
కెనరా బ్యాంకులో భారీ చోరీ జరిగింది. మెదక్ జిల్లా వెల్దుర్తి మండలం మాసాయిపేటలోని కెనరా బ్యాంకు గోడకు కొంతమంది దొంగలు కన్నం వేశారు. వాళ్లు బ్యాంకులోకి దూరి ముందుగా అక్కడున్న సీసీటీవీ కెమెరాలను ధ్వంసం చేశారు. ఆ తర్వాత లాకర్ రూంను కూడా ధ్వంసం చేసి, అందులో ఉన్న నగదును ఎత్తుకెళ్లారు. దాంతో పాటు బ్యాంకులో ఉన్న ఆరు కంప్యూటర్లను కూడా దొంగలు తీసుకెళ్లారు. లాకర్ రూం వెనకవైపు గోడకు కూడా వాళ్లు కన్నం వేశారు. ఉదయం బ్యాంకు తెరిచిన తర్వాత గానీ ఈ విషయాన్ని ఎవరూ గుర్తించలేకపోయారు.
పోలీసులు సంఘటన స్థలానికి చేరుకున్నారు. అయితే.. హైదరాబాద్ నుంచి క్లూస్ టీం వచ్చి, ఇక్కడి ఆధారాలు సేకరించేవరకు ఎంత మొత్తం పోయినదీ ఇంకా తెలిసే అవకాశం లేదు. ఇంత పెద్ద ఎత్తున ప్లాన్ చేసి చోరీ చేశారంటే, బ్యాంకు ఆనుపానులు ముందునుంచి బాగా తెలిసున్నవాళ్లే అయి ఉంటారని పోలీసులు భావిస్తున్నారు. సాధారణంగా ఇక్కడి కెనరా బ్యాంకులో రైతులకు బంగారు రుణాలు ఎక్కువగా ఇస్తుంటారు. దాంతో ఆ నగలు ఏమయ్యాయన్న ఆందోళన కూడా స్థానిక రైతుల్లో వ్యక్తమవుతోంది.