నగల దుకాణంలో భారీ చోరీ
* 7 కిలోల వెండి ఆభరణాలు,రూ.80 వేల నగదు అపహరణ
* సీసీ టీవీలో దృశ్యాలు నమోదు
* తాండూరులో ఆలస్యంగా వెలుగుచూసిన ఘటన
తాండూరు: పట్టణంలోని ఓ నగల దుకాణంలో భారీ చోరీ జరిగింది. ఓ దుండగుడు 7 కిలోల వెండి నగలతో పాటు రూ. 80 వేల నగదు అపహరించుకుపోయాడు. సీసీ టీవీలో దృశ్యాలు నమోదయ్యాయి. పోలీస్‌స్టేషన్‌కు కూతవేటు దూరంగా జరిగిన ఈ సంఘటన ఆలస్యంగా శనివారం వెలుగుచూసింది. అర్బన్ ఎస్‌ఐ అభినవ చతుర్వేది కథనం ప్రకారం.. తాండూరు పట్టణంలోని ‘బాలాజీ బ్రదర్స్’ కాంప్లెక్స్‌లో నగల, బట్టల దుకాణం నడుస్తున్నాయి.
వాటి యజమాని గోపాలకృష్ణ ఈనెల 1న రాత్రి తాండూరు మండలంలోని దస్తగిరిపేటలోని శ్రీదేవి,భూదేవి కల్యాణోత్సవానికి కుటుంబీకులతో సహా హాజరయ్యాడు. దుకాణాన్ని సిబ్బంది రాత్రి 9 గంటలకు మూసివేశారు. శుక్రవారం ఉదయం 10 గంటలకు సిబ్బంది రఘు షాపు తెరిచాడు. దుకాణంలోని వెండి, బంగారు నగలున్న గది తలుపు తీసి ఉండటం, లోపల నగలు కనిపించకపోవడంతో చోరీ జరిగిందని అనుమానించి ఆభరణాలు కనిపించకపోవడంతో చోరీ జరిగిందని భావించి వెంటనే యజమాని గోపాలకృష్ణకు సమాచారం ఇచ్చాడు.
అర్బన్ సీఐ వెంకట్రామయ్య, ఎస్‌ఐ అభినవ చతుర్వేది ఘటనా స్థలానికి చేరుకొని వివరాలు సేకరించారు. దుకాణం వెనుక భాగంలోని డ్రైనేజీ పైపుల ద్వారా దుండగుడు పాకుతూ దుకాణం ఉన్న రెండు అంతస్తుల భవనం పైకి ఎక్కాడు. పై అంతస్తులోని రేకుల షెడ్‌ను ధ్వంసం చేశాడు. ఇనుప తలుపును వంచి బట్టల దుకాణం ఉన్న రెండో అంతస్తులోకి ప్రవేశించాడు. ఆ తర్వాత మూడు గ్రిల్స్‌లకున్న తాళాలు విరగ్గొట్టి మొదటి అంతస్తులోకి ప్రవేశించాడు. రాత్రి 1:30 గంటల సమయంలో నగల దుకాణం గది వద్దకు వెళ్లాడు.
అక్కడ అద్దాల తలుపునకున్న తాళం పగులకొట్టి లోపలికి వెళ్లాడు. సీసీ టీవీలో దుండగుడి కదలికలు నమోదయ్యాయి. నిందితుడు తలకు టోపీ, ముఖానికి మాస్క్ ధరించి, చేతిలో టార్చిలైట్ పట్టుకున్నాడు. మొత్తం 7 కిలోల వెండి నగలతో పాటు క్యాష్ కౌంటర్‌లో ఉన్న రూ.80వేల నగదును అహపరించి ఓ బ్యాగ్‌లో వేసుకొని పరారయ్యాడు. కాగా దుండగుడు లాకర్‌లో ఉన్న బంగారు ఆభరణాల జోలికి వెళ్లలేదు. చోరీ జరిగిన విధానం చూస్తే దుండగుడు దుకాణంలో ముందే రెక్కీ నిర్వహించి ఉండొచ్చని, అతడు ప్రొఫెషనల్ దొంగ అయి ఉండొచ్చని పోలీసులు అనుమానిస్తున్నారు.
చోరీ ఘటనపై తమ సిబ్బందిపై అనుమానం లేదని యజమాని గోపాలకృష్ణ చెప్పాడు. సీసీ టీవీ ఫుటేజీ ఆధారంగా పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. కాగా చోరీ సమయంలో దుండగుడు తాగి పడేసిన నీళ్ల ప్యాకెట్‌లు, వండ్రంగి పనులకు ఉపయోగించే బాడ్‌షా పరికరాన్ని పోలీసులు స్వాధీనం చేసుకొన్నారు. ఈమేరకు కేసు దర్యాప్తులో ఉంది.