Silver jewelery
-
ఆలయంలో భారీ చోరీ
కరీంనగర్ పట్టణంలోని ప్రశాంత్‌నగర్‌లో ఉన్న ప్రసన్నాంజనేయ స్వామి ఆలయంలో దొంగలు విలువైన విగ్రహాలు, వెండి వస్తువులను ఎత్తుకుపోయారు. పోలీసుల కథనం మేరకు శనివారం రాత్రి 9 గంటలకు పూజారి ఆలయం గర్భగుడికి తాళాలు వేసి వెళ్లారు. ఆలయం ముందు వినాయకుడి విగ్రహం పెట్టి నవరాత్రోత్సవాలు నిర్వహిస్తుండటంతో.. రాత్రి 11.30 గంటల వరకు ఆ ప్రాంతం సందడిగా ఉంది. కాగా, తెల్లవారుజామున ఆలయం తాళాలు పగులగొట్టి ఉండడాన్ని చూసిన స్థానికులు సెక్యూరిటీ గార్డుకు సమాచారం ఇచ్చారు. అతడు పోలీసులకు సమాచారం అందించాడు. గర్భగుడిలో స్వామి మూలవిరాట్టుకు అలంకరించిన నాలుగు కిలోల వెండి ఆభరణాలు.. వెండి విగ్రహం.. పంచలోహ విగ్రహం.. హుండీలో నగదును దొంగలు కొల్లగొట్టారు. -
గ్రామీణ బ్యాంక్‌లో భారీ దోపిడీ
రూ.14 లక్షల నగదు రూ.6 కోట్ల విలువైన ఆభరణాలు దోచుకెళ్లిన దుండగులు హాసన్ జిల్లాలో సంఘటన బెంగళూరు(బనశంకరి) : నిత్యం జనసమ్మర్ధం ఉన్న ప్రాంతంలో దుండగులు బ్యాంక్ గోడకు కన్నం వేసి రూ. 14 లక్షల నగదు, రూ.6 కోట్లు విలువైన బంగారు, వెండి ఆభరణాలను దోచుకెళ్లిన సంఘటన హాసన్ జిల్లా చెన్నరాయపట్టణ తాలూకాలోని హిరిసావలోని కావేరిగ్రామీణ బ్యాంక్‌లో సోమవారం వెలుగుచూసింది. వివరాలు.... కావేరి గ్రామీణ బ్యాంక్‌లో శనివారం బ్యాంక్ కార్యకలాపాలు నిర్వహించిన తరువాత బ్యాంక్‌కు అధికారులు తాళం వేశారు. ఆదివారం సెలవు రోజు కావడం కావడంతో అక్కడికి ఎవరూ వెళ్లలేదు. సోమవారం గణతంత్ర దినోత్సవం కావ డంతో బ్యాంక్ అధికారులు గణతంత్ర దినోత్సవం నిర్వహించడానికి బ్యాంక్ వద్దకు వెళ్లారు. అక్కడికి వెళ్లిన సందర్భంలో గోడకు కన్నం వేసి ఉండటాన్ని గమనించిన బ్యాంక్ సిబ్బంది తక్షణమే బ్యాంక్ ఉన్నతాధికారులకు, పోలీసులకు సమాచారం అందించారు. హుటాహుటిన పోలీసులు, బ్యాంక్ అధికారులు అక్కడికి చేరుకుని తలుపులు తెరిచారు. పోలీసులు డాగ్‌స్క్వాడ్‌తో, వేలిముద్రల నిపుణులతో క్షుణ్ణంగా పరిశీలించారు. బ్యాంక్ వెనుక వైపున గోడకు కన్నం వేసి బ్యాంకులోకి ప్రవేశించిన దుండగులు లాకర్లో ఉన్న రూ.14 లక్షలు నగదు, రూ.6 కోట్లు విలువ చేసే బంగారు వెండి ఆభరణాలు దోచుకెళ్లినట్లు గుర్తించారు. దోపిడీకీ పాల్పడిన దుండగరులు ఎలాంటి ఆధారాలు లభించకుండా బ్యాంకులోని స్ట్రాంగ్‌రూమ్‌లో అమర్చిన వైర్లను కత్తరించి సీసీ టీవీలను ధ్వంసం చేయడమే కాక బ్యాంకులోని కంప్యూటర్లను ధ్వంసం చేశారు. సంఘటనా స్థలాన్ని జిల్లా ఎస్పీ రవి డీ.కణ్ణణ్ణనవర్ పరిశీలించారు. బ్యాంకు దోపిడీకీ పాల్పడిన దుండగులు కోసం తీవ్రంగా గాలిస్తున్నారు. హిరిసావపట్టణ పోలీసు లు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు. -
నగల దుకాణంలో భారీ చోరీ
* 7 కిలోల వెండి ఆభరణాలు,రూ.80 వేల నగదు అపహరణ * సీసీ టీవీలో దృశ్యాలు నమోదు * తాండూరులో ఆలస్యంగా వెలుగుచూసిన ఘటన తాండూరు: పట్టణంలోని ఓ నగల దుకాణంలో భారీ చోరీ జరిగింది. ఓ దుండగుడు 7 కిలోల వెండి నగలతో పాటు రూ. 80 వేల నగదు అపహరించుకుపోయాడు. సీసీ టీవీలో దృశ్యాలు నమోదయ్యాయి. పోలీస్‌స్టేషన్‌కు కూతవేటు దూరంగా జరిగిన ఈ సంఘటన ఆలస్యంగా శనివారం వెలుగుచూసింది. అర్బన్ ఎస్ఐ అభినవ చతుర్వేది కథనం ప్రకారం.. తాండూరు పట్టణంలోని ‘బాలాజీ బ్రదర్స్’ కాంప్లెక్స్‌లో నగల, బట్టల దుకాణం నడుస్తున్నాయి. వాటి యజమాని గోపాలకృష్ణ ఈనెల 1న రాత్రి తాండూరు మండలంలోని దస్తగిరిపేటలోని శ్రీదేవి,భూదేవి కల్యాణోత్సవానికి కుటుంబీకులతో సహా హాజరయ్యాడు. దుకాణాన్ని సిబ్బంది రాత్రి 9 గంటలకు మూసివేశారు. శుక్రవారం ఉదయం 10 గంటలకు సిబ్బంది రఘు షాపు తెరిచాడు. దుకాణంలోని వెండి, బంగారు నగలున్న గది తలుపు తీసి ఉండటం, లోపల నగలు కనిపించకపోవడంతో చోరీ జరిగిందని అనుమానించి ఆభరణాలు కనిపించకపోవడంతో చోరీ జరిగిందని భావించి వెంటనే యజమాని గోపాలకృష్ణకు సమాచారం ఇచ్చాడు. అర్బన్ సీఐ వెంకట్రామయ్య, ఎస్ఐ అభినవ చతుర్వేది ఘటనా స్థలానికి చేరుకొని వివరాలు సేకరించారు. దుకాణం వెనుక భాగంలోని డ్రైనేజీ పైపుల ద్వారా దుండగుడు పాకుతూ దుకాణం ఉన్న రెండు అంతస్తుల భవనం పైకి ఎక్కాడు. పై అంతస్తులోని రేకుల షెడ్‌ను ధ్వంసం చేశాడు. ఇనుప తలుపును వంచి బట్టల దుకాణం ఉన్న రెండో అంతస్తులోకి ప్రవేశించాడు. ఆ తర్వాత మూడు గ్రిల్స్లకున్న తాళాలు విరగ్గొట్టి మొదటి అంతస్తులోకి ప్రవేశించాడు. రాత్రి 1:30 గంటల సమయంలో నగల దుకాణం గది వద్దకు వెళ్లాడు. అక్కడ అద్దాల తలుపునకున్న తాళం పగులకొట్టి లోపలికి వెళ్లాడు. సీసీ టీవీలో దుండగుడి కదలికలు నమోదయ్యాయి. నిందితుడు తలకు టోపీ, ముఖానికి మాస్క్ ధరించి, చేతిలో టార్చిలైట్ పట్టుకున్నాడు. మొత్తం 7 కిలోల వెండి నగలతో పాటు క్యాష్ కౌంటర్లో ఉన్న రూ.80వేల నగదును అహపరించి ఓ బ్యాగ్‌లో వేసుకొని పరారయ్యాడు. కాగా దుండగుడు లాకర్లో ఉన్న బంగారు ఆభరణాల జోలికి వెళ్లలేదు. చోరీ జరిగిన విధానం చూస్తే దుండగుడు దుకాణంలో ముందే రెక్కీ నిర్వహించి ఉండొచ్చని, అతడు ప్రొఫెషనల్ దొంగ అయి ఉండొచ్చని పోలీసులు అనుమానిస్తున్నారు. చోరీ ఘటనపై తమ సిబ్బందిపై అనుమానం లేదని యజమాని గోపాలకృష్ణ చెప్పాడు. సీసీ టీవీ ఫుటేజీ ఆధారంగా పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. కాగా చోరీ సమయంలో దుండగుడు తాగి పడేసిన నీళ్ల ప్యాకెట్లు, వండ్రంగి పనులకు ఉపయోగించే బాడ్షా పరికరాన్ని పోలీసులు స్వాధీనం చేసుకొన్నారు. ఈమేరకు కేసు దర్యాప్తులో ఉంది. -
చైన్‌స్నాచింగ్ ముఠా అరెస్ట్
మదనపల్లెక్రైం: మదనపల్లె, వాల్మీకిపురంలో హల్చల్ చేస్తున్న చైన్‌స్నాచింగ్ ముఠాను ప్రత్యేక ఐడీ పార్టీ పోలీసులు పట్టుకున్నారు. వారి నుంచి రూ.7.2 లక్షల విలువైన 263 గ్రాముల బంగారు, 200 గ్రాముల వెండి ఆభరణాలను రికవరీ చేశారు. ఆదివారం ఉదయం స్థానిక రెండో పట్టణ పోలీస్‌స్టేషన్‌లో ముఠా అరెస్ట్ చూపారు. డీఎస్పీ కే.రాఘవరెడ్డి, సీఐ గంగయ్య చెప్పిన వివరాల మేరకు.. వైఎస్ఆర్ జిల్లా రాయచోటి మండలం పోడలపల్లెకు చెందిన వెంకటరమణ కుమారుడు శంకారపు వెంకటేష్ (30), గాలివీడు మండలం బలిజపల్లె పంచాయతీ తూముకుంటకు చెందిన గంగరాజు విశ్వనాథ్ అలియాస్ విశ్వ(32), కర్ణాటక రాష్ట్రం కోలారు జిల్లా కఠారుముద్దలపల్లెకు చెందిన మామకుంట్ల మంజునాథ్ అలియాస్ మంజు(34) కొన్నేళ్ల క్రితం నీరుగట్టువారిపల్లెలో కొంతకాలంగా మగ్గాలు నేసుకుంటూ జీవిస్తున్నారు. వీరికి మరో ముగ్గురు స్నేహితులు తోడయ్యారు. జల్సాలకు అలవాటుపడి డబ్బు కోసం చైన్ స్నాచింగ్‌లకు దిగారు. మదనపల్లె, వాల్మీకిపురం ప్రాంతాల్లో ఆరు నెలలుగా చైన్ స్నాచింగ్‌లకు పాల్పడుతున్నారు. బాధితుల ఫిర్యాదు మేరకు డీఎస్పీ ప్రత్యేక పోలీసు బలగాలను రంగంలోకి దింపారు. వీరు ముఠా గుట్టును రట్టు చేశారు. దోచుకున్న నగలను బెంగళూరులో విక్రయిం చేందుకు వెళుతుండగా విజయ డెయిరీ సమీపంలో పోలీసులు అరెస్ట్ చేశారు. ద్విచక్ర వాహనాన్ని స్వాధీనం చేసుకున్నారు. ముఠాను పట్టుకున్న ఐడీ పార్టీ సిబ్బందిని డీఎస్పీ అభినందించి, రివార్డులు అందజేశారు. -
‘ముత్తూట్’ మరవకముందే మరో చోరీ
జహీరాబాద్ : పట్టణంలో ఫిబ్రవరి 2వ తేదీ రాత్రి ముత్తూట్ ఫైనాన్స్ దోపిడీకి గురైన సంఘటనను మరవక ముందే హనుమాన్ మందిర్ రోడ్డు లో గల రఫీ జ్యూవెలర్స్‌లో మంగళవారం అర్ధరాత్రి చోరీ జరిగింది. ఈ చోరీలో 50 తులాల బంగారం, 20 తులాల వెండి ఆభరణాలు దొంగలు దోచుకెళ్లారు. అయితే దోపిడీలో ఆరి తేరిన వారే బంగారు దుకాణంలో దొంగతనానికి పాల్పడి ఉంటారని పోలీసులు భావిస్తున్నారు. దుకాణం గురించి అంచనా వేసిన అనంతరమే చోరీకి పాల్పడి ఉండవచ్చనే అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. జ్యూవెలర్స్ షాప్‌లోని పై అంతస్తులో బట్టల దుకాణం కూడా నిర్వహిస్తుండడంతో దొంగలు ముందుగానే దుకాణం గురించి పూర్తిగా అవగాహన పొంది న అనంతరమే దోపిడీకి పాల్పడి ఉండవచ్చనే అభిప్రాయాన్ని పలువు రు వ్యక్తం చేస్తున్నారు. ఇదిలా ఉండ గా.. ముత్తూట్ ఫైనాన్స్‌లో అప్పట్లో భారీగా దొంగతనం జరిగింది. అంత కు ముందు కూడా జహీరాబాద్ ప్రాంతంలోని పలు బ్యాంకులలో దొంగతనం, దొంగతనం యత్నం జరిగింది. 2013 మార్చి 18న కొత్తూర్ (బీ) గ్రామంలో గల సిండికేట్ బ్యాంకులో చోరికి పాల్పడి రూ.3.75 లక్షల నగదును అపహరించారు. 2013 మార్చి 28న కోహీర్ మండలం కవేలి సిండికేట్ బ్యాంకు ను దోపిడీ చేసేందుకు ప్రయత్నించి విఫలం అయ్యారు. ఈ సందర్భంగా దొంగలు జరిపిన కాల్పుల్లో అప్పటి ఎస్ఐ వెంకటేష్ గాయపడిన విష యం తెలిసిందే. 2013 జూన్ 25న జహీరాబాద్ మండలం మల్చల్మ సిండికేట్ బ్యాంకులో దొంగలు చోరీకి ప్రయత్నించి విఫలమయ్యారు. దొంగల కోసం ప్రత్యేక టీంలు దొంగలను పట్టుకునేందుకు గాను పోలీసులు ప్రయత్నాలు మొదలు పెట్టాయి. దొంగతనం జరిగిన తీరు ను బట్టి ఎక్కడి గ్యాంగ్ పని అయి ఉంటుందనే కోణంలో పోలీసులు దర్యాప్తు ప్రారంభించినట్లు తెలిసింది. ముత్తూట్ ఫైనాన్స్ దోపిడీలో జార్ఖం డ్ ప్రాంతానికి చెందిన వారిగా అప్ప ట్లో పోలీసులు గుర్తించారు. వారిలో కొందరు ఇప్పటికే పట్టుబడ్డారు. జూయలర్స్ దుకాణం దోపిడీకి సంబంధించి పక్కనే ఉన్న కర్ణాటక, మహారాష్ట్ర రాష్ట్రాలకు చెందిన వారు ఉండి ఉంటారా అనే విషయంలో కూడా దర్యాప్తు చేస్తున్నట్లు తెలిసింది.