sp srikanth
-
బాబోయ్.. బాబాయ్
♦ చిన్నారిని నిర్బంధించిన చిన్నాన్న.. చేతులు విరిచి కట్టి నోటికి ప్లాస్టర్ ♦ అన్న ఆర్థికంగా సహకరించలేదనే.. ఓ మహిళ, స్నేహితుడు అరెస్టు ♦ ప్రకాశం జిల్లా కనిగిరిలో కలకలం.. 12 గంటల్లోనే చేధించిన పోలీసులు ఒంగోలు క్రైం: ప్రకాశం జిల్లా కనిగిరిలో సొంత అన్న కూతురిపై తమ్ముడు కర్కశంగా వ్యవహరించాడు. ఆర్థికంగా అన్న సహకరించలేదనే అక్కసుతో ఆరేళ్ల చిన్నారిని అపహరించి అమానవీయంగా ప్రవర్తించాడు. పాపను పెడరెక్కలు విరిచి కట్టేసి, కళ్లకు గంతలు కట్టి, నోటికి ప్లాస్టర్ వేసి, బోర్లా పడుకోబెట్టి అతి కిరాతకంగా నిర్బం ధించాడు. చిట్టితల్లి విడిపించుకోవడానికి పెనుగులాడినా విడిచిపెట్టలేదు. చివరకు సెల్‌ఫోన్ సిగ్నల్స్ ఆధారంగా 12 గంటల వ్యవధిలోనే పోలీసులు ఛేదించారు. అతనికి సహకరించిన మరో మహిళ, స్నేహితుడిని అరెస్టు చేశారు. జిల్లా అదనపు ఎస్పీ బి.రామానాయక్ శుక్రవారం విలేకరులతో మాట్లాడుతూ.. కనిగిరికి చెందిన దేవిరెడ్డి శ్రీనివాసులురెడ్డి చిన్న కుమార్తె సహస్రను గురువారం సొంత తమ్ముడు రాజేశ్‌రెడ్డి తన స్నేహితునితో కలసి కిడ్నాప్ చేశాడని తెలిపారు. ముఖానికి ముసుగులు ధరించి, తలపై హెల్మెట్ పెట్టుకొని వచ్చి ఇంటివద్ద ఆడుకుంటున్న బాలికను కిడ్నాప్ చేసి బైక్‌పై విజయవాడకు తీసుకెళ్లి ఓ అపార్ట్మెంటులో బంధించారన్నారు. కిడ్నాప్ సమాచారం అందగానే రాజేశ్‌రెడ్డి కదలికలపై పోలీసులు నిఘా ఉంచారని చెప్పారు. ఆర్థికంగా సహకరించటంలేదన్న కోపంతో అన్న శ్రీనివాసులురెడ్డిపై పెంచుకున్న అక్కసే ఈ దుశ్చర్యకు పాల్పడేటట్టు చేసిందన్నారు. సెల్ ఫోన్‌ను ఇంటివద్దే వదిలేయడం, విధులకు వెళ్లకపోయినా వచ్చినట్లు సహ ఉద్యోగులతో చెప్పిం చడంతో ఆ దిశగా దర్యాప్తు చేపట్టినట్లు వివరించారు. ఏమీ తెలియనట్టు పాప తల్లిదండ్రులతో మాట్లాడుతూ ఇంకోవైపు కిడ్నాప్ చేసిన నిందితులతో మాట్లాడుతున్న విషయూన్ని పసిగట్టామన్నారు. రూ.50 లక్షలిస్తే పాపను వదిలేస్తామని, పోలీసులకు చెబితే చంపేస్తామని బెదిరించాడని తెలిపారు. ఫోన్‌కాల్ లొకేషన్‌కు అనుగుణంగా పాప, బాబాయి కదలికలు ఉండటంతో అనుమానాలకు బలం చేకూరిందన్నారు. కనిగిరి సమీపంలోని గుళ్లాపల్లి టోల్గేట్ వద్ద నిందితుణ్ని అదుపులోకి తీసుకొని తమదైన శైలిలో విచారించడంతో కిడ్నాప్ వెనుక తానే ఉన్నానని అంగీకరించాడని వివరించారు. స్నేహితురాలి కాపలా..: పాపను దాచిన అపార్ట్మెంట్ వద్దకు నిందితుడు పోలీసులను తీసుకెళ్లాడు. అపార్ట్మెంట్లో రాజేశ్‌రెడ్డి స్నేహితురాలు షేక్ బషీరాను కాపలాగా ఉంచాడు. ఊపిరాడక పెనుగులాడుతున్న చిన్నారిని పోలీసులు కట్లు ఊడదీసి వైద్య పరీక్షలకు తీసుకెళ్లారు. ప్రధాన నిందితుడు రాజేశ్‌రెడ్డితోపాటు అతనికి సహకరించిన సాల్మన్, షేక్ బషీరాలను అరెస్ట్ చేసి.. వారివద్ద నుంచి మోటార్ సైకిల్, కత్తులు, మాస్క్‌లు, గ్లౌస్లు స్వాధీనం చేసుకున్నారు. 12 గంటల్లో ఛేదించిన సిబ్బందికి జిల్లా ఎస్పీ శ్రీకాంత్ రివార్డులు ప్రకటించారు. -
ఇద్దరు దొంగలు అరెస్టు
ఒకరు విశాఖపట్నంకు చెందిన అంతర్రాష్ట్ర దొంగ మరొకరు శ్రీకాకుళం జిల్లాకు చెందిన పాత నిందితుడు నిందితుల నుంచి రూ.10.60 లక్షల సొత్తు స్వాధీనం వివరాలు వెల్లడించిన ఏఎస్పీ రామానాయక్ ఒంగోలు క్రైం : ఒంగోలు సీసీఎస్ పోలీసులు ఇద్దరు దొంగలను అరెస్టు చేశారు. వారిలో ఒకరు అంతర్ రాష్ట్ర దొంగ కాగా, మరొకరు అంతర్ జిల్లా దొంగ. స్థానిక సీసీఎస్ పోలీస్‌స్టేషన్‌లో శుక్రవారం సాయంత్రం ఏర్పాటుచేసిన విలేకరుల సమావేశంలో సీసీఎస్ డీఎస్పీ కేశన వెంకటేశ్వర్లుతో కలిసి జిల్లా అదనపు ఎస్పీ బి.రామానాయక్ ఆ వివరాలు వెల్లడించారు. వారు తెలిపిన వివరాల ప్రకారం... ఒంగోలుతో పాటు జిల్లాలో దొంగతనాలపై ప్రత్యేక నిఘా కోసం రెండు బృందాలు ఏర్పాటు చేశారు. ఒంగోలు ఆర్టీసీ బస్టాండ్ సమీపంలో అనుమానాస్పదంగా తిరుగుతున్న అంతర్ రాష్ట్ర దొంగ వాండ్రాసి ఆనందకుమార్ (29)ను ఆయా బృందాలు అదుపులోకి తీసుకున్నాయి. అతని నుంచి 48 సవర్ల బంగారు ఆభరణాలు, 1.5 కేజీల వెండి వస్తువులు స్వాధీనం చేసుకున్నారు. వాటి విలువ రూ.10 లక్షల వరకూ ఉంది. ఆనంద్‌కుమార్ విశాఖపట్నం మధురవాడ జంక్షన్ వాసి. గతంలో విశాఖపట్నంలోని జనరల్ స్టోర్‌లో పనిచేస్తూ డ్యాన్స్ ఈవెంట్లు కూడా చేసేవాడు. అయితే, దొంగతనాలకు అలవాటు పడి విశాఖపట్నంతో పాటు అనంతపురం, ఏలూరు, ప్రాంతాల్లో పలు దొంగతనాలకు పాల్పడ్డాడు. అతనిపై విశాఖపట్నంతో పాటు గాజువాక, హైదరాబాద్, కూకట్పల్లి, పంజాగుట్ట, మయ్యాపూర్, అనంతపురం, భీమవరం ప్రాంతాల్లో దొంగతనం కేసులు ఉన్నాయి. 2015 జూలైలో ఒంగోలు తాలూకా పోలీస్‌స్టేషన్ పరిధిలోని సుజాతనగర్ 10వ లైన్లో క్రోసూరి మురళీధర్ ఇంట్లో 5 సవర్ల బంగారు ఆభరణాలు దొంగిలించాడు. అదేరోజు సాయంత్రం తాలూకా పరిధిలోని రాజీవ్‌నగర్‌లో పచ్చవ వరలక్ష్మి ఇంట్లో ఎవరూ లేని సమయంలో తాళాలు పగులగొట్టి 1.5 కేజీల వెండి వస్తువులు, ఒక సవర బంగారు వస్తువు అపహరించుకుపోయాడు. ఇతర జిల్లాల్లోనూ అనేక చోరీలకు పాల్పడ్డాడు. రెండో దొంగ పాత నిందితుడే... పట్టుబడిన రెండోదొంగ శ్రీకాకుళం జిల్లా బుడితికి చెందిన గురివిల్ల అప్పలనాయుడు కాగా, ఇతను ప్రస్తుతం సింగరాయకొండలోని సోమరాజుపల్లి పంచాయతీ టి.పి.నగర్లో నివాసం ఉంటున్నాడు. గతంలో జిల్లాలో పలు దొంగతనాలు చేసి ఆయా కేసుల్లో పట్టుబడి రిమాండ్‌కు వెళ్లాడు. ఈ నెల 2వ తేదీ జైలు నుంచి బయటకు వచ్చాడు. మళ్లీ ఒంగోలు తాలూకా పోలీస్‌స్టేషన్ పరిధిలోని ఎన్జీవో కాలనీలో నివాసముంటున్న ఇంజినీరింగ్ విద్యార్థులు గదిలో చొరబడి రూ.60 వేల విలువైన రెండు ల్యాప్‌ట్యాప్‌లు అపహరించాడు. రెండోసారి పోలీసులకు పట్టుబడ్డాడు. ఇద్దరు దొంగలను పట్టుకున్న సీసీఎస్ డీఎస్పీ వెంకటేశ్వరరావుతో పాటు సీఐ ఎ.ఎన్.ఆర్.కె.రెడ్డి, తాలూకా సీఐ ఎస్.ఆంటోనిరాజ్, సీసీఎస్ ఎస్సైలు ఎస్.కె.నాయబ్స్రూల్, పి.రామిరెడ్డి, హెడ్ కానిస్టేబుళ్లు బాల, కోటి, సిబ్బంది అంజిబాబు, సాయి, ప్రసాదు, శాంత, ఖాదర్, సందాని, శేషులను ఏఎస్పీ రామానాయక్, ఎస్పీ శ్రీకాంత్‌లు అభినందించారు. -
ఎస్...సూపర్ పి...పోలీస్
ఎస్పీ ఏడాది పాలనలో మెరుపులు.. మరకలు మచ్చలేని ఎస్పీగా పేరు మార్కాపురం ఓఎస్డీకి దోపిడీతో సంబంధం ఉండటంతో మచ్చ రికవరీల్లో భేష్.. దొంగతనాల అదుపేదీ? పోలీస్ సంక్షేమంపై ప్రత్యేక దృష్టి జిల్లా ఎస్పీగా చిరువోలు శ్రీకాంత్ బాధ్యతలు స్వీకరించి గురువారంనాటికి ఏడాది పూర్తవుతోంది. సమర్థ అధికారిగా మంచి పేరు తెచ్చుకున్న ఈయన విధుల్లో కొన్ని మెరుపులు, మరికొన్ని మరకలూ లేకపోలేదు. జిల్లాలో పలువురు ఎస్సైలను, సీఐలను సస్పెన్షన్లు చేసి చార్జిమెమోలు ఇస్తూ పాలనలో తన పట్టు తగ్గలేదన్నది నిరూపించుకున్నా ఓఎస్డీతోపాటుమరో ముగ్గురు పోలీసులు కోటి రూపాయల దోపిడీ వ్యవహారంలో దొరికిపోవడం శాఖపై మాయని మచ్చ పడింది. ఎస్పీ శ్రీకాంత్ పోలీస్ సంక్షేమంలో తనదైన ముద్ర వేసుకున్నారు. ఏడాది పాలనలో ఎస్పీకి కొన్ని మెరుపులతో పాటు మరకలు అంటుకున్నాయి. సూపర్ కాప్‌గా జిల్లాలో ప్రస్థానం ప్రారంభించిన ఎస్పీ శ్రీకాంత్ రాజకీయ, వ్యవస్థాగత కారణాలతో నెమ్మదించారన్న విమర్శలు ఎదుర్కొన్నారు. దొంగతనాల రికవరీల్లో మెరిసినా.. జిల్లాలో కొనసాగుతున్న వరుస దొంగతనాలతో తలపట్టుకున్నారు. మొత్తానికి పోలీస్ బాస్‌గా జిల్లాలో మచ్చలేని మనిషిగా అందరి మనసు గెలిచారు. ఒంగోలు : జిల్లాకు ఎస్పీగా చిరువోలు శ్రీకాంత్ వచ్చి నేటితో ఏడాది పూర్తయింది. ఏడాది ఎస్పీ పాలనలో జిల్లాలో కొన్ని మెరుపులు, మరికొన్ని మరకలు పోలీసులు మూటగట్టుకున్నారు. సమర్థత గల అధికారిగా పేరు తెచ్చుకున్న ఎస్పీ శ్రీకాంత్ కొన్ని పరిణామాలు, మరికొన్ని పరిస్థితులు ఆయనలో కొంత మార్పులు తీసుకొచ్చాయి. వచ్చిన తొలినాళ్లలో కింది స్థాయి సిబ్బంది నుంచి పైస్థాయి అధికారుల వరకు పోలీస్ విభాగంలో ఆయన ముద్ర బాగానే పడింది. పాలనలో దిట్టగా.. స్టేషన్ల వారీగా ఆకస్మిక తనిఖీలు చేసి సిబ్బందిలో కర్తవ్యదీక్షను రేకెత్తించారు. అయితే రానురాను కొందరు పోలీస్ అధికారుల పిరికితనం.. అధికార పార్టీ అండదండలు ఉన్న సిబ్బంది వెరసి తన టీమ్‌లో పటుత్వాన్ని కోల్పోయారన్న విమర్శలు గుప్పుమన్నాయి. దీనికి నాందిగా రేణంగివరం ఎస్సై విష్ణుగోపాల్ తన పిస్టోల్ మిస్‌ఫైర్ అయి మృతి చెందాడని పోలీస్ పరిభాషలో చెబుతున్నా.. ఆయన ఎస్పీ దెబ్బకు భయపడి తుపాకీతో కాల్చుకున్నాడన్న ప్రచారం జోరుగానే సాగింది. ఎస్పీగా శ్రీకాంత్ బాధ్యతలు తీసుకున్న తర్వాత వరుస ఆకస్మిక పోలీస్స్టేషన్ల తనిఖీలు, నెలలో 1, 2 దఫాలుగా సమీక్షలు నిర్వహించి తనదైన ముద్ర వేసుకున్నారు. అయితే రేణంగివరం ఎస్సై ఉదంతం నుంచి ఎస్పీ దూకుడులో కొంత ఊపు తగ్గిందన్న ప్రచారం జోరందుకుంది. జిల్లాలో అవినీతి మరకలు అంటుకున్న ఆరుగురు ఎస్సైలను సస్పెండ్ చేశారు. మరికొంత మంది ఎస్సైలు, సీఐలకు చార్జిమెమోలు కూడా ఇచ్చారు. ఈ ఏడాది జనవరి 12వ తేదీ వైఎస్సార్సీపీకి చెందిన అద్దంకి ఎమ్మెల్యే గొట్టిపాటి రవికుమార్‌పై టీడీపీ నాయకుడు కరణం బలరామకృష్ణమూర్తి, ఆయన తనయుడు వెంకటేష్ తమ అనుయాయులతో సాక్షాత్తు ప్రకాశం భవన్‌లోని సమీక్ష హాలు వద్దే దాడి చేశారు. అప్పట్లో పోలీసులు తూతూమంత్రంగా పలువురిని అదుపులోకి తీసుకొని, అసలు దాడికి కారకులైన టీడీపీ అధినాయకులను ఇంత వరకు పట్టించుకోలేదు. ఒంగోలు నగరంలో జోరుగా దొంగతనాలు కొనసాగుతూనే ఉన్నాయి. ఒంగోలులో ఏప్రిల్ 1వ తేదీ మొదలుకొని ఇప్పటి వరకు దాదాపు 10కిపైగా దొంగతనాలు జరిగాయి. ప్రజలు లక్షల విలువైన ఆభరణాలు, నగదు నష్టపోయారు. జిల్లాలోని పలు ప్రాంతాల్లో కూడా దొంగతనాలు జరుగుతూనే ఉన్నాయి. రికవరీలు బాగానే ఉన్నా దొంగతనాల అదుపులో సిబ్బందిని అప్రమత్తం చేయలేకపోతున్నారన్న విమర్శలు ఉన్నాయి. కొరిశపాడుకు చెందిన కొప్పర్తి సూర్యం మావోయిస్టు ఉద్యమంలోకి వెళ్లి ఆంధ్రా-ఒరిస్సా సరిహద్దులో ఎన్కౌంటర్లో మృతి చెందారు. అప్పటి వరకు జిల్లాలో మావోయిస్టుల్లేరని నిఘా విభాగాలన్నీ కోడై కూశాయి. చివరకు సూర్యం మృతితో ఒక్కసారిగా ఉలిక్కిపడ్డారు. న పోలీసుల సంక్షేమంలో కూడా ఎస్పీ ప్రధాన పాత్ర పోషించారు. ముందెన్నడూ ఏ ఎస్పీ చేపట్టని సంక్షేమ కార్యక్రమాలను పోలీసులు, పోలీస్ కుటుంబాలకు కల్పించి అందరికీ దగ్గరయ్యారు. పోలీస్ కుటుంబాలు, పోలీస్ పిల్లలకు సమ్మర్ క్యాంప్‌లు నిర్వహించి ఆయా కుటుంబ సభ్యులతో ఎస్పీ కుటుంబ సభ్యులు కలిసిపోయారు. శాఖాపరంగా మరక.. ఈ ఏడాది మే 14వ తేదీ నవజీవన్ ఎక్స్‌ప్రెస్ రైలులో దోపిడీ ఉదంతం జిల్లాలో పోలీస్ ప్రతిష్ఠను దెబ్బతీసింది. మార్కాపురం ఓఎస్డీ సి. సమైజాన్‌రావు వద్ద పని చేస్తున్న ముగ్గురు క్యాట్ పార్టీ పోలీసులు కావలికి చెందిన బంగారు వ్యాపారులను బెదిరించి రూ.89 లక్షలు దోపిడీకి పాల్పడ్డారు. నెల్లూరు పోలీసులు వారిని వెంబడించి పట్టుకోవడంతో వారు స్పెషల్ పార్టీ పోలీసులని తేలింది. ఈ బృందానికి ఓఎస్డీ సి.సమైజాన్‌రావు నేతృత్వం వహిస్తున్నాడని వెల్లడైంది. దీంతో జూన్ 15న ఆయన్ను కూడా పోలీసులు అరెస్ట్ చేశారు. మావోయిస్టు డంప్‌లో దొరికిన ఒక తపంచా ఈ స్పెషల్ పార్టీ పోలీసుల వద్ద లభ్యం కావడంతో వీరి అరాచకాలు ఎంతకాలం నుంచి ఎన్ని రకాలుగా సాగాయో.. పోలీసుల దర్యాప్తులో తేటతెల్లమైంది. సాంకేతికంగా మెరుపు పోలీసులను సాంకేతికపరంగా అభివృద్ధి పరచటంతో పాటు జిల్లాలో ఐ-క్లిక్ కేంద్రాల ఏర్పాటుకు ఎస్పీ కృషి చేశారు. ప్రజలకు పోలీస్స్టేషన్లతో పని లేకుండా నేరుగా ఐ-క్లిక్ కేంద్రాల నుంచే ఫిర్యాదు చేసుకునే విధంగా అవకాశం కల్పించిన ఘనత ఎస్పీ శ్రీకాంత్‌కే దక్కింది. -
పుష్కరాలకు వెళ్తే.. ఇల్లు గుల్ల చేశారు
ఒంగోలు క్రైం : దొంగలు నగరం నడిబొడ్డులో భారీ చోరీకి తెగబడ్డారు. ఒన్‌టౌన్ పోలీసుస్టేషన్‌కు కూతవేటు దూరంలో బుధవారం అర్ధరాత్రి ఓ ఇంట్లో భారీ చోరీ జరిగింది. స్థానిక ఏనుగు చెట్టుకు తాతా కన్నయ్య బిల్డింగ్‌కు మధ్యలో ఉన్న చేజర్ల లక్ష్మణాచారి వీధిలో పారిశ్రామికవేత్త పల్లపోతు ప్రభాకర గుప్తా ఇంట్లో దొంగలు తమ చేతివాటం చూపారు. 1100 గ్రాముల బంగారు ఆభరణాలు, రూ.2 లక్షల నగదు చోరీ చేసినట్లు ప్రాథమికంగా తేలింది. వీటితో పాటు 2.3 కేజీల వెండి వస్తువులు కూడా మాయమయ్యాయి. ప్రభాకరగుప్తా విజయ టైల్స్ అధినేత. ఈ వ్యాపారంతో పాటు పలు ఇతర వ్యాపారాలు చేస్తుంటారు. గోదావరి పుష్కరాలకని బుధవారం తెల్లవారు జామున కుటుంబ సమేతంగా వెళ్లారు. పుష్కరాలకు వెళ్తూ తమ షాపులో పని చేసే గుమాస్తాను ఇంట్లో ఉంచారు. తెల్లవారు జామున ఇంటి యజమానులు వెళ్లిపోవటంతో ఉదయం 8 గంటల వరకు గుమాస్తా ఉండి ప్రధాన ద్వారం లోపల తాళం వేసి, ఇంటి వరసందు వైపు తలుపునకు కూడా బయట తాళం వేసి షాపునకు వెళ్లిపోయాడు. తాళాన్ని పక్కింటి వారికి ఇచ్చాడు. యజమానులు సాయంత్రమే వస్తారని తెలిసి గుమస్తా రాత్రికి నేరుగా తన ఇంటికి వెళ్లిపోయాడు. తీరా ప్రభాకర గుప్తా కుటుంబం బుధవారం అర్ధరాత్రి 1.30- 2 గంటల మధ్యలో ఇంటికి చేరుకుంది. ప్రధాన ద్వారం తెరిచేందుకు ప్రయత్నించారు. లోపల గడియ పెట్టి ఉండటంతో తలుపులు తెరుచుకోలేదు. వరసందు వైపు వె ళ్లి తలుపులు తీసేందుకు చూశారు. తీరా చూస్తే తలుపు గడియ విరగ్గొట్టి తలుపు తీసి ఉంది. అప్పుడే ఇంట్లోకి దొంగలు చొరబడి ఉన్నారని భావించి చుట్టు పక్కలవారిని కేకలు వేశారు. అందరూ వచ్చిన తర్వాత లోనికి వెళ్లి చూస్తే ఎవరూ లేరు. దొంగలు ఇంట్లో సొత్తు దోచుకుపోయారని గుర్తించారు. వెంటనే ఒన్‌టౌన్ ఇన్చార్జి సిఐ పి.దేవప్రభాకర్‌కు ఫిర్యాదు చేశారు. ఒంగోలు డీఎస్సీ, జి. శ్రీనివాసరావు, సీసీఎస్ డీఎస్పీ కె.వెంకటేశ్వరరావు, ఒన్‌టౌన్, తాలూకా సీఐలు దేవప్రభాకర్, ఎస్.ఆంటోనిరాజులు సంఘటన స్థలానికి చేరుకున్నారు. నగరంతో పాటు పరిసర ప్రాంత మండలాల పోలీసులను అప్రమత్తం చేశారు. అసలు చోరీజరిగింది పగలా.. రాత్రా అన్నది సందిగ్ధంగా మారింది. రెండు బ్యాగులు అక్కడే వదిలి.. చోరీకి పాల్పడ్డ దొంగలు భారీ మొత్తంలో ఇంట్లో నుంచి దోచుకుపోయారు. మరి ఇది ఒకరి పనా.. లేక ఇద్దరా, ముఠానా అన్నది పోలీసుల దరాప్తులో తేలాల్సి ఉంది. భారీ మొత్తం బంగారు ఆభరణాలు, నగదుతో పాటు మరో రెండు బ్యాగులను కూడా పట్టుకెళ్లారు. లక్ష్మణాచారి వీధిలో నుంచి ఉత్తరంగా బయల్దేరి ఇంటికి సమీపంలో వెనుక పైపు ఉన్న పాడుపడ్డ ఇళ్ల ప్రాంగణంలో రెండు బ్యాగులను దాచి పెట్టారు. తీరా ఆ బ్యాగులను డాగ్ స్క్వాడ్ గురువారం మధ్యాహ్నం గుర్తించింది. దొంగతనం జరిగిన ఇంటి నుంచి బయల్దేరిన డాగ్ స్క్వాడ్ రెండిళ్లు దాటిన తర్వాత ఉన్న సందులోకి వెళ్లింది. ఆ సందులోని చివర పాడుపడ్డ ఇళ్లలోని చెట్ల పొదల్లోకి వెళ్లి మురకలు పట్టింది. దీంతో స్క్వాడ్ బృందం సభ్యులు ఆ పరిసర ప్రాంతాలను నిశితంగా గమనించారు. చెట్ల పొదల్లో రెండు బ్యాగులు లభించాయి. తీరా వాటిని తీసి చూస్తే వాటి నిండా వెండి ప్లేట్లు, రూ.10, రూ.5 విలువగల బంగారు రంగుతో ఉన్న నాణేలు, రూ.10 నోట్ల కట్టలు, పూజకు వాడే 108 చిన్న బంగారు పుష్పాలు, రకరకాల నేణేలు, ఇతర వెండి వస్తువులు ఉన్నాయి. సంఘటన స్థలాన్ని పరిశీలించిన ఎస్పీ ఎస్పీ చిరువోలు శ్రీకాంత్ చోరీ జరిగిన ఇంటిని గురువారం పరిశీలించారు. బాధితులతో మాట్లాడారు. ఏ మేరకు నష్టం జరిగిందో అడిగి తెలుసుకున్నారు. ఇంటి పరిసరాలను గమనించారు. పరిస్థితులను ఒంగోలు డీఎస్పీ జి.శ్రీనివాసరావును అడిగి తెలుసుకున్నారు. దర్యాప్తు వేగవంతం చేయాలని అధికారులను ఆదేశించారు. అనంతరం అక్కడి నుంచి బయల్దేరి ఒన్‌టౌన్ పోలీసుస్టేషన్‌కు చేరుకున్నారు. చోరీ జరిగిన తీరుపై అధికారులతో లోతుగా చర్చించినట్లు సమాచారం. -
'ఎమ్మెల్సీ ఎన్నికలకు సర్వం సిద్ధం'
ప్రకాశం: ఎమ్మెల్సీ ఎన్నికలకు సర్వం సిద్ధం చేశామని ప్రకాశం జిల్లా కలెక్టర్ సుజాత శర్మ అన్నారు. శనివారం ఆమె ఇక్కడ మీడియాతో మాట్లాడారు. జూలై 3న జరిగే స్థానిక సంస్థల ఎన్నికలకు ప్రకాశం జిల్లాలో అన్ని ఏర్పాట్లు పూర్తి చేశామని ఆమె ఈ సందర్భంగా తెలిపారు. ఈనెల 30న ఓటర్లకు పోలింగ్‌పై అవగాహన కార్యక్రమాన్ని నిర్వహిస్తామన్నారు. వికలాంగులు, నిరక్షరాస్యులు తమ వెంట సహాయకులను తెచ్చుకునే వెసులుబాటు కల్పించామని.. అందుకోసం ముందుగా ఎన్నికల అధికారికి దరఖాస్తు చేసుకోవాలని ఆమె చెప్పారు. జిల్లాలో ఇప్పటికే కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేశామని జిల్లా ఎస్పీ శ్రీకాంత్ అన్నారు. శాంతిభద్రతలకు విఘాతం కలిగిస్తే ఎవరినీ వదిలి పెట్టబోమని ఆయన ఈ సందర్భంగా తెలియజేశారు. క్యాంపు రాజకీయాలు చేయటం ఎన్నికల చట్టప్రకారం నేరమని.. క్యాంపు రాజకీయాలకు దూరంగా ఉండాలని ఎస్పీ శ్రీకాంత్ రాజకీయ పార్టీలను హెచ్చరించారు. -
ఫేస్ బుక్కయ్యాడు
* ఫేస్బుక్ ద్వారా మోసం చేసిన యువకుడు అరెస్టు * మోసపోయిన వారిలో నలుగురు ఎమ్మెల్యేలు, ఇద్దరుమాజీ ఎమ్మెల్యేలు, వ్యాపారవేత్తలు * ఫ్యాన్సీ సెల్‌ఫోన్ నంబర్లు ఇప్పిస్తానని రూ.20 లక్షలకు టోకరా * రూ.12.22 లక్షలు రికవరీ * వివరాలు వెల్లడించిన ఎస్పీ శ్రీకాంత్ ఒంగోలు క్రైం : ఫేస్బుక్ ద్వారా ప్రముఖులతో పరిచయాల ఏర్పరచుకుని ఫ్యాన్సీ సెల్‌నంబర్లు ఇప్పిస్తానని మోసం చేసిన ఓ యువకుడు అడ్డంగా పోలీసులకు దొరికిపోయాడు. శాసనసభ్యులు, మాజీ శాసనసభ్యులు, వ్యాపారవేత్తలను మోసం చేసి లక్షల రూపాయలకు టోకరా పెట్టి చివరకు బుక్కయ్యాడు. ఈ హైటెక్ మోసగాడ్ని చీరాల పోలీసులు శనివారం అరెస్టు చేశారు. అతని మోసాలకు సంబంధించిన వివరాలను స్థానిక తన కార్యాలయంలో జిల్లా అదనపు ఎస్పీ బి.రామానాయక్, చీరాల డీఎస్పీ జయరాంరాజు, చీరాల టూటౌన్ సీఐ ఎండీ అబ్దుల్ సుభాన్‌లతో కలిసి ఏర్పాటు చేసిన విలేకర్ల సమావేశంలో ఎస్పీ చిరువోలు శ్రీకాంత్ శనివారం సాయంత్రం వెల్లడించారు. ఆ వివరాలు ఆయన మాటల్లోనే...తూర్పుగోదావరి జిల్లా కడియం మండలం వేమగిరి గ్రామానికి చెందిన మద్దెల దీపుబాబు అలియాస్ దీపక్ ఫ్యాన్సీసెల్ఫోన్ నంబర్ల పేరుతో దాదాపు రూ.20 లక్షల వరకు మోసం చేశాడు. మోసపోయిన వారిలో జిల్లాకు చెందిన ఎమ్మెల్యేలు ఆమంచి కృష్ణమోహన్ (చీరాల), దామచర్ల జనార్దన్ (ఒంగోలు) ఉన్నారు. వీరితోపాటు పెనమలూరు ఎమ్మెల్యే బోడే ప్రసాద్, గోపాలపురం ఎమ్మెల్యేలు, నెల్లూరు మాజీ ఎమ్మెల్యే ఆనం వివేకానందరెడ్డి పర్సనల్ అసిస్టెంట్, ఏలూరి మాజీ ఎమ్మెల్యే కూడా బాధితుల జాబితాలో ఉన్నారు. ఢిల్లీ, విశాఖపట్నంకు చెందిన పైడి గ్రూప్ ఆఫ్ కంపెనీ, ప్రగతి గ్రూప్ ఆఫ్ కంపెనీలకు చెందిన యజమానులను కూడా మోసం చేసి లక్షల రూపాయలకు టోకరా వేశాడు. చీరాలలోని గుంటూరు బస్టాండ్ సెంటర్లో నిందితుడిని చీరాల డీఎస్పీ, సీఐలు తమ సిబ్బందితో వలపన్ని పట్టుకున్నారు. నిందితుడి నేపథ్యమిదీ... నిందితుడు దీపుబాబు తండ్రి లక్ష్మణరావు తూర్పుగోదావరి జిల్లాలో ఓ కోర్టులో విధులు నిర్వర్తిస్తున్నాడు. తల్లి ప్రభుత్వ వైద్యశాలలో ఉద్యోగం చేస్తోంది. నిందితుడు కోరుకొండలో బీటెక్ సివిల్ ఇంజినీరింగ్ మొదటి సంవత్సరం చదువుతూ మధ్యలోనే ఆపేశాడు. చిన్న వయసులోనే స్కేటింగ్ చేస్తూ ప్రమాదవశాత్తు కుడికాలు కోల్పోయాడు. కొయ్య కాలుతో ఇతను మనుగడ సాగిస్తున్నాడు. మోసాలు చేసైనా సరే లక్షలు సంపాదించి జల్సాలు చేయాలని నిర్ణయించుకున్నాడు. అందులో భాగంగా ప్రముఖ రాజకీయ నాయకులు, సినిమా హీరోలు, స్పోర్ట్స్ స్టార్లతో ఫొటోలు తీయించుకుని వారందరితో పరిచయాలున్నట్టు ఇతరులను నమ్మించేవాడు. తనకున్న కంప్యూటర్ పరిజ్ఞానంతో ఎమ్మెల్యేలు, మాజీ ఎమ్మెల్యే, వ్యాపారవేత్తలను ఆకర్షించేందుకు ఫేస్బుక్ ద్వారా మేసేజ్‌లు పంపించి ఫ్యాన్సీ సెల్‌ఫోన్ నంబర్లు ఇప్పిస్తానంటూ నమ్మించేందుకు ప్రయత్నించేవాడు. తన స్నేహితుడు చల్లగుంట సురేష్ పేరు మీద బ్యాంక్ అకౌంట్ తీయించి ఆ అకౌంట్లో డబ్బులు వేయించుకునేవాడు. వచ్చిన డబ్బుతో జల్సాలు చేసేవాడు. రాష్ట్రం మొత్తం మీద ఇతనిపై ఎక్కడా కేసులు నమోదు కాలేదని, మొట్టమొదటగా జిల్లాలో రెండు కేసులు నమోదు చేశామని ఎస్పీ చిరువోలు శ్రీకాంత్ వివరించారు. నిందితుడ్ని అత్యంత చాకచక్యంగా పట్టుకున్న చీరాల డీఎస్పీ జయరామరాజు, చీరాల రెండో పట్టణ సీఐ ఎండీ అబ్దుల్ సుబాన్, ఎస్సై ఎం.రామానాయక్, ఏఎస్సై వై.శ్రీనివాసరావు, హెచ్‌సీ డి.సత్యరాజు, కానిస్టేబుల్ డి.రవి, అచ్చయ్య, అలెక్స్, హెచ్‌జీ వి.రమణలను ఎస్పీ ప్రత్యేకంగా అభినందించారు. చేసిన నేరాలు... * చీరాల ఎమ్మెల్యే ఆమంచి కృష్ణమోహన్‌కు ఫ్యాన్సీ సెల్‌ఫోన్ నంబర్లు ఇప్పిస్తానంటూ ఎమ్మెల్యే బ్యాంకు అకౌంట్నుంచి రూ.9,26,900 వేయించుకున్నాడు. * ఒంగోలు ఎమ్మెల్యే దామచర్ల జనార్దన్‌ను కూడా ఇదేవిధంగా మోసం చేసి అతని అకౌంట్ నుంచి రూ.4 లక్షలు వేయించుకున్నాడు. * పెనమలూరు ఎమ్మెల్యే బోడె ప్రసాద్ బ్యాంకు అకౌంట్ నుంచి రూ.64 వేలు, గోపాలపురం ఎమ్మెల్యే బ్యాంకు అకౌంట్ నుంచి రూ.48 వేలు, నెల్లూరు మాజీ ఎమ్మెల్యే ఆనం వివేకానందరెడ్డి పర్సనల్ అసిస్టెంట్ బ్యాంక్ అకౌంట్ నుంచి రూ.15 వేలు, ఏలూరు మాజీ ఎమ్మెల్యే బ్యాంక్ అకౌంట్ నుంచి రూ.24 వేలు, పైడి గ్రూప్ ఆఫ్ కంపెనీస్ యజమానుల బ్యాంకు అకౌంట్ నుంచి రూ.2,22,000, ప్రగతి గ్రూప్ ఆఫ్ కంపెనీస్ యజమానుల నుంచి రూ.48 వేలు ట్రాన్స్ఫర్ చేయించుకున్నాడు. సొత్తు స్వాధీనం... * నిందితుడి నుంచి డీఎస్కే హైసగ్ స్పోర్ట్స్ బైక్‌ను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. దీని విలువ సుమారు రూ.4.50 లక్షలు. అతని స్నేహితుని బ్యాంక్ అకౌంట్‌ను నిలిపివేయడం ద్వారా బ్యాంకులో ఉన్న రూ.5.37 లక్షలను స్వాధీనం చేసుకున్నారు. అతని వద్ద ఉన్న రూ.లక్షన్నర విలువైన బంగారు చైన్, మూడు ఉంగరాలు, రూ.35 వేలు విలువైన యాసర్ ల్యాప్‌టాప్, రూ.83 వేల విలువైన మూడు సెల్ఫోన్లు స్వాధీనం చేసుకున్నారు. -
పోలీస్ ఫేస్బుక్ ద్వారా కూడా స్పందిస్తాం..
ఒంగోలు : గత ఏడాదితో పోలిస్తే ఈ ఏడాది ప్రకాశం జిల్లాలో క్రైమ్ రేటు తగ్గిందని జిల్లా ఎస్పీ శ్రీకాంత్ తెలిపారు. ఆయన మంగళవారం జిల్లాలో క్రైమ్ రేటు వివరాలను మీడియాకు వెల్లడించారు. ప్రత్యక్షంగా సమాచారం ఇవ్వలేని వారి కోసం పోలీస్ ఫేస్బుక్ ఏర్పాటు చేసినట్లు ఎస్పీ తెలిపారు. పోలీస్ ఫేస్బుక్ ద్వారా సమాచారం ఇచ్చినా పోలీసు స్పందిస్తారని ఆయన చెప్పారు. ఒంగోలులో ట్రాఫిక్ నియంత్రణకు ఒక్క ట్రాఫిక్ సిగ్నల్ కూడా లేకపోవటం బాధాకరమన్నారు. ప్రకాశం జిల్లా నేర నియంత్రణ కోసం ప్రజల సహకరించాలని ఎస్పీ శ్రీకాంత్ పిలుపునిచ్చారు.