ఎస్...సూపర్ పి...పోలీస్
- ఎస్పీ ఏడాది పాలనలో మెరుపులు.. మరకలు
- మచ్చలేని ఎస్పీగా పేరు
- మార్కాపురం ఓఎస్‌డీకి దోపిడీతో సంబంధం ఉండటంతో మచ్చ
- రికవరీల్లో భేష్.. దొంగతనాల అదుపేదీ?
- పోలీస్ సంక్షేమంపై ప్రత్యేక దృష్టి
జిల్లా ఎస్పీగా చిరువోలు శ్రీకాంత్ బాధ్యతలు స్వీకరించి గురువారంనాటికి ఏడాది పూర్తవుతోంది. సమర్థ అధికారిగా మంచి పేరు తెచ్చుకున్న ఈయన విధుల్లో కొన్ని మెరుపులు, మరికొన్ని మరకలూ లేకపోలేదు. జిల్లాలో పలువురు ఎస్సైలను, సీఐలను సస్పెన్షన్లు చేసి చార్జిమెమోలు ఇస్తూ పాలనలో తన పట్టు తగ్గలేదన్నది నిరూపించుకున్నా ఓఎస్‌డీతోపాటుమరో ముగ్గురు పోలీసులు కోటి రూపాయల దోపిడీ వ్యవహారంలో దొరికిపోవడం శాఖపై మాయని మచ్చ పడింది.
ఎస్పీ శ్రీకాంత్ పోలీస్ సంక్షేమంలో తనదైన ముద్ర వేసుకున్నారు. ఏడాది పాలనలో ఎస్పీకి కొన్ని మెరుపులతో పాటు మరకలు అంటుకున్నాయి. సూపర్ కాప్‌గా జిల్లాలో ప్రస్థానం ప్రారంభించిన ఎస్పీ శ్రీకాంత్ రాజకీయ, వ్యవస్థాగత కారణాలతో నెమ్మదించారన్న విమర్శలు ఎదుర్కొన్నారు. దొంగతనాల రికవరీల్లో మెరిసినా.. జిల్లాలో కొనసాగుతున్న వరుస దొంగతనాలతో తలపట్టుకున్నారు. మొత్తానికి పోలీస్ బాస్‌గా జిల్లాలో మచ్చలేని మనిషిగా అందరి మనసు గెలిచారు.
ఒంగోలు :
జిల్లాకు ఎస్పీగా చిరువోలు శ్రీకాంత్ వచ్చి నేటితో ఏడాది పూర్తయింది. ఏడాది ఎస్పీ పాలనలో జిల్లాలో కొన్ని మెరుపులు, మరికొన్ని మరకలు పోలీసులు మూటగట్టుకున్నారు. సమర్థత గల అధికారిగా పేరు తెచ్చుకున్న ఎస్పీ శ్రీకాంత్ కొన్ని పరిణామాలు, మరికొన్ని పరిస్థితులు ఆయనలో కొంత మార్పులు తీసుకొచ్చాయి. వచ్చిన తొలినాళ్లలో కింది స్థాయి సిబ్బంది నుంచి పైస్థాయి అధికారుల వరకు పోలీస్ విభాగంలో ఆయన ముద్ర బాగానే పడింది. పాలనలో దిట్టగా.. స్టేషన్ల వారీగా ఆకస్మిక తనిఖీలు చేసి సిబ్బందిలో కర్తవ్యదీక్షను రేకెత్తించారు. అయితే రానురాను కొందరు పోలీస్ అధికారుల పిరికితనం.. అధికార పార్టీ అండదండలు ఉన్న సిబ్బంది వెరసి తన టీమ్‌లో పటుత్వాన్ని కోల్పోయారన్న విమర్శలు గుప్పుమన్నాయి. దీనికి నాందిగా రేణంగివరం ఎస్సై విష్ణుగోపాల్ తన పిస్టోల్ మిస్‌ఫైర్ అయి మృతి చెందాడని పోలీస్ పరిభాషలో చెబుతున్నా.. ఆయన ఎస్పీ దెబ్బకు భయపడి తుపాకీతో కాల్చుకున్నాడన్న ప్రచారం జోరుగానే సాగింది. ఎస్పీగా శ్రీకాంత్ బాధ్యతలు తీసుకున్న తర్వాత వరుస ఆకస్మిక పోలీస్‌స్టేషన్ల తనిఖీలు, నెలలో 1, 2 దఫాలుగా సమీక్షలు నిర్వహించి తనదైన ముద్ర వేసుకున్నారు. అయితే రేణంగివరం ఎస్సై ఉదంతం నుంచి ఎస్పీ దూకుడులో కొంత ఊపు తగ్గిందన్న ప్రచారం జోరందుకుంది. జిల్లాలో అవినీతి మరకలు అంటుకున్న ఆరుగురు ఎస్సైలను సస్పెండ్ చేశారు. మరికొంత మంది ఎస్సైలు, సీఐలకు చార్జిమెమోలు కూడా ఇచ్చారు.
ఈ ఏడాది జనవరి 12వ తేదీ వైఎస్సార్‌సీపీకి చెందిన అద్దంకి ఎమ్మెల్యే గొట్టిపాటి రవికుమార్‌పై టీడీపీ నాయకుడు కరణం బలరామకృష్ణమూర్తి, ఆయన తనయుడు వెంకటేష్ తమ అనుయాయులతో సాక్షాత్తు ప్రకాశం భవన్‌లోని సమీక్ష హాలు వద్దే దాడి చేశారు. అప్పట్లో పోలీసులు తూతూమంత్రంగా పలువురిని అదుపులోకి తీసుకొని, అసలు దాడికి కారకులైన టీడీపీ అధినాయకులను ఇంత వరకు పట్టించుకోలేదు.
ఒంగోలు నగరంలో జోరుగా దొంగతనాలు కొనసాగుతూనే ఉన్నాయి. ఒంగోలులో ఏప్రిల్ 1వ తేదీ మొదలుకొని ఇప్పటి వరకు దాదాపు 10కిపైగా దొంగతనాలు జరిగాయి. ప్రజలు లక్షల విలువైన ఆభరణాలు, నగదు నష్టపోయారు. జిల్లాలోని పలు ప్రాంతాల్లో కూడా దొంగతనాలు జరుగుతూనే ఉన్నాయి. రికవరీలు బాగానే ఉన్నా దొంగతనాల అదుపులో సిబ్బందిని అప్రమత్తం చేయలేకపోతున్నారన్న విమర్శలు ఉన్నాయి.
కొరిశపాడుకు చెందిన కొప్పర్తి సూర్యం మావోయిస్టు ఉద్యమంలోకి వెళ్లి ఆంధ్రా-ఒరిస్సా సరిహద్దులో ఎన్‌కౌంటర్‌లో మృతి చెందారు. అప్పటి వరకు జిల్లాలో మావోయిస్టుల్లేరని నిఘా విభాగాలన్నీ కోడై కూశాయి. చివరకు సూర్యం మృతితో ఒక్కసారిగా ఉలిక్కిపడ్డారు.
న పోలీసుల సంక్షేమంలో కూడా ఎస్పీ ప్రధాన పాత్ర పోషించారు. ముందెన్నడూ ఏ ఎస్పీ చేపట్టని సంక్షేమ కార్యక్రమాలను పోలీసులు, పోలీస్ కుటుంబాలకు కల్పించి అందరికీ దగ్గరయ్యారు. పోలీస్ కుటుంబాలు, పోలీస్ పిల్లలకు సమ్మర్ క్యాంప్‌లు నిర్వహించి ఆయా కుటుంబ సభ్యులతో ఎస్పీ కుటుంబ సభ్యులు కలిసిపోయారు.
శాఖాపరంగా మరక..
ఈ ఏడాది మే 14వ తేదీ నవజీవన్ ఎక్స్‌ప్రెస్ రైలులో దోపిడీ ఉదంతం జిల్లాలో పోలీస్ ప్రతిష్ఠను దెబ్బతీసింది. మార్కాపురం ఓఎస్‌డీ సి. సమైజాన్‌రావు వద్ద పని చేస్తున్న ముగ్గురు క్యాట్ పార్టీ పోలీసులు కావలికి చెందిన బంగారు వ్యాపారులను బెదిరించి రూ.89 లక్షలు దోపిడీకి పాల్పడ్డారు. నెల్లూరు పోలీసులు వారిని వెంబడించి పట్టుకోవడంతో వారు స్పెషల్ పార్టీ పోలీసులని తేలింది. ఈ బృందానికి ఓఎస్‌డీ సి.సమైజాన్‌రావు నేతృత్వం వహిస్తున్నాడని వెల్లడైంది. దీంతో జూన్ 15న ఆయన్ను కూడా పోలీసులు అరెస్ట్ చేశారు. మావోయిస్టు డంప్‌లో దొరికిన ఒక తపంచా ఈ స్పెషల్ పార్టీ పోలీసుల వద్ద లభ్యం కావడంతో వీరి అరాచకాలు ఎంతకాలం నుంచి ఎన్ని రకాలుగా సాగాయో.. పోలీసుల దర్యాప్తులో తేటతెల్లమైంది.
సాంకేతికంగా మెరుపు
పోలీసులను సాంకేతికపరంగా అభివృద్ధి పరచటంతో పాటు జిల్లాలో ఐ-క్లిక్ కేంద్రాల ఏర్పాటుకు ఎస్పీ కృషి చేశారు. ప్రజలకు పోలీస్‌స్టేషన్లతో పని లేకుండా నేరుగా ఐ-క్లిక్ కేంద్రాల నుంచే ఫిర్యాదు చేసుకునే విధంగా అవకాశం కల్పించిన ఘనత ఎస్పీ శ్రీకాంత్‌కే దక్కింది.