Chiruvolu Srikanth
-
ఎస్...సూపర్ పి...పోలీస్
ఎస్పీ ఏడాది పాలనలో మెరుపులు.. మరకలు మచ్చలేని ఎస్పీగా పేరు మార్కాపురం ఓఎస్డీకి దోపిడీతో సంబంధం ఉండటంతో మచ్చ రికవరీల్లో భేష్.. దొంగతనాల అదుపేదీ? పోలీస్ సంక్షేమంపై ప్రత్యేక దృష్టి జిల్లా ఎస్పీగా చిరువోలు శ్రీకాంత్ బాధ్యతలు స్వీకరించి గురువారంనాటికి ఏడాది పూర్తవుతోంది. సమర్థ అధికారిగా మంచి పేరు తెచ్చుకున్న ఈయన విధుల్లో కొన్ని మెరుపులు, మరికొన్ని మరకలూ లేకపోలేదు. జిల్లాలో పలువురు ఎస్సైలను, సీఐలను సస్పెన్షన్లు చేసి చార్జిమెమోలు ఇస్తూ పాలనలో తన పట్టు తగ్గలేదన్నది నిరూపించుకున్నా ఓఎస్డీతోపాటుమరో ముగ్గురు పోలీసులు కోటి రూపాయల దోపిడీ వ్యవహారంలో దొరికిపోవడం శాఖపై మాయని మచ్చ పడింది. ఎస్పీ శ్రీకాంత్ పోలీస్ సంక్షేమంలో తనదైన ముద్ర వేసుకున్నారు. ఏడాది పాలనలో ఎస్పీకి కొన్ని మెరుపులతో పాటు మరకలు అంటుకున్నాయి. సూపర్ కాప్‌గా జిల్లాలో ప్రస్థానం ప్రారంభించిన ఎస్పీ శ్రీకాంత్ రాజకీయ, వ్యవస్థాగత కారణాలతో నెమ్మదించారన్న విమర్శలు ఎదుర్కొన్నారు. దొంగతనాల రికవరీల్లో మెరిసినా.. జిల్లాలో కొనసాగుతున్న వరుస దొంగతనాలతో తలపట్టుకున్నారు. మొత్తానికి పోలీస్ బాస్‌గా జిల్లాలో మచ్చలేని మనిషిగా అందరి మనసు గెలిచారు. ఒంగోలు : జిల్లాకు ఎస్పీగా చిరువోలు శ్రీకాంత్ వచ్చి నేటితో ఏడాది పూర్తయింది. ఏడాది ఎస్పీ పాలనలో జిల్లాలో కొన్ని మెరుపులు, మరికొన్ని మరకలు పోలీసులు మూటగట్టుకున్నారు. సమర్థత గల అధికారిగా పేరు తెచ్చుకున్న ఎస్పీ శ్రీకాంత్ కొన్ని పరిణామాలు, మరికొన్ని పరిస్థితులు ఆయనలో కొంత మార్పులు తీసుకొచ్చాయి. వచ్చిన తొలినాళ్లలో కింది స్థాయి సిబ్బంది నుంచి పైస్థాయి అధికారుల వరకు పోలీస్ విభాగంలో ఆయన ముద్ర బాగానే పడింది. పాలనలో దిట్టగా.. స్టేషన్ల వారీగా ఆకస్మిక తనిఖీలు చేసి సిబ్బందిలో కర్తవ్యదీక్షను రేకెత్తించారు. అయితే రానురాను కొందరు పోలీస్ అధికారుల పిరికితనం.. అధికార పార్టీ అండదండలు ఉన్న సిబ్బంది వెరసి తన టీమ్‌లో పటుత్వాన్ని కోల్పోయారన్న విమర్శలు గుప్పుమన్నాయి. దీనికి నాందిగా రేణంగివరం ఎస్సై విష్ణుగోపాల్ తన పిస్టోల్ మిస్‌ఫైర్ అయి మృతి చెందాడని పోలీస్ పరిభాషలో చెబుతున్నా.. ఆయన ఎస్పీ దెబ్బకు భయపడి తుపాకీతో కాల్చుకున్నాడన్న ప్రచారం జోరుగానే సాగింది. ఎస్పీగా శ్రీకాంత్ బాధ్యతలు తీసుకున్న తర్వాత వరుస ఆకస్మిక పోలీస్స్టేషన్ల తనిఖీలు, నెలలో 1, 2 దఫాలుగా సమీక్షలు నిర్వహించి తనదైన ముద్ర వేసుకున్నారు. అయితే రేణంగివరం ఎస్సై ఉదంతం నుంచి ఎస్పీ దూకుడులో కొంత ఊపు తగ్గిందన్న ప్రచారం జోరందుకుంది. జిల్లాలో అవినీతి మరకలు అంటుకున్న ఆరుగురు ఎస్సైలను సస్పెండ్ చేశారు. మరికొంత మంది ఎస్సైలు, సీఐలకు చార్జిమెమోలు కూడా ఇచ్చారు. ఈ ఏడాది జనవరి 12వ తేదీ వైఎస్సార్సీపీకి చెందిన అద్దంకి ఎమ్మెల్యే గొట్టిపాటి రవికుమార్‌పై టీడీపీ నాయకుడు కరణం బలరామకృష్ణమూర్తి, ఆయన తనయుడు వెంకటేష్ తమ అనుయాయులతో సాక్షాత్తు ప్రకాశం భవన్‌లోని సమీక్ష హాలు వద్దే దాడి చేశారు. అప్పట్లో పోలీసులు తూతూమంత్రంగా పలువురిని అదుపులోకి తీసుకొని, అసలు దాడికి కారకులైన టీడీపీ అధినాయకులను ఇంత వరకు పట్టించుకోలేదు. ఒంగోలు నగరంలో జోరుగా దొంగతనాలు కొనసాగుతూనే ఉన్నాయి. ఒంగోలులో ఏప్రిల్ 1వ తేదీ మొదలుకొని ఇప్పటి వరకు దాదాపు 10కిపైగా దొంగతనాలు జరిగాయి. ప్రజలు లక్షల విలువైన ఆభరణాలు, నగదు నష్టపోయారు. జిల్లాలోని పలు ప్రాంతాల్లో కూడా దొంగతనాలు జరుగుతూనే ఉన్నాయి. రికవరీలు బాగానే ఉన్నా దొంగతనాల అదుపులో సిబ్బందిని అప్రమత్తం చేయలేకపోతున్నారన్న విమర్శలు ఉన్నాయి. కొరిశపాడుకు చెందిన కొప్పర్తి సూర్యం మావోయిస్టు ఉద్యమంలోకి వెళ్లి ఆంధ్రా-ఒరిస్సా సరిహద్దులో ఎన్కౌంటర్లో మృతి చెందారు. అప్పటి వరకు జిల్లాలో మావోయిస్టుల్లేరని నిఘా విభాగాలన్నీ కోడై కూశాయి. చివరకు సూర్యం మృతితో ఒక్కసారిగా ఉలిక్కిపడ్డారు. న పోలీసుల సంక్షేమంలో కూడా ఎస్పీ ప్రధాన పాత్ర పోషించారు. ముందెన్నడూ ఏ ఎస్పీ చేపట్టని సంక్షేమ కార్యక్రమాలను పోలీసులు, పోలీస్ కుటుంబాలకు కల్పించి అందరికీ దగ్గరయ్యారు. పోలీస్ కుటుంబాలు, పోలీస్ పిల్లలకు సమ్మర్ క్యాంప్‌లు నిర్వహించి ఆయా కుటుంబ సభ్యులతో ఎస్పీ కుటుంబ సభ్యులు కలిసిపోయారు. శాఖాపరంగా మరక.. ఈ ఏడాది మే 14వ తేదీ నవజీవన్ ఎక్స్‌ప్రెస్ రైలులో దోపిడీ ఉదంతం జిల్లాలో పోలీస్ ప్రతిష్ఠను దెబ్బతీసింది. మార్కాపురం ఓఎస్డీ సి. సమైజాన్‌రావు వద్ద పని చేస్తున్న ముగ్గురు క్యాట్ పార్టీ పోలీసులు కావలికి చెందిన బంగారు వ్యాపారులను బెదిరించి రూ.89 లక్షలు దోపిడీకి పాల్పడ్డారు. నెల్లూరు పోలీసులు వారిని వెంబడించి పట్టుకోవడంతో వారు స్పెషల్ పార్టీ పోలీసులని తేలింది. ఈ బృందానికి ఓఎస్డీ సి.సమైజాన్‌రావు నేతృత్వం వహిస్తున్నాడని వెల్లడైంది. దీంతో జూన్ 15న ఆయన్ను కూడా పోలీసులు అరెస్ట్ చేశారు. మావోయిస్టు డంప్‌లో దొరికిన ఒక తపంచా ఈ స్పెషల్ పార్టీ పోలీసుల వద్ద లభ్యం కావడంతో వీరి అరాచకాలు ఎంతకాలం నుంచి ఎన్ని రకాలుగా సాగాయో.. పోలీసుల దర్యాప్తులో తేటతెల్లమైంది. సాంకేతికంగా మెరుపు పోలీసులను సాంకేతికపరంగా అభివృద్ధి పరచటంతో పాటు జిల్లాలో ఐ-క్లిక్ కేంద్రాల ఏర్పాటుకు ఎస్పీ కృషి చేశారు. ప్రజలకు పోలీస్స్టేషన్లతో పని లేకుండా నేరుగా ఐ-క్లిక్ కేంద్రాల నుంచే ఫిర్యాదు చేసుకునే విధంగా అవకాశం కల్పించిన ఘనత ఎస్పీ శ్రీకాంత్‌కే దక్కింది. -
ఈ ఏడాది నేరాలు అదుపులోనే..
ఒంగోలు క్రైం: ‘గత ఏడాది కంటే ఈ ఏడాది నేరాలు అదుపులోనే ఉన్నాయి. రాష్ట్ర విభజన ఉద్యమాలు, వరుస ఎన్నికలను విజయవంతంగా నిర్వహించాం. వచ్చే ఏడాది నేరాలు ఇంకా తగ్గుముఖం పట్టేందుకు సిబ్బందిని అప్రమత్తం చేశాం’ అని ఎస్పీ చిరువోలు శ్రీకాంత్ అన్నారు. ఈ ఏడాది జరిగిన నేరాలకు సంబంధించిన వివరాలను స్థానిక తన చాంబర్లో ఎస్పీ చిరువోలు శ్రీకాంత్ విలేకర్లకు వివరించారు. ఈ ఏడాది జరిగిన అన్ని రకాల నేరాల వివరాలను ఎస్పీ వెల్లడించారు. దొంగతనాలు, మహిళలపై లైంగికదాడులు, రోడ్డు ప్రమాదాలు గతేడాది కంటే అధికంగానే జరిగాయన్నారు. వాటి అదుపు కోసం ప్రత్యేక చర్యలు చేపడుతున్నట్లు పేర్కొన్నారు. ప్రత్యేకంగా రాష్ట్ర విభజన సందర్భంగా తలెత్తిన ఉద్యమాల విషయంలో పోలీసులు ఎంతో చాకచక్యంగా వ్యవహరించి ఎలాంటి నష్టం జరగకుండా చూశారన్నారు. వరుస ఎన్నికలను కూడా పోలీసులు విజయవంతంగా నిర్వహించగలిగారని చెప్పారు. మహిళా పోలీస్‌స్టేషన్ ఏర్పాటు చేయటం ద్వారా మహిళలపై లైంగిక దాడులు, వరకట్న వేధింపుల కేసుల విషయంలో పరిష్కారాన్ని వేగవంతం చేయవచ్చన్నారు. అదే విధంగా ఒంగోలు నగరంలో ట్రాఫిక్ ఇబ్బందులు లేకుండా చేయడానికి సిబ్బందిని ఎక్కువ మొత్తంలో కేటాయించడంతో పాటు డీఎస్పీ స్థాయి అధికారిని నియమించి ట్రాఫిక్ నియంత్రణకు ప్రత్యేక చర్యలు చేపట్టామన్నారు. క్లూస్ టీంను బలంగా తయారు చేశామని, ఆ టీమ్‌కు కావాల్సిన సిబ్బందిని ఏర్పాటు చేశామని చెప్పారు. రక్షక్ వాహనాలను ఏర్పాటు చేసి విజిబుల్ పోలీసింగ్ విధానాన్ని నగరంలో విస్తృతపరిచినట్లు పేర్కొన్నారు. సైబర్ నేరాలపై దృష్టి: సైబర్ నేరాలను అదుపు చేసేందుకు ప్రత్యేక చొరవ తీసుకుంటున్నామని ఎస్పీ వివరించారు. అందుకోసం ప్రత్యేక బృందాన్ని ఏర్పాటు చేసినట్లు తెలిపారు. సైబర్ టీమ్ ఇప్పటి వరకు ఫోన్లకు సంబంధించిన కాల్డీటైల్స్ తీయడానికి మాత్రమే పరిమితమయ్యారని, అలా కాకుండా సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించుకొని నేరాలకు పాల్పడుతున్న వారిపై దృష్టి సారించనున్నట్లు పేర్కొన్నారు. ఆర్థికపరమైన నేరాల అదుపుపై ఎస్సై స్థాయి నుంచి నిఘా ఉంచాలని ఆదేశించినట్లు పేర్కొన్నారు. జిల్లాకు ఫేస్బుక్ సౌకర్యాన్ని కల్పించామని, ప్రజలు నేరుగా పోలీస్స్టేషన్లకు వెళ్లకుండానే ఫిర్యాదులు చేయవచ్చన్నారు. ఆ ఫిర్యాదులపై సవివరమైన సమాచారాన్ని కూడా ఫిర్యాదుదారుడికి అందిస్తామని చెప్పారు. ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసులను త్వరితగతిన విచారించేందుకు జిల్లాలో ఇద్దరు డీఎస్పీలను ఏర్పాటు చేశామని, వారికి సహాయంగా సిబ్బందిని కేటాయించామన్నారు. అలాంటి కేసుల్లో బాధితులకు న్యాయం జరిగేలా చర్యలు చేపడుతున్నట్లు వివరించారు. ఇళ్లలో దొంగతనాలు, చైన్‌స్నాచింగ్‌లకు సంబంధించి సీసీఎస్ సిబ్బందిని అప్రమత్తం చేశామన్నారు. డీఎస్పీ స్థాయి అధికారిని ఇందుకోసం కేటాయించి నేరాల అదుపుపై పట్టు సాధించేందుకు చర్యలు చేపట్టామన్నారు. వచ్చే ఏడాదికి ముందస్తు ప్రణాళిక: 2015 సంవత్సరానికిగాను ప్రత్యేకమైన ముందస్తు ప్రణాళికలు రూపొందించినట్లు ఎస్పీ వివరించారు. రోడ్డు ప్రమాదాలు తగ్గించేందుకు అధికారులను, సిబ్బందిని అప్రమత్తం చేశామన్నారు. ప్రజలను మోసం చేసి చిట్టీలు, డిపాజిట్లు, అధిక వడ్డీలతో ప్రజలను దోచుకునే శక్తులపై దృష్టి సారించి మోసపోకుండా చేయటంలో అవగాహన కల్పించేలా పోలీసులను సిద్ధం చేస్తున్నట్లు పేర్కొన్నారు. పోలీసులకు సహకరించి నేరాల అదుపునకు దోహదపడాలని జిల్లా ప్రజలకు ఎస్పీ విజ్ఞప్తి చేశారు. సమావేశంలో అదనపు ఎస్పీ బి.రామానాయక్, డీసీఆర్బీ డీఎస్పీ మరియదాస్, ఎస్బీ డీఎస్పీ రాయపాటి శ్రీనివాస్, ఎస్సీ, ఎస్టీ సెల్ డీఎస్పీలు కె.వి.రత్నం, ఒంగోలు డీఎస్పీ గుంటుపల్లి శ్రీనివాసరావు, కందుకూరు డీఎస్పీ శంకర్, మార్కాపురం ఓఎస్డీ సి.సమైజాన్‌రావు, దర్శి డీఎస్పీ లక్ష్మినారాయణ, చీరాల డీఎస్పీ జయరామరాజు తదితరులున్నారు. -
అవినీతిపై పోరాటం ప్రతి ఒక్కరి బాధ్యత
ఒంగోలు క్రైం: అవినీతిపై పోరాటం చేయడం ప్రతి ఒక్కరి బాధ్యతగా గుర్తించాలని ఎస్పీ చిరువోలు శ్రీకాంత్ పిలుపునిచ్చారు. అంతర్జాతీయ అవినీతి నిరోధక వారోత్సవాల ముగింపు సందర్భంగా స్థానిక గోల్డ్ మర్చంట్స్ అసోసియేషన్ హాలులో మంగళవారం ముగింపు సభ నిర్వహించారు. ఈ సభలో ముఖ్యఅతిథిగా పాల్గొన్న ఎస్పీ శ్రీకాంత్ అవినీతికి సంబంధించిన అంశాలపై విద్యార్థులకు, ప్రజలకు పలు సూచనలు చేశారు. అవినీతిని నిర్మూలించడం ఒక్క పోలీస్ అధికారుల బాధ్యతే కాదని.. దీనిని ప్రతి ఒక్కరూ బాధ్యతగా గుర్తెరగాలన్నారు. అవినీతికి పాల్పడే వారి కంటే అవినీతిని ప్రోత్సహించే వారిపై దృష్టి సారించాల్సిన అవసరం ఉందన్నారు. అంతర్జాతీయ అవినీతి వారోత్సవాల్లో వారం రోజులపాటు అవినీతి నిరోధక శాఖ అధికారులు అనేక రకాల కార్యక్రమాలు చేపట్టారని అన్నారు. ప్రతి ప్రభుత్వ విభాగంలో పని చేస్తున్న సిబ్బందికి, అధికారులకు కూడా అవినీతి నిరోధక అంశాలపై అవగాహన కల్పించేందుకు ఆ శాఖ పలు కార్యక్రమాలు చేపట్టాల్సిన అవసరం ఉందన్నారు. డీఈవో బి.విజయభాస్కర్ మాట్లాడుతూ హైస్కూలు దశ నుంచి అవినీతి నిరోధక అంశంపై ప్రత్యేక అవగాహన కలిగిస్తే భవిష్యత్ తరాలకు ప్రయోజనం ఉంటుందన్నారు. అవినీతి నిరోధక శాఖ డీఎస్పీ ఆర్వీఎస్ఎన్ మూర్తి మాట్లాడుతూ గ్రామీణ స్థాయి నుంచి ప్రతి ఒక్కరిలో అవినీతికి వ్యతిరేకంగా ఏ విధంగా ఉద్యమించాలో తెలియజేస్తే అవినీతిని అరికట్టడం పెద్ద పనేమీ కాదన్నారు. ఈ సందర్భంగా వారోత్సవాల్లో నిర్వహించిన వివిధ రకాల పోటీల్లో విజేతలుగా నిలిచిన 27 మందికి సర్టిఫికెట్లు, బహుమతులను ఎస్పీ శ్రీకాంత్, డీఈవో విజయభాస్కర్ అందజేశారు. అవినీతి నిరోధక ర్యాలీ: అంతర్జాతీయ అవినీతి నిరోధక వారోత్సవాల్లో భాగంగా మంగళవారం సాయంత్రం స్థానిక కలెక్టర్ కార్యాలయం నుంచి ర్యాలీ నిర్వహించారు. ఈ ర్యాలీని కలెక్టర్ జీఎస్ఆర్కేఆర్ విజయకుమార్ ప్రారంభించారు. ర్యాలీలో ఎస్పీ చిరువోలు శ్రీకాంత్, డీఈవో విజయభాస్కర్, ఏసీబీడీఎస్పీ ఆర్వీఎస్ఎన్ మూర్తితో పాటు అధికారులు, ప్రజలు విద్యార్థినీ, విద్యార్థులు పాల్గొన్నారు. ఈ ర్యాలీ చర్చి సెంటర్, నగరపాలక సంస్థ, సీవీఎన్ రీడింగ్ రూం, కోర్టు సెంటర్ మీదుగా గోల్డ్ అండ్ మర్చంట్స్ అసోసియేషన్ హాలు వరకు సాగింది. -
పోలీసులకు దసరా కానుక
ఒంగోలు క్రైం : జిల్లా ఎస్పీ చిరువోలు శ్రీకాంత్ తీసుకున్న నిర్ణయం పోలీసు సిబ్బందికి ఊరట కలిగించింది. జిల్లాలో పనిచేస్తున్న పోలీసు సిబ్బందిలో పురుషులకు 15 రోజులకొకసారి, మహిళలకు నెలకు మూడురోజుల పాటు సెలవులు ఇవ్వాలని ఆయన నిర్ణయించారు. గత నెల 24వ తేదీ జిల్లా పోలీసు అధికారుల సంఘంతో నిర్వహించిన సర్వసభ్య సమావేశంలో మొత్తం 23 సమస్యలతో కూడిన వినతిపత్రాన్ని ఆ సంఘ నాయకులు ఎస్పీకి అందించారు. వాటిపై స్పందించిన ఎస్పీ.. మంగళవారం ఉదయం స్థానిక తన చాంబర్ నుంచి జిల్లావ్యాప్తంగా ఉన్న పోలీసు అధికారులు, సిబ్బందికి సెట్ కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ నెల ఒకటో తేదీ నుంచి జిల్లాలో పనిచేస్తున్న సివిల్, ఏఆర్ ఏఎస్సైలు, కానిస్టేబుళ్లు, హోంగార్డుల్లో పురుషులకు 15 రోజులకోసారి, మహిళలకు నెలలో ఎప్పుడైనా మూడురోజుల పాటు సెలవిచ్చే విధంగా ఎస్‌హెచ్‌వోలకు ఆదేశాలు జారీ చేశారు. ఈ నిర్ణయంలోని లోటుపాట్లను మూడు నెలలపాటు పరిశీలించి అనంతరం ఎస్సై, ఆ పైస్థాయి అధికారులకు కూడా వారాంతపు సెలవులు మంజూరు చేసేందుకు కృషిచేస్తామని ఎస్పీ వివరించారు. వచ్చే ఏడాది జనవరి 1 నుంచి అమలు చేసే అవకాశం ఉందన్నారు. సిబ్బందిని గౌరవించాలి... పోలీస్స్టేషన్లలో కిందిస్థాయి సిబ్బందిని అధికారులు గౌరవంగా చూడాలని ఎస్పీ స్పష్టం చేశారు. దసరా పండుగ సందర్భంగా పోలీసు బీట్లు, పెట్రోలింగ్, విజువల్ పోలీసింగ్‌ను అప్రమత్తం చేయాలని సూచించారు. ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా అధికారులంతా ముందస్తు చర్యలు తీసుకోవాలని చెప్పారు. చెయిన్ స్నాచర్లపై ప్రత్యేక నిఘా ఉంచాలన్నారు. దసరా సందర్భంగా ఇళ్లకు తాళాలు వేసి ఊరెళ్లేవారు ముందస్తుగా సంబంధిత పోలీస్స్టేషన్లలో సమాచారం అందించాలని ఎస్పీ కోరారు. జిల్లా ప్రజలందరికీ దసరా శుభాకాంక్షలు తెలిపారు. -
అరెస్టు కేసుల్లో ఆధార్ జత చేయండి
ఒంగోలు క్రైం: వివిధ కేసుల్లో చేసిన అరెస్టులకు సంబంధించి ఆధార్ కార్డులు కచ్చితంగా జత చేయాలని ఎస్పీ చిరువోలు శ్రీకాంత్ పోలీస్ అధికారులను ఆదేశించారు. స్థానిక పోలీస్ కార్యాలయంలో జిల్లా స్థాయి నేరసమీక్ష సమావేశం మంగళవారం ఎస్పీ ఆధ్వర్యంలో జరిగింది. ఈ సందర్భంగా ఎస్పీ పోలీస్ అధికారులకు పలు సూచనలు, సలహాలు ఇచ్చారు. అరెస్ట్ చేసిన అన్ని కేసుల్లోనూ నిందితులకు సంబంధించిన ఆధార్‌కార్డులను విధిగా జత చేయాలని, అదే విధంగా అరెస్టుల్లో జాగ రూకత వహించాలని సూచించారు. అనుమానాస్పద కేసుల్లో నిశితశోధన జరగాలన్నారు. నాన్‌బెయిలబుల్ వారెంట్ల విషయంలో నిర్లక్ష్యం వీడాలని, ఎన్.బి.డబ్ల్యులపై శ్రద్ధ తీసుకోవాలని ఆదేశించారు. ఆస్తుల కేసుల్లో పరిశోధనను పెంచాలన్నారు. తీవ్రమైన కేసుల విషయంలో జాగ్రత్తగా ఉండాలని ఆదేశించారు. ఎస్సీ, ఎస్టీ, అట్రాసిటీ కేసుల్లో వాస్తవ పరిస్థితులను రాబట్టాలని, అమాయకులకు అన్యాయం జరగకుండా చూడాలని ఎస్పీ సూచించారు. గుర్తుతెలియని మృతదేహాల కేసులను క్షుణ్ణంగా పరిశీలించాలని, అనేక కోణాల్లో మృతదేహానికి సంబంధించిన సమాచారాన్ని రాబట్టేలా చొరవ తీసుకోవాలన్నారు. జిల్లా పోలీస్ కార్యాలయంలో ఏ సీటులోనైనా పెండింగ్‌లో ఉన్న పిటిషన్ల గురించి అధికారులను అడిగి తెలుసుకున్నారు. సీఐలు, డీఎస్పీల పరిధిలోని పెండింగ్ పిటిషన్ల గురించి ఆరా తీశారు. నేరసమీక్షలో ఏఎస్పీ బి.రామానాయక్, పరిపాలనా ఏఎస్పీ జె.కృష్ణయ్య, ఏఆర్ ఏఎస్పీ సి.సమైజాన్‌రావు, లీగల్ అడ్వయిజర్ కె. పురుషోత్తం, డీసీఆర్బీ సీఐ రాయపాటి శ్రీనివాసరావు, ఎస్బీ-1 సీఐ జి.తిరుమలరావు, డీఎస్పీలు పి.జాషువా, బి.లక్ష్మినారాయణ, పి.శంకర్‌లతో పాటు ఐటీ కోర్ సిబ్బంది పాల్గొన్నారు. -
ఒక్క కార్డు రాయండి చాలు
సాక్షి, ప్రతినిధి, ఒంగోలు: ఒంగోలు నగరంతోపాటు జిల్లాలో రౌడీయిజం చేసే వారి సమాచారాన్ని పోస్టు కార్డు ద్వారా తెలియజేస్తే చాలు వారి భరతం పడతానని ఎస్పీ చిరువోలు శ్రీకాంత్ స్పష్టం చేశారు. సోమవారం ఆయన ‘సాక్షి’తో మాట్లాడుతూ రౌడీషీటర్లుగా నమోదైన వారంతా రౌడీయిజాన్ని పక్కన పెట్టకపోతే తగిన మూల్యం చెల్లించకతప్పదని హెచ్చరించారు. కొందరు రౌడీలు రాజకీయ నాయకుల ముసుగులో పంచాయతీలు చేస్తున్నారని, వీరిపై ఆధారాలు అందిస్తే అణిచివేస్తామన్నారు. బాధితుల వివరాలు రహస్యంగా ఉంచి తమదైన శైలిలో విచారణ జరిపించడానికి సిద్ధంగా ఉన్నానన్నారు. ఇటీవల కొంతమంది రౌడీషీటర్లకు కౌన్సెలింగ్ ఇచ్చానని, వారిలో మార్పు వస్తే సరేనని, లేకపోతే నగర బహిష్కరణ తప్పదని హెచ్చరించారు.