అవినీతిపై పోరాటం ప్రతి ఒక్కరి బాధ్యత | Everyone is responsible for fighting on corruption | Sakshi
Sakshi News home page

అవినీతిపై పోరాటం ప్రతి ఒక్కరి బాధ్యత

Published Wed, Dec 10 2014 2:23 AM | Last Updated on Sat, Sep 22 2018 8:22 PM

అవినీతిపై పోరాటం ప్రతి ఒక్కరి బాధ్యత - Sakshi

అవినీతిపై పోరాటం ప్రతి ఒక్కరి బాధ్యత

ఒంగోలు క్రైం: అవినీతిపై పోరాటం చేయడం ప్రతి ఒక్కరి బాధ్యతగా గుర్తించాలని ఎస్పీ చిరువోలు శ్రీకాంత్ పిలుపునిచ్చారు. అంతర్జాతీయ అవినీతి నిరోధక వారోత్సవాల ముగింపు సందర్భంగా స్థానిక గోల్డ్ మర్చంట్స్ అసోసియేషన్ హాలులో మంగళవారం ముగింపు సభ నిర్వహించారు. ఈ సభలో ముఖ్యఅతిథిగా పాల్గొన్న ఎస్పీ శ్రీకాంత్ అవినీతికి సంబంధించిన అంశాలపై విద్యార్థులకు, ప్రజలకు పలు సూచనలు చేశారు. అవినీతిని నిర్మూలించడం ఒక్క పోలీస్ అధికారుల బాధ్యతే కాదని.. దీనిని ప్రతి ఒక్కరూ బాధ్యతగా గుర్తెరగాలన్నారు.

అవినీతికి పాల్పడే వారి కంటే అవినీతిని ప్రోత్సహించే వారిపై దృష్టి సారించాల్సిన అవసరం ఉందన్నారు. అంతర్జాతీయ అవినీతి వారోత్సవాల్లో వారం రోజులపాటు అవినీతి నిరోధక శాఖ అధికారులు అనేక రకాల కార్యక్రమాలు చేపట్టారని అన్నారు.  ప్రతి ప్రభుత్వ విభాగంలో  పని చేస్తున్న సిబ్బందికి, అధికారులకు కూడా అవినీతి నిరోధక అంశాలపై అవగాహన కల్పించేందుకు ఆ శాఖ పలు కార్యక్రమాలు చేపట్టాల్సిన అవసరం ఉందన్నారు.

డీఈవో బి.విజయభాస్కర్ మాట్లాడుతూ హైస్కూలు దశ నుంచి అవినీతి నిరోధక అంశంపై ప్రత్యేక అవగాహన కలిగిస్తే భవిష్యత్ తరాలకు ప్రయోజనం ఉంటుందన్నారు. అవినీతి నిరోధక శాఖ డీఎస్పీ ఆర్‌వీఎస్‌ఎన్ మూర్తి మాట్లాడుతూ గ్రామీణ స్థాయి నుంచి ప్రతి ఒక్కరిలో అవినీతికి వ్యతిరేకంగా ఏ విధంగా ఉద్యమించాలో తెలియజేస్తే అవినీతిని అరికట్టడం పెద్ద పనేమీ కాదన్నారు. ఈ సందర్భంగా వారోత్సవాల్లో నిర్వహించిన వివిధ రకాల పోటీల్లో విజేతలుగా నిలిచిన 27 మందికి సర్టిఫికెట్లు, బహుమతులను ఎస్పీ శ్రీకాంత్, డీఈవో విజయభాస్కర్  అందజేశారు.
 
అవినీతి నిరోధక ర్యాలీ:
అంతర్జాతీయ అవినీతి నిరోధక వారోత్సవాల్లో భాగంగా మంగళవారం సాయంత్రం స్థానిక  కలెక్టర్ కార్యాలయం నుంచి ర్యాలీ నిర్వహించారు. ఈ ర్యాలీని  కలెక్టర్ జీఎస్‌ఆర్‌కేఆర్ విజయకుమార్ ప్రారంభించారు. ర్యాలీలో ఎస్పీ చిరువోలు శ్రీకాంత్, డీఈవో విజయభాస్కర్, ఏసీబీడీఎస్పీ ఆర్‌వీఎస్‌ఎన్ మూర్తితో పాటు అధికారులు, ప్రజలు విద్యార్థినీ, విద్యార్థులు పాల్గొన్నారు. ఈ ర్యాలీ చర్చి సెంటర్, నగరపాలక సంస్థ, సీవీఎన్ రీడింగ్ రూం, కోర్టు సెంటర్ మీదుగా గోల్డ్ అండ్ మర్చంట్స్ అసోసియేషన్ హాలు వరకు సాగింది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement