ఒంగోలు క్రైం : జిల్లా ఎస్పీ చిరువోలు శ్రీకాంత్ తీసుకున్న నిర్ణయం పోలీసు సిబ్బందికి ఊరట కలిగించింది. జిల్లాలో పనిచేస్తున్న పోలీసు సిబ్బందిలో పురుషులకు 15 రోజులకొకసారి, మహిళలకు నెలకు మూడురోజుల పాటు సెలవులు ఇవ్వాలని ఆయన నిర్ణయించారు. గత నెల 24వ తేదీ జిల్లా పోలీసు అధికారుల సంఘంతో నిర్వహించిన సర్వసభ్య సమావేశంలో మొత్తం 23 సమస్యలతో కూడిన వినతిపత్రాన్ని ఆ సంఘ నాయకులు ఎస్పీకి అందించారు.
వాటిపై స్పందించిన ఎస్పీ.. మంగళవారం ఉదయం స్థానిక తన చాంబర్ నుంచి జిల్లావ్యాప్తంగా ఉన్న పోలీసు అధికారులు, సిబ్బందికి సెట్ కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ నెల ఒకటో తేదీ నుంచి జిల్లాలో పనిచేస్తున్న సివిల్, ఏఆర్ ఏఎస్సైలు, కానిస్టేబుళ్లు, హోంగార్డుల్లో పురుషులకు 15 రోజులకోసారి, మహిళలకు నెలలో ఎప్పుడైనా మూడురోజుల పాటు సెలవిచ్చే విధంగా ఎస్‌హెచ్‌వోలకు ఆదేశాలు జారీ చేశారు. ఈ నిర్ణయంలోని లోటుపాట్లను మూడు నెలలపాటు పరిశీలించి అనంతరం ఎస్సై, ఆ పైస్థాయి అధికారులకు కూడా వారాంతపు సెలవులు మంజూరు చేసేందుకు కృషిచేస్తామని ఎస్పీ వివరించారు. వచ్చే ఏడాది జనవరి 1 నుంచి అమలు చేసే అవకాశం ఉందన్నారు.
సిబ్బందిని గౌరవించాలి...
పోలీస్‌స్టేషన్లలో కిందిస్థాయి సిబ్బందిని అధికారులు గౌరవంగా చూడాలని ఎస్పీ స్పష్టం చేశారు. దసరా పండుగ సందర్భంగా పోలీసు బీట్లు, పెట్రోలింగ్, విజువల్ పోలీసింగ్‌ను అప్రమత్తం చేయాలని సూచించారు. ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా అధికారులంతా ముందస్తు చర్యలు తీసుకోవాలని చెప్పారు. చెయిన్ స్నాచర్లపై ప్రత్యేక నిఘా ఉంచాలన్నారు. దసరా సందర్భంగా ఇళ్లకు తాళాలు వేసి ఊరెళ్లేవారు ముందస్తుగా సంబంధిత పోలీస్‌స్టేషన్లలో సమాచారం అందించాలని ఎస్పీ కోరారు. జిల్లా ప్రజలందరికీ దసరా శుభాకాంక్షలు తెలిపారు.
పోలీసులకు దసరా కానుక
Published Wed, Oct 1 2014 2:00 AM | Last Updated on Tue, Aug 21 2018 9:20 PM
Advertisement