ఒంగోలు క్రైం: వివిధ కేసుల్లో చేసిన అరెస్టులకు సంబంధించి ఆధార్ కార్డులు కచ్చితంగా జత చేయాలని ఎస్పీ చిరువోలు శ్రీకాంత్ పోలీస్ అధికారులను ఆదేశించారు. స్థానిక పోలీస్ కార్యాలయంలో జిల్లా స్థాయి నేరసమీక్ష సమావేశం మంగళవారం ఎస్పీ ఆధ్వర్యంలో జరిగింది. ఈ సందర్భంగా ఎస్పీ పోలీస్ అధికారులకు పలు సూచనలు, సలహాలు ఇచ్చారు.
అరెస్ట్ చేసిన అన్ని కేసుల్లోనూ నిందితులకు సంబంధించిన ఆధార్‌కార్డులను విధిగా జత చేయాలని, అదే విధంగా అరెస్టుల్లో జాగ రూకత వహించాలని సూచించారు. అనుమానాస్పద కేసుల్లో నిశితశోధన జరగాలన్నారు. నాన్‌బెయిలబుల్ వారెంట్ల విషయంలో నిర్లక్ష్యం వీడాలని, ఎన్.బి.డబ్ల్యులపై శ్రద్ధ తీసుకోవాలని ఆదేశించారు. ఆస్తుల కేసుల్లో పరిశోధనను పెంచాలన్నారు.
తీవ్రమైన కేసుల విషయంలో జాగ్రత్తగా ఉండాలని ఆదేశించారు. ఎస్సీ, ఎస్టీ, అట్రాసిటీ కేసుల్లో వాస్తవ పరిస్థితులను రాబట్టాలని, అమాయకులకు అన్యాయం జరగకుండా చూడాలని ఎస్పీ సూచించారు. గుర్తుతెలియని మృతదేహాల కేసులను క్షుణ్ణంగా పరిశీలించాలని, అనేక కోణాల్లో మృతదేహానికి సంబంధించిన సమాచారాన్ని రాబట్టేలా చొరవ తీసుకోవాలన్నారు. జిల్లా పోలీస్ కార్యాలయంలో ఏ సీటులోనైనా పెండింగ్‌లో ఉన్న పిటిషన్ల గురించి అధికారులను అడిగి తెలుసుకున్నారు. సీఐలు, డీఎస్పీల పరిధిలోని పెండింగ్ పిటిషన్ల గురించి ఆరా తీశారు.
నేరసమీక్షలో ఏఎస్పీ బి.రామానాయక్, పరిపాలనా ఏఎస్పీ జె.కృష్ణయ్య, ఏఆర్ ఏఎస్పీ సి.సమైజాన్‌రావు, లీగల్ అడ్వయిజర్ కె. పురుషోత్తం, డీసీఆర్‌బీ సీఐ రాయపాటి శ్రీనివాసరావు, ఎస్‌బీ-1 సీఐ జి.తిరుమలరావు, డీఎస్పీలు పి.జాషువా, బి.లక్ష్మినారాయణ, పి.శంకర్‌లతో పాటు ఐటీ కోర్ సిబ్బంది పాల్గొన్నారు.
అరెస్టు కేసుల్లో ఆధార్ జత చేయండి
Published Wed, Sep 24 2014 2:54 AM | Last Updated on Mon, Aug 20 2018 4:44 PM
Advertisement
Advertisement