అంబేడ్కర్‌పై అమిత్ షా వ్యాఖ్యల పట్ల విపక్షాల ఆగ్రహం
హోంమంత్రి వెంటనే క్షమాపణ చెప్పాలని డిమాండ్
రాహుల్ తీరుపై రాజ్యసభలో బీజేపీ మండిపాటు
ఆయనపై కఠిన చర్యలు తీసుకోవాలని పట్టు
నిరసనలు, నినాదాలతో అట్టుడికిన ఉభయ సభలు
న్యూఢిల్లీ: డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ పట్ల కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా చేసిన వ్యాఖ్యలపై పార్లమెంట్ ఉభయ సభలు గురువారం దద్దరిల్లాయి. రాజ్యాంగ నిర్మాతను అవమానించినందుకు అమిత్ షా వెంటనే క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేస్తూ ప్రతిపక్షాలు అలజడి సృష్టించాయి. నిరసనలు, నినాదాలతో ఉభయ సభలు పలుమార్లు వాయిదాపడ్డాయి. లోక్‌సభ ఉదయం 11 గంటలకు ప్రారంభం కాగానే విపక్ష ఎంపీలు తమ స్థానాల్లో నిల్చొని నినాదాలు ప్రారంభించారు. అమిత్ షా క్షమాపణ చెప్పాలని పట్టుబట్టారు. శాంతించాలని స్పీకర్ ఓం బిర్లా కోరారు. తమిళనాడుకు చెందిన ఎంపీ ఇళంగోవన్ మృతిపట్ల సంతాపం ప్రకటించారు.
దివంగత సభ్యుడి ఆత్మశాంతి కోసం ఎంపీలంతా కొంతసేపు మౌనం పాటించారు. అనంతరం విపక్ష సభ్యులు మళ్లీ నినాదాలు చేశారు. దీంతో సభను స్పీకర్ మధ్యాహ్నం 2 గంటల వరకు వాయిదా వేశారు. ప్రియాంకగాంధీ వాద్రా సహా విపక్ష ఎంపీలు జైభీమ్ అంటూ నినాదాలతో హోరెత్తించారు. సభలో అంబేడ్కర్ చిత్రపటాలు ప్రదర్శించారు. 2 గంటలకు సభ పున:ప్రారంభమైన తర్వాత కూడా పరిస్థితిలో మార్పు రాలేదు.
అమిత్ షా క్షమాపణ చెప్పేదాకా ఆందోళన కొనసాగిస్తామని ప్రతిపక్ష ఎంపీలు తేలి్చచెప్పారు. నినాదాల హోరుతో సభ మార్మోగిపోయింది. సభకు సహకరించాలంటూ స్పీకర్ స్థానంలో ఉన్న దిలీప్ సైకియా పదేపదే కోరిన విపక్ష ఎంపీలు పట్టించుకోలేదు. దీంతో సభను శుక్రవారానికి వాయిదా వేస్తున్నట్లు దిలీప్ సైకియా ప్రకటించారు.
స్పీకర్‌స్థానాన్ని చుట్టుముట్టేందుకు కాంగ్రెస్ ఎంపీలు ప్రయతి్నంచగా మార్షల్స్ అడ్డుకున్నారు. సభ వాయిదా పడిన తర్వాత కూడా ప్రతిపక్ష సభ్యులు నినాదాలు కొనసాగించారు. జమిలి ఎన్నికలపై రెండు బిల్లులను జాయింట్ పార్లమెంటరీ కమిటీ(జేపీసీ)కి సిఫార్సు చేయడానికి లోక్‌సభలో గురువారం తీర్మానం ఆమోదించాలని ప్రభుత్వం నిర్ణయించింది. కానీ, సభలో గందరగోళం కారణంగా తీర్మానంపై చర్చ జరగలేదు.
రాహుల్ అనుచితంగా ప్రవర్తించారు
అమిత్ షా వ్యాఖ్యలు పార్లమెంట్ ఎగువ సభలోనూ అలజడి రేపాయి. అంబేడ్కర్‌ను అమిత్ షా ఘోరంగా అవమానించారని, ఈ అంశంపై తక్షణమే చర్చించాలని విపక్ష సభ్యులు డిమాండ్ చేశారు. జైభీమ్ అంటూ నినదించారు. పార్లమెంట్ ప్రాంగణంలో శాంతియుతంగా నిరసన వ్యక్తం చేస్తున్న తమపై కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీ అనుచితంగా ప్రవర్తించారని, ఆయనపై కఠిన చర్యలు తీసుకోవాలని బీజేపీ ఎంపీలు పట్టుబట్టారు. బీజేపీ మహిళా ఎంపీ కోన్యాక్‌ను రాహుల్ గాంధీ నెట్టివేశారని, మరో ఇద్దరు ఎంపీలపై దాడి చేశారని పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి కిరణ్ రిజిజు ఆరోపించారు.
బీజేపీ సభ్యుల పట్ల అనుచిత ప్రవర్తనకు కాంగ్రెస్ ఎంపీలంతా సభకు, దేశానికి క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. రాహుల్ గాంధీ అప్రజాస్వామికంగా వ్యవహరిస్తున్నారని కేంద్ర మంత్రి జేపీ నడ్డా మండిపడ్డారు. అనంతరం డీఎంకే సభ్యుడు తిరుచ్చి శివ మాట్లాడారు. విపక్ష సభ్యులపై రాహుల్ గాంధీ దాడి చేయలేదని పేర్కొన్నారు. పార్లమెంట్ సభ్యులను గౌరవిస్తామని అన్నారు. మహిళలపై తమకు ఎంతో గౌరవం ఉందని చెప్పారు. ఇరుపక్షాల ఆందోళనలు, నినాదాలతో ఎగువసభలో తీవ్ర గందరగోళం నెలకొంది. ఎవరూ వెనక్కి తగ్గకపోవడంతో సభను పలుమార్లు వాయిదా వేయాల్సి వచి్చంది. చివరకు సభ శుక్రవారానికి వాయిదాపడింది.
Comments
Please login to add a commentAdd a comment