ఎన్డీయే, ఇండియా ఎంపీల మధ్య తోపులాట
రాహుల్ గాంధీపై కేసు నమోదు
బీజేపీ ఎంపీలు ప్రతాప్ సారంగి, ముకేశ్ రాజ్‌పుత్‌లకు గాయాలు
న్యూఢిల్లీ: పార్లమెంట్ ప్రాంగణంలో మునుపెన్నడూ లేనివిధంగా అధికార, ప్రతిపక్ష సభ్యుల మధ్య తీవ్రస్థాయిలో ఘర్షణ చోటుచేసుకుంది. రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బీఆర్ అంబేడ్కర్‌పై కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా చేసిన వ్యాఖ్యలు చివరకు ఘర్షణకు దారితీయడం గమనార్హం. ఇరుపక్షాల ఎంపీలు ఒకరినొకరు తోసేసుకోవడం, పరస్పరం గొడవ పడడం, ఇద్దరు బీజేపీ ఎంపీలు గాయపడి ఆసుపత్రిలో చేరడం, ఒకరిపై ఒకరు పోలీసులకు ఫిర్యాదు చేసుకోవడం, కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీపై ఎఫ్‌ఐఆర్ నమోదు కావడం, రాహుల్ తనతో అభ్యంతరకరంగా ప్రవర్తించారని బీజేపీ మహిళా ఎంపీ కోన్యాక్ ఆరోపించడం వంటి పరిణామాలు తీవ్ర ఆందోళన కలిగించాయి. మొత్తానికి పార్లమెంట్ సాక్షిగా గురువారం దిగ్భ్రాంతికర సన్నివేశాలు చోటుచేసుకున్నాయి.
నినాదాలు, అరుపులు, కేకలతో ఉద్రిక్తత
అంబేడ్కర్‌పై అమిత్ షా వ్యాఖ్యలను వ్యతిరేకిస్తూ ఉదయం ఉభయ సభలు ప్రారంభం కావడానికి కొన్ని నిమిషాల ముందు విపక్ష ‘ఇండియా’ కూటమి ఎంపీలు పార్లమెంట్ ప్రాంగణంలో నిరసన ర్యాలీ నిర్వహించారు. నీలం రంగు దుస్తులు ధరించి, అమిత్ షాకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. రాహుల్ గాం«దీ, ప్రియాంకగాంధీ వాద్రాతోపాటు కాంగ్రెస్, డీఎంకే, ఆర్జేడీ, సమాజ్‌వాదీ పార్టీ, ఎన్సీపీ, సీపీఐ, సీపీఎం తదితర పారీ్టల సభ్యులు ఈ నిరసనలో పాల్గొన్నారు. తర్వాత వారంతా మకరద్వారం గుండా పార్లమెంట్ లోపలికి ప్రవేశించేందుకు ముందుకు కదిలారు. అప్పటికే అక్కడ బీజేపీ నేతృత్వంలోని ఎన్డీయే ఎంపీలు బైఠాయించారు.
అంబేడ్కర్‌ను కాంగ్రెస్ కించపర్చిందని ఆరోపిస్తూ ప్లకార్డులు ప్రదర్శిస్తూ బిగ్గరగా నినాదాలు ప్రారంభించారు. మకరద్వారం మెట్లపై ఇరువర్గాలు పరస్పరం ఎదురుపడ్డాయి. తాము ముందుకెళ్లడానికి దారి ఇవ్వడం లేదని ఇండియా కూటమి ఎంపీలు మండిపడ్డారు. దాంతో ఎన్డీయే ఎంపీలు మరింత బిగ్గరగా నినాదాలు చేశారు. ఇండియా కూటమి సభ్యులు సైతం స్వరం పెంచారు. ఇరువర్గాల మధ్య ఘర్షణ మొదలైంది. తోపులాటలు, అరుపులు కేకలతో ఈ ప్రాంతం రణరంగాన్ని తలపించింది. అసలేం జరుగుతోందో అర్థం కాని పరిస్థితి ఏర్పడింది. తోపులాటలో కొందరు ఎంపీలు కిందపడ్డారు.
మెట్ల మధ్యభాగంలో నిలబడిన తమను రాహుల్ గాంధీ బలంగా తోసివేశారని బీజేపీ ఎంపీలు ఆగ్రహం వ్యక్తంచేశారు. ముందుకెళ్లడానికి పక్కనే తగినంత దారి ఉన్నప్పటికీ ఆయన తమపై ఉద్దేశపూర్వకంగా దురుసుగా ప్రవర్తించారని అన్నారు. రాహుల్ గాంధీ తోసివేయడంతో తమ ఎంపీలు ప్రతాప్ సారంగి, ముకేశ్ రాజ్‌పుత్ గాయపడ్డారని చెప్పారు. నడవలేని స్థితిలో ఉన్న సారంగిని చక్రాల కురీ్చలో అంబులెన్స్ దాకా తీసుకెళ్లారు. అంబులెన్స్‌లో ఆసుపత్రికి తరలించారు. అయితే, బీజేపీ ఎంపీలే దారికి అడ్డంగా నిల్చొని, రాహుల్ గాం«దీని ముందుకు వెళ్లనివ్వలేదని కాంగ్రెస్ సభ్యులు చెప్పారు. తమను రెచ్చగొట్టేలా ప్రవర్తించారని బీజేపీ సభ్యులపై విరుచుకుపడ్డారు.
మోదీ పరామర్శ
పార్లమెంట్ ప్రాంగణంలో జరిగిన ఘర్షణలో గాయపడిన ప్రతాప్ సారంగితోపాటు ముకేశ్ రాజ్‌పుత్ చికిత్స నిమిత్తం ఢిల్లీలోని రామ్ మనోహర్ లోహియా ఆసుపత్రిలో చేరారు. సారంగి కణతకు కుట్లు పడ్డాయి. ముకేశ్ రాజ్‌పుత్ తలకు గాయాలయ్యాయి. వారి ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉన్నట్లు సమాచారం. ప్రధాని నరేంద్ర మోదీ వారిద్దరినీ ఫోన్‌లో పరామర్శించారు. జరిగిన ఘటనపై వివరాలు అడిగి తెలుసుకున్నారు. అలాగే పలువురు కేంద్ర మంత్రులు, ఎన్డీయే ఎంపీలు సైతం ఆసుపత్రికి చేరుకొని ప్రతాప్ సారంగి, ముకేశ్ రాజ్‌పుత్‌లను పరామర్శించారు.
బీజేపీ ఎంపీలు కర్రలతో బెదిరించారు: రాహుల్
బీజేపీ ఎంపీలు తనపై బల ప్రయోగం చేశారని, దురుసుగా తోసివేశారని కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే ఆరోపించారు. కింద పడిపోయానని, తనకు గాయాలయ్యాయని చెప్పారు. బీజేపీ ఎంపీలే తమపై దౌర్జన్యానికి పాల్పడి, తప్పుడు ఆరోపణలు చేస్తున్నారని విమర్శించారు. పార్లమెంట్ ప్రాంగణంలో శాంతియుతంగా నిరసన వ్యక్తం చేస్తున్న తమపై బీజేపీ ఎంపీలు అనుచితంగా ప్రవర్తించారని ప్రియాంక గాంధీ మండిపడ్డారు. బీజేపీ ఎంపీలే తమపై భౌతిక దాడులు చేశారని రాహుల్ గాంధీ ధ్వజమెత్తారు. కర్రలు చేతపట్టుకొని తమను అడ్డుకున్నారని, బెదిరించారని, పార్లమెంట్ లోపలికి వెళ్లనివ్వలేదని చెప్పారు.
పార్లమెంట్ రెజ్లింగ్ రింగ్ కాదు: రిజిజు
తమ ఎంపీ సారంగిని రాహుల్ గాంధీ నెట్టివేశారని, రౌడీలా ప్రవర్తించారని బీజేపీ ఎంపీ నిషికాంత్ దూబే దుయ్యబట్టారు. ఒక వృద్ధుడిని నెట్టివేసినందుకు రాహుల్ సిగ్గుపడాలని అన్నారు. తాను నాలుగుసార్లు ఎంపీగా గెలిచానని, తన రాజకీయ జీవితంలో ఇలాంటి దారుణమైన ఘటన ఏనాడూ చూడలేదని స్పష్టంచేశారు. కేంద్ర మంత్రి కిరణ్ రిజిజు మాట్లాడుతూ.. పార్లమెంట్ అనేది బల ప్రదర్శనకు వేదిక కాదని, కుస్తీలు పట్టడానికి రెజ్లింగ్ రింగ్ కాదని సూచించారు. గురువారం నాటి ఘర్షణపై తగిన చర్యలు ఉంటాయని తేల్చిచెప్పారు.
అమిత్ షాపై సభా హక్కుల ఉల్లంఘన నోటీసు
అంబేడ్కర్‌పై అభ్యంతరకర వ్యాఖ్యలు చేశారని ఆరోపిస్తూ కేంద్ర మంత్రి అమిత్ షాపై కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే గురువారం రాజ్యసభలో సభా హక్కుల ఉల్లంఘన నోటీసు ఇచ్చారు. రాజ్యసభ చైర్మన్ ధన్‌ఖడ్‌కు ఈ నోటీసు అందజేశారు. రాజ్యసభ సాక్షిగా రాజ్యాంగ నిర్మాతను అమిత్ షా అవమానించారని ఖర్గే ఆరోపించారు.
పార్లమెంట్‌లోకి వెళ్తుంటే ఎగతాళి చేశారు
తాము పార్లమెంట్‌లోకి వెళ్తుండగా బీజేపీ ఎంపీలు ఎగతాళి చేశారని, లోపలకి వెళ్లకుండా అడ్డుకున్నారని కాంగ్రెస్ అగ్రనేతలు మల్లికార్జున ఖర్గే, రాహుల్ గాంధీ ఆరోపించారు. అంబేడ్కర్‌ను అవమానించినందుకు హోంమంత్రి పదవికి అమిత్ షా రాజీనామా చేయాలని, దేశ ప్రజలకు క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. వారు గురువారం ఏఐసీసీ ప్రధాన కార్యాలయంలో మీడియాతో మాట్లాడారు. అమిత్ షాను కాపాడేందుకు బీజేపీ ముందస్తుగానే కుట్ర పన్నిందని విమర్శించారు.
పరస్పరం ఫిర్యాదులు
మొత్తం గొడవకు రాహుల్ గాంధీ కేంద్ర బిందువుగా మారారు. ఆయనపై బీజేపీ నేతలు పార్లమెంట్ హౌస్ పోలీసు స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. హత్యాయత్నం, భౌతిక దాడి, హింసకు ప్రేరేపించడం వంటి ఆరోపణలతో ఫిర్యాదు అందించారు. రాహుల్‌పై పోలీసులు ఎఫ్‌ఐఆర్ నమోదు చేశారు. కాంగ్రెస్ నేతలు సైతం బీజేపీ ఎంపీలపై పోలీసులకు ఫిర్యాదు చేశారు. లోక్‌సభ స్పీకర్ ఓం బిర్లాను కూడా కలిశారు. రాహుల్ గాంధీపై బీజేపీ ఎంపీలు దారుణంగా ప్రవర్తించారని, వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని కోరారు. ఈ మేరకు ఓం బిర్లాకు ఫిర్యాదు అందజేశారు. మల్లికార్జున ఖర్గే సైతం ఓం బిర్లాకు లేఖ రాశారు. బీజేపీ ఎంపీల దాడిలో తన మోకాలికి గాయమైందని పేర్కొన్నారు. ఈ దాడిపై దర్యాప్తు జరపాలని కోరారు. రాజ్యసభ చైర్మన్ ధన్‌ఖడ్‌కు కూడా కాంగ్రెస్ ఎంపీలు ఫిర్యాదు చేశారు. బీజేపీ నేతలు సైతం కాంగ్రెస్ ఎంపీలపై లోక్‌సభ స్పీకర్, రాజ్యసభ చైర్మన్‌కు ఫిర్యాదు చేశారు.
నా ఆత్మగౌరవం దెబ్బతీశారు
రాహుల్ గాందీపై నాగాలాండ్‌కు చెందిన బీజేపీ మహిళా ఎంపీ ఫాంగ్‌నన్ కోన్యాక్ ఆరోపణలు చేయడం సంచలనాత్మకంగా మారింది. ఆమె గురువారం రాజ్యసభలో మాట్లాడారు. ‘‘మకరద్వారం వద్ద శాంతియుతంగా నిరసన వ్యక్తం చేస్తుండగా రాహుల్ గాంధీ నాకు చాలా సమీపంలోకి వచ్చారు. కోపంగా చూస్తూ నాపై గట్టిగా అరిచారు. నాకు చాలా అసౌకర్యంగా అనిపించింది. లోక్‌సభలో ప్రతిపక్ష నాయకుడైన రాహుల్ ప్రవర్తన ఇదేనా?’’ అని ప్రశ్నించారు. రాహుల్‌పై చర్యలు తీసుకోవాలని కోరుతూ రాజ్యసభ చైర్మన్ ధన్‌ఖడ్‌కు లేఖ అందజేశారు. ‘‘నేను గిరిజన మహిళను. రాహుల్ నా పట్ల అనుచితంగా ప్రవర్తించారు. నా ఆత్మగౌరవాన్ని దెబ్బతీశారు. నాకు రక్షణ కల్పించాలి’’ అని లేఖలో పేర్కొన్నారు. ఆమె ఫిర్యాదును పరిశీలిస్తున్నానని ధన్‌ఖడ్ చెప్పారు.
హోం మంత్రి అమిత్ షా వెంటనే రాజీనామా చేయాలంటూ పార్లమెంట్ ప్రాంగణంలో ఇండియా కూటమి ఎంపీల నిరసన
Comments
Please login to add a commentAdd a comment