ఫేస్ బుక్కయ్యాడు | Young man arrested for fraud by Facebook | Sakshi
Sakshi News home page

ఫేస్ బుక్కయ్యాడు

Published Sun, Jan 4 2015 4:00 AM | Last Updated on Wed, Oct 3 2018 7:38 PM

ఫేస్ బుక్కయ్యాడు - Sakshi

ఫేస్ బుక్కయ్యాడు

*  ఫేస్‌బుక్ ద్వారా మోసం చేసిన యువకుడు అరెస్టు
* మోసపోయిన వారిలో నలుగురు ఎమ్మెల్యేలు, ఇద్దరుమాజీ ఎమ్మెల్యేలు, వ్యాపారవేత్తలు
*  ఫ్యాన్సీ సెల్‌ఫోన్ నంబర్లు ఇప్పిస్తానని రూ.20 లక్షలకు టోకరా
* రూ.12.22 లక్షలు రికవరీ
*  వివరాలు వెల్లడించిన ఎస్పీ శ్రీకాంత్

ఒంగోలు క్రైం : ఫేస్‌బుక్ ద్వారా ప్రముఖులతో పరిచయాల ఏర్పరచుకుని ఫ్యాన్సీ సెల్‌నంబర్లు ఇప్పిస్తానని మోసం చేసిన ఓ యువకుడు అడ్డంగా పోలీసులకు దొరికిపోయాడు. శాసనసభ్యులు, మాజీ శాసనసభ్యులు, వ్యాపారవేత్తలను మోసం చేసి లక్షల రూపాయలకు టోకరా పెట్టి చివరకు బుక్కయ్యాడు.

ఈ హైటెక్ మోసగాడ్ని చీరాల పోలీసులు శనివారం అరెస్టు చేశారు. అతని మోసాలకు సంబంధించిన వివరాలను స్థానిక తన కార్యాలయంలో జిల్లా అదనపు ఎస్పీ బి.రామానాయక్, చీరాల డీఎస్పీ జయరాంరాజు, చీరాల టూటౌన్ సీఐ ఎండీ అబ్దుల్ సుభాన్‌లతో కలిసి ఏర్పాటు చేసిన విలేకర్ల సమావేశంలో ఎస్పీ చిరువోలు శ్రీకాంత్ శనివారం సాయంత్రం వెల్లడించారు. ఆ వివరాలు ఆయన మాటల్లోనే...తూర్పుగోదావరి జిల్లా కడియం మండలం వేమగిరి గ్రామానికి చెందిన మద్దెల దీపుబాబు అలియాస్ దీపక్ ఫ్యాన్సీసెల్‌ఫోన్ నంబర్ల పేరుతో దాదాపు రూ.20 లక్షల వరకు మోసం చేశాడు.

మోసపోయిన వారిలో జిల్లాకు చెందిన ఎమ్మెల్యేలు ఆమంచి కృష్ణమోహన్ (చీరాల), దామచర్ల జనార్దన్ (ఒంగోలు) ఉన్నారు. వీరితోపాటు పెనమలూరు ఎమ్మెల్యే బోడే ప్రసాద్, గోపాలపురం ఎమ్మెల్యేలు, నెల్లూరు మాజీ ఎమ్మెల్యే ఆనం వివేకానందరెడ్డి పర్సనల్ అసిస్టెంట్, ఏలూరి మాజీ ఎమ్మెల్యే కూడా బాధితుల జాబితాలో ఉన్నారు. ఢిల్లీ, విశాఖపట్నంకు చెందిన పైడి గ్రూప్ ఆఫ్ కంపెనీ, ప్రగతి గ్రూప్ ఆఫ్ కంపెనీలకు చెందిన యజమానులను కూడా మోసం చేసి లక్షల రూపాయలకు టోకరా వేశాడు. చీరాలలోని గుంటూరు బస్టాండ్ సెంటర్లో నిందితుడిని చీరాల డీఎస్పీ, సీఐలు తమ సిబ్బందితో వలపన్ని పట్టుకున్నారు.
 
నిందితుడి నేపథ్యమిదీ...
నిందితుడు దీపుబాబు తండ్రి లక్ష్మణరావు తూర్పుగోదావరి జిల్లాలో ఓ కోర్టులో విధులు నిర్వర్తిస్తున్నాడు. తల్లి ప్రభుత్వ వైద్యశాలలో ఉద్యోగం చేస్తోంది. నిందితుడు కోరుకొండలో బీటెక్ సివిల్ ఇంజినీరింగ్ మొదటి సంవత్సరం చదువుతూ మధ్యలోనే ఆపేశాడు. చిన్న వయసులోనే స్కేటింగ్ చేస్తూ ప్రమాదవశాత్తు కుడికాలు కోల్పోయాడు. కొయ్య కాలుతో ఇతను మనుగడ సాగిస్తున్నాడు.

మోసాలు చేసైనా సరే లక్షలు సంపాదించి జల్సాలు చేయాలని నిర్ణయించుకున్నాడు. అందులో భాగంగా ప్రముఖ రాజకీయ నాయకులు, సినిమా హీరోలు, స్పోర్ట్స్ స్టార్లతో ఫొటోలు తీయించుకుని వారందరితో పరిచయాలున్నట్టు ఇతరులను నమ్మించేవాడు. తనకున్న కంప్యూటర్ పరిజ్ఞానంతో ఎమ్మెల్యేలు, మాజీ ఎమ్మెల్యే, వ్యాపారవేత్తలను ఆకర్షించేందుకు ఫేస్‌బుక్ ద్వారా మేసేజ్‌లు పంపించి ఫ్యాన్సీ సెల్‌ఫోన్ నంబర్లు ఇప్పిస్తానంటూ నమ్మించేందుకు ప్రయత్నించేవాడు. తన స్నేహితుడు చల్లగుంట సురేష్ పేరు మీద బ్యాంక్ అకౌంట్ తీయించి ఆ అకౌంట్‌లో డబ్బులు వేయించుకునేవాడు.

వచ్చిన డబ్బుతో జల్సాలు చేసేవాడు.  రాష్ట్రం మొత్తం మీద ఇతనిపై ఎక్కడా కేసులు నమోదు కాలేదని, మొట్టమొదటగా జిల్లాలో రెండు కేసులు నమోదు చేశామని ఎస్పీ చిరువోలు శ్రీకాంత్ వివరించారు. నిందితుడ్ని అత్యంత చాకచక్యంగా పట్టుకున్న చీరాల డీఎస్పీ జయరామరాజు, చీరాల రెండో పట్టణ సీఐ ఎండీ అబ్దుల్ సుబాన్, ఎస్సై ఎం.రామానాయక్, ఏఎస్సై వై.శ్రీనివాసరావు, హెచ్‌సీ డి.సత్యరాజు, కానిస్టేబుల్ డి.రవి, అచ్చయ్య, అలెక్స్, హెచ్‌జీ వి.రమణలను ఎస్పీ ప్రత్యేకంగా అభినందించారు.
 
చేసిన నేరాలు...
* చీరాల ఎమ్మెల్యే ఆమంచి కృష్ణమోహన్‌కు ఫ్యాన్సీ సెల్‌ఫోన్ నంబర్లు ఇప్పిస్తానంటూ ఎమ్మెల్యే బ్యాంకు అకౌంట్‌నుంచి రూ.9,26,900 వేయించుకున్నాడు.
* ఒంగోలు ఎమ్మెల్యే దామచర్ల జనార్దన్‌ను కూడా ఇదేవిధంగా మోసం చేసి అతని అకౌంట్ నుంచి రూ.4 లక్షలు వేయించుకున్నాడు.
* పెనమలూరు ఎమ్మెల్యే బోడె ప్రసాద్ బ్యాంకు అకౌంట్ నుంచి రూ.64 వేలు, గోపాలపురం ఎమ్మెల్యే బ్యాంకు అకౌంట్ నుంచి రూ.48 వేలు, నెల్లూరు మాజీ ఎమ్మెల్యే ఆనం వివేకానందరెడ్డి పర్సనల్ అసిస్టెంట్ బ్యాంక్ అకౌంట్ నుంచి రూ.15 వేలు, ఏలూరు మాజీ ఎమ్మెల్యే బ్యాంక్ అకౌంట్ నుంచి రూ.24 వేలు, పైడి గ్రూప్ ఆఫ్ కంపెనీస్ యజమానుల బ్యాంకు అకౌంట్ నుంచి రూ.2,22,000, ప్రగతి గ్రూప్ ఆఫ్ కంపెనీస్ యజమానుల నుంచి రూ.48 వేలు ట్రాన్స్‌ఫర్ చేయించుకున్నాడు.
 
సొత్తు స్వాధీనం...
* నిందితుడి నుంచి డీఎస్‌కే హైసగ్ స్పోర్ట్స్ బైక్‌ను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. దీని విలువ సుమారు రూ.4.50 లక్షలు. అతని స్నేహితుని బ్యాంక్ అకౌంట్‌ను నిలిపివేయడం ద్వారా బ్యాంకులో ఉన్న రూ.5.37 లక్షలను స్వాధీనం చేసుకున్నారు. అతని వద్ద ఉన్న రూ.లక్షన్నర విలువైన బంగారు చైన్, మూడు ఉంగరాలు, రూ.35 వేలు విలువైన యాసర్ ల్యాప్‌టాప్, రూ.83 వేల విలువైన మూడు సెల్‌ఫోన్లు స్వాధీనం చేసుకున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement