ఫేస్‌బుక్ చాటింగ్ బానిసగా యువత
ఫేస్‌బుక్‌లో ఫొటో అప్‌డేట్ చేయకపోతే ఆ రోజు ఏదోలా ఉంటుంది. అప్‌డేట్ చేసిన ఫొటోకు లైక్‌లు రాకపోతే ఇంకా బాధగా ఉంటుంది. వాట్సప్‌లో అయితే రోజూ ఇరవై మెసేజ్‌లైనా పడాల్సిందే. ఎవరు ట్విట్టర్‌లో ఏం రాశారో తెలుసుకోకపోతే నిద్రే పట్టదు. నేటి తరం విద్యార్థుల కోరికలివి. ప్రపంచం కుగ్రామమై ఇంటర్నెట్ మనుషులను కలుపుతున్న ఈ రోజుల్లో యువత సోషల్ మాయలో పడుతోంది. తద్వారా ప్రమాదాలను కొని తెచ్చుకుంటోంది. అపరిచిత వ్యక్తులతో పరిచయాలు, తెలియని వారితో చాటింగ్‌లు యువతను పెడదోవ పట్టిస్తున్నాయి. దీనికి తోడు సమయమూ వృథా అవుతోంది.
విజయనగరం టౌన్: మారుతున్న సాంకేతిక పరిజ్ఞానాన్ని అవసరానికి అనుగుణంగా సద్వినియోగం చేసుకుంటూ ఉజ్వలమైన భవిష్యత్‌ను పొందేందుకు సోషల్ మీడియాను వినియోగించుకోవాలి. కానీ నేటి తరం మాత్రం సోషల్‌మీడియాలో ఉండడం స్టేటస్ సింబల్‌గా భావిస్తోంది. ఫేస్‌బుక్, వాట్స్ ఆఫ్, ట్విటర్ వంటి వాటి ద్వారా ప్రపంచాన్ని చూడాలని ఉవ్విళ్లూరుతోంది. ఈ ఉత్సాహమే ప్రమాదాలకు కారణమవుతోంది. రాత్రి, పగలు సెల్‌ఫోన్ చేతిలో పెట్టుకుని చాటింగ్‌తో గడిపేసే విద్యార్థులు భవిష్యత్ లక్ష్యాలను చేరుకోలేకపోతున్నారు. పోస్టులు, లైక్‌లు, కామెంట్‌లు, షేర్లతో కాలం గడిపేస్తున్నారు. ఇంటర్నెట్, ఫేస్‌బుక్ మాయలో పడిన వారికెవరికైనా ఆకలి దప్పికలు ఉండవు. యువతీ, యువకులు ఫేస్‌బుక్ మాయలో పడి బంగారు జీవితాన్ని బలి చేసుకుంటున్న ఘటనలూ ఉన్నాయి. ప్రస్తుతం సోషల్ నెట్‌వర్క్ ఎంత ఫేమస్ అంటే చాలామంది మొబైల్ ఫోన్లలో ఫేస్‌బుక్‌లు అకౌంట్లు తప్పనిసరి అయిపోయాయి. జిల్లాలోనూ యువతి ఇదే ధోరణి.
విద్యార్థుల ప్రవర్తనపై దృష్టి పెట్టాలి
సమాచార సేకరణకు, విజ్ఞానాన్ని పెంచుకునేందుకు ఫేస్‌బుక్ ఉపయోగిస్తే అదో విజ్ఞాన గని అవుతుంది. అలాకాకుండా టైమ్‌పాస్‌కు వాడుకుంటే అనర్థాలకు దారి తీస్తుందని విద్యా వేత్తలు అంటున్నారు. తల్లిదండ్రులు ఈ విషయాన్ని గమనించాలని సూచిస్తున్నారు. పిల్లలు కంప్యూటర్, ల్యాప్‌టాప్, సెల్‌ఫోన్‌లతో ఏం చేస్తున్నారు. వాటిని ఏ విధంగా ఉపయోగిస్తున్నారనే అంశాలపై దృష్టి సారించాలని చెబుతున్నారు. స్మార్‌టఫోన్లు వాడుతున్న వారిపై ఇంకాస్త శ్రద్ధ పెట్టాలని అంటున్నారు.
చాటింగ్ బానిసగా యువత
ప్రస్తుతం హైస్కూల్ స్థాయి నుంచి విద్యార్థులు చాటింగ్ అనే వ్యసనానికి బానిసలుగా తయారయ్యారు. చదువు కంటే ముందు దీనికి బానిసగా మారుతూ ఫేస్‌బుక్ అకౌంట్ లేకుంటే చిన్నతనంగా భావిస్తున్నారు. తీరిక దొరికినప్పుడల్లా కంప్యూటర్, సెల్‌ఫోన్‌లలో ఫేస్‌బుక్ చాటింగ్‌లు చేస్తూ గంటల తరబడి వాటికే అతుక్కుపోతున్నారు. దీంతో వారి చదువు దెబ్బ తింటోంది. ఆలోచన ధోరణి కూడా మారుతోంది. ఇక కొత్త పరిచయాల చాలా సార్లు ప్రమాదానికి హేతువులవుతున్నాయి. దీనికి తోడూ బినామీ అకౌంట్లతో ఫేస్‌బుక్ క్రియేట్ చేసి అశ్లీల చిత్రాలు,సెలబ్రెటీలు, ప్రముఖుల ఫోటోలను మార్ఫింగ్ చేసి అప్‌లోడ్ చేయడంతో కొందరికి తెలియని కష్టాలు తెచ్చి పెడుతున్నాయి. అందుకే విద్యార్థులు ఈ వలలో పడకుండా జాగ్రత్తగా ఉండాలని పలువురు విద్యా వేత్తలు సూచిస్తున్నారు.