వాట్సప్‌ను ఫేస్‌బుక్ వాళ్లు టేకోవర్ చేసేంత వరకూ దాన్ని వాడిన వాళ్లెంతమంది?!
అంతకన్నా ముందు ఆర్కుట్ మాయలో నుంచి బయటకొచ్చి ఫేస్‌బుక్ బాట పట్టిన తొలివాళ్లలో మీరున్నారా! ఇప్పుడు కూడా మీరు వాట్సప్‌ను వాడుకోవడానికి, ఫేస్‌బుక్ మెసెంజర్‌కే పరిమితం అవుతున్నారా? లేక ‘వాట్స్ న్యూ’అంటూ వెదుకుతున్నారా! వెదికేవాళ్లకే అయితే ఇవి పరిచయమే... వాడుకోవడానికి కొత్త సదుపాయాల కోసం వేచి చూస్తున్న వారి కోసం ఇప్పుడు వీటి పరిచయం ఒక అవసరం. టెక్నాలజీని వాడుకోవడంలో రెండు రకాలైన పద్ధతులున్నాయి. అవకాశం ఉంది కదా అని వాడుకోవడం, అందరూ వాడుతున్నారని అనుసరించడం. డబ్బు ఖర్చు పెట్టి వాడుకొనే సేవల విషయం ఎలా ఉన్నా... అందుబాటులో ఉన్న సేవలను అందిపుచ్చుకోవడం మంచి సదుపాయం. అలాంటి సదుపాయాలు కొన్ని...
పాథ్‌టాక్..
వాట్సప్, ఫేస్‌బుక్ మెసెంజర్‌ల తీరున పాథ్‌టాక్‌లో కూడా మెసేజింగ్ ఉచితం. దీని ద్వారా వాయిస్ మెసేజ్‌లు పంపడానికి కూడా అవకాశం ఉంటుంది. మొదట సోషల్‌నెట్‌వర్కింగ్ సైట్ గా మొదలై తర్వాత మెసేజింగ్ అప్లికేషన్‌గా నిలిచింది. మరి టెక్ట్స్ మెసేజింగ్, ఆడియో చాటింగ్ కోసం అయితే ఉన్న అప్లికేషన్‌లు చాలు.. ఇందులో కొత్త ఏముంది? అంటే.. అది వాడుతుంటే కానీ అర్థం కాదు. కొత్తదారిలో నడిపిస్తూ భిన్నమైన అనుభవాన్ని ఇస్తుంది ఈ అప్లికేషన్.
ప్రత్యేకత: పాథ్‌టాక్‌లో సర్వర్‌లో మీ చాటింగ్ కేవలం 24 గంటలు మాత్రమే సేవ్ అయ్యి ఉంటుంది. తర్వాత పాత ఊసుల ప్రస్తావన ఉండదు. చాటింగ్‌ను ఎప్పటికప్పుడు ఎరేజ్ చేయాలనుకొనే వారికి పాథ్‌టాక్ బెస్ట్‌ఫ్రెండ్!
లైన్...
ఇంకా ఇప్పుడిప్పుడే పుంజుకొంటున్న అప్లికేషన్ ఇది. 230 దేశాల్లో దీని వాడకందార్లు ఉన్నా.. ఆసియాదేశాల్లో కొంచెం ఎక్కువగా వాడుతున్నారు. మొత్తంగా ఐదు కోట్లమంది యూజర్లున్నారు. అయితే ఈ మెసెంజర్ అప్లికేషన్స్‌తో ఒక సమస్య ఉంటుంది. ఈ అప్లికేషన్‌ను మనం అనుసంధానం చేసుకోవడమే కాకుండా, స్నేహితులు కూడా ఇన్‌స్టాల్ చేసుకొంటేనే చాట్ చేయడానికి అవకాశం ఏర్పడుతుంది. ఈ ప్రకారం చూసుకొంటే లైన్ వినియోగం విస్తృతం కాలేదని చెప్పవచ్చు.
ప్రత్యేకత: లైన్‌ను వాడటం ద్వారా ఎక్కడనుంచి ఎక్కడికైనా, ఎప్పుడైనా ఉచితంగా టెక్ట్స్ చాట్‌తోపాటు వీడియో చాట్ చేయడానికి కూడా అవకాశం ఉంటుంది. అంతేగాక లైన్ అప్లికేషన్‌లేని స్మార్ట్‌ఫోన్స్‌తో కూడా అనుసంధానం కావడానికి అవకాశం ఉంటుంది. అయితే అలా చేయాలంటే కొంత చార్జ్ అవుతుంది.
వుయ్ చాట్..
ఇప్పుడిప్పుడే వాడకంలో ఉన్న చాటింగ్ అప్లికేషన్ ఇది. అయితే వాట్సప్ అంత విస్తృతం కాలేదు. గ్రూప్ చాటింగ్ విషయంలో వుయ్‌చాట్‌కు తిరుగులేదు. ఒకేసారి. వందమంది స్నేహితులు ఒకే చాట్‌రూమ్‌లో ఉంటూ మాట్లాడుకోవడానికి అవకాశం ఉంటుంది. కాన్ఫరెన్స్‌లా మాట్లాడుకోవడానికి, సమూహంగా చాట్ చేసుకోవడానికి వుయ్‌చాట్‌ను మించిన అప్లికేషన్ ప్రస్తుతానికి అయితే లేదు.
ప్రత్యేకత: కచ్చితంగా గ్రూప్ చాటింగ్.
వైబర్..
వీడియో చాటింగ్ కోసం ఇప్పుడిప్పుడు విస్తృతం అవుతున్న అప్లికేషన్‌లలో వైబర్ ఒకటి. ప్రస్తుతానికి విశ్వవ్యాప్తంగా కలిపి దాదాపు 20 కోట్ల మంది యూజర్లున్నారు. మనదగ్గర మాత్రం వైబర్ వినియోగదారులు తక్కువమందే. ఇందులో కూడా గ్రూప్‌చాటింగ్స్‌కు అవకాశం ఉంటుంది. ఉత్తమ నాణ్యతతో వీడియో చాటింగ్ చేయడానికి వైబర్ మంచి అప్లికేషన్..
స్కైప్ ఫర్ స్మార్ట్‌ఫోన్..
వీడియో చాటింగ్ కోసం అందుబాటులో ఉన్న స్మార్ట్ అప్లికేషన్‌లు అన్నీ ఒక ఎత్తు అయితే స్మార్ట్‌ఫోన్‌లో స్కైప్ వాడటం మరో ఎత్తు. అన్ని అప్లికేషన్లూ మొబైల్ నంబర్ మీద రిజిస్టర్ అవుతాయి. దాని వల్ల కొన్ని ఇబ్బందులు ఉండనే ఉంటాయి. అదే స్కైప్ అయితే ఇ-మెయిల్ ఐడీ ద్వారా లాగిన్ కావడానికి అవకాశం ఉంటుంది. ఆన్‌లైన్‌లో స్కైప్ ఫ్రెండ్స్‌తో మాట్లాడటానికి అవకాశం ఉంటుంది.
స్నాప్‌చాట్..
పేరుకు తగ్గట్టుగా ఈ అప్లికేషన్ చాలా రోజుల వరకూ ఫోటో షేరింగ్ కు మాత్రమే అవకాశం ఇచ్చేది. అయితే తాజాగా వీడియోకాలింగ్ అప్లికేషన్ గా మారింది. వాడాలి కానీ వీడియో చాటింగ్ విషయంలో స్నాప్‌చాట్ ప్రత్యేకత ఎంతో ఉంది!
టచ్‌లో ఉండండి!
కొత్తగా స్మార్ట్‌ఫోన్ కొన్నప్పుడు కాకుండా... మళ్లీ మళ్లీ అప్లికేషన్‌లు అందించే స్టోర్లలోకి ఎంటరయ్యేది తక్కువమందే! ఒకే క్లిక్‌తో ఐఫోన్ వినియోగదారులు ఐస్టోర్‌లోకి, ఆండ్రాయిడ్ స్మార్ట్‌ఫోన్ వినియోగదారులు గూగుల్ ప్లేస్టోర్‌లోకి ఎంటరయ్యే అవకాశం ఉంది. ఒక్కసారి ఆ అప్లికేషన్‌ల వెల్లువలోకి ప్రవేశిస్తే.. లెక్కలేనన్ని నూతన అప్లికేషన్లు పలకరిస్తూ ఉంటాయి. కాబట్టి ఎప్పటికప్పుడు వాటితో టచ్‌లోఉంటే ఇట్టే టెక్‌శావీలుగా మారిపోవచ్చు! అందుబాటులోకి వస్తున్న నూతన అప్లికేషన్‌లను ఆస్వాదించవచ్చు!
వీటినీ వాడుతున్నారా..!
Published Wed, Aug 6 2014 10:42 PM | Last Updated on Fri, Jul 27 2018 1:11 PM
Advertisement
Advertisement