నీ పెళ్లెలా జరుగుతుందో చూస్తా!
♦ వివాహ నిశ్చితార్థం రద్దు చేసుకున్నారని
♦ యువతిపై కక్ష గట్టిన శాడిస్టు యువకుడు
♦ ఫేస్‌బుక్‌లో అసభ్యకర పోస్టింగ్‌లతో వేధింపు
♦ పోలీసులకు ఫిర్యాదు చేసిన యువతి తల్లిదండ్రులు
♦ నిందితుడు అనంతపురం జిల్లాలో బ్యాంకు ఉద్యోగి
ప్రొద్దుటూరు క్రైం : అతనో బ్యాంక్ ఉద్యోగి. ఓ యువతితో ఏడాదిన్నర క్రితం వివాహ నిశ్చితార్థం జరిగింది. అయితే నిశ్చితార్థం రోజునే అతని ప్రవర్తన నచ్చకపోవడంతో ఆ తర్వాత యువతి తల్లి దండ్రులు పెద్దల సమక్షంలో నిశ్చితార్థాన్ని రద్దు చేసుకున్నారు. అప్పటి నుంచి అతను ఆ యువతితోపాటు ఆమె కుటుంబ సభ్యులను మానసిక క్షోభకు గురి చేస్తున్నాడు. బాధితురాలి తల్లిదండ్రుల కథనం మేరకు.. ప్రొద్దుటూరు పట్టణంలోని శ్రీనివాసనగర్‌లో నివాసముంటున్న దంపతులు తమ కుమార్తెను అనంతపురంలో నివాసముంటున్న వారి దూరపు బంధువు, ఆంధ్ర ప్రగతి గ్రామీణ బ్యాంకులో క్లర్క్‌గా పనిచేస్తున్న శివకృష్ణకు ఇవ్వాలనుకున్నారు. ఈ మేరకు 2014 అక్టోబర్ 24న వివాహ నిశ్చితార్థం జరిగింది.
నిశ్చితార్థం రోజే దురుసు ప్రవర్తన..
నిశ్చితార్థం రోజే ఆ యువకుడు యువతి కుటుంబ సభ్యుల పట్ల దురుసుగా ప్రవర్తించాడు. పెళ్లికి ముందే ఇతను ఈ విధంగా ప్రవర్తిస్తున్నాడు.. ఇక పెళ్లి తర్వాత ఎలాంటి పరిణామాలు ఎదురవుతాయోననే భయంతో యువతి కుటుంబ సభ్యులందరూ చర్చించుకొని వారం రోజుల తర్వాత నిశ్చితార్థం రద్దు చేసుకుంటున్నట్లు శివకృష్ణ కుటుంబ సభ్యులకు చెప్పి పంపించారు. దీంతో అతను నిశ్చితార్థం అయితే సగం పెళ్లి అయినట్లేనని చెబుతూ ప్రతి రోజూ ఆ యువతి ఇంటికి ఫోన్ చేసి వేధించడం మొదలు పెట్టాడు. తనకు ఇచ్చి వివాహం చేయకుంటే మీ కుమార్తెకు ఎక్కడా పెళ్లి కాకుండా చేస్తానని బెదిరించేవాడు. అవసరమైతే ఆమెను కిడ్నాప్ చేసైనా పెళ్లి చేసుకుంటానని హెచ్చరించసాగాడు. ఇలా ఏడాదిన్నర నుంచి అతను అనేక రకాలుగా వారిని ఇబ్బందులకు గురి చేస్తూనే ఉన్నాడు.
ఫేస్‌బుక్‌లో అసభ్యకర పోస్టింగ్‌లు
ఇటీవల ఆ యువతి తల్లిదండ్రులు తమ బంధువుల ద్వారా పిడుగులాంటి వార్త ను వినాల్సి వచ్చింది. ఫేస్ బుక్‌లో నిశ్చితార్థం ఫొటోలతో పాటు శివకృష్ణ- ఆ యువతి ప్రేమించుకున్నట్లు మెసేజ్‌లు ఉన్నాయి. ఇలా నిత్యం అసభ్యకర మెసేజ్‌లన్నీ పోస్టు చేస్తూ యువతి బంధువు ల అకౌంట్‌లకు ట్యాగ్ చేసేవాడు. అసభ్యకరమైన ఫొటోలకు ఆమె ముఖాన్ని జోడించి ఫేస్‌బుక్‌లో పెట్టాడు. ఈ విషయంపై యువతి తల్లిదండ్రులు శివకృష్ణకు ఫోన్ చేసి నిలదీయగా తనకు తెలియదని బుకాయించాడు. ఈ ఏడాది ఫిబ్రవరి 22న టూ టౌన్ పోలీస్ స్టేషన్‌లో యువతి తల్లిదండ్రులు ఫిర్యాదు చేయగా శివకృష్ణకు ఎస్‌ఐ ఫోన్ చేసి మందలించారు. అయినప్పటికీ అతనిలో ఎలాంటి మార్పు రాకపోవడంతో ఈనెల 1న కేసు నమోదైంది. పోలీసు లు అతని కోసం గాలిస్తున్నారు. ఈ విషయమై శివకృష్ణను వివరణ కోరేందు కు ప్రయత్నించగా ఆ యన సెల్ నాలుగు రోజులుగా స్విచ్ ఆఫ్‌లో ఉంది.