‘ఆత్మ’ వంచన
- ఫేస్‌బుక్ ద్వారా డ్రామా ఆడిన యువకుడు
- ఆత్మలు తిరుగుతున్నాయని 18 తులాల బంగారం కాజేసిన నవీన్
- 18 తులాల బంగారం కాజేసిన వైనం
- నిందితుడి అరెస్ట్, రిమాండ్
గద్వాల: కష్టపడే తత్వం లేకపోవడం.. సులువుగా డబ్బు సంపాదించాలన్న ఆశ.. జల్సాలకు అవసరమైన డబ్బు కోసం అమాయకులను మోసం చేయడం.. ఇలా నిత్యం ఏదో ఒక చోట ఘటనలు చోటుచేసుకుంటున్నాయి. తాజాగా ఫేస్‌బుక్‌లో ఒక విద్యార్థినితో పరిచయం ఏర్పరచుకొని 18 తులాల బంగారాన్ని కాజేశాడు. పోలీసుల కథనం ప్రకారం.. గద్వాల పట్టణంలోని ఒంటెలపేటలో నివాసముంటున్న ఇంజినీరింగ్ విద్యార్థిని హైదరాబాద్‌లో చదువుకుంటుంది. చింతలపేటకు చెందిన నవీన్ ఆమె అమాయకత్వాన్ని ఆసరాగా చేసుకొని ఆరునెలల క్రితం విద్యార్థినుల పేర్లపై ఫేస్‌బుక్ అకౌంట్ తెరిచాడు. ఫేస్‌బుక్‌లో స్పందన, శిరీష పేర్లతో పరిచయం పెంచుకున్నాడు.
పాఠశాలలో సదరు విద్యార్థినికి సీనియర్ అయిన నవీన్ పలుసార్లు కలసి ఆమెకు సహాయం చేస్తున్నట్లుగా నటించాడు. కొన్నిరోజుల తర్వాత స్పందన, శిరీష ఆత్మహత్యలకు పాల్పడ్డారని, వారు ఆత్మలై తిరుగుతున్నారని, వాటిని నీ నుంచి తప్పించడానికి కొంత బంగారం అవసరం ఉంటుందని ఫేస్‌బుక్ ద్వారా నమ్మించాడు. భయపడిన సదరు విద్యార్థిని ఈ విషయాన్ని నవీన్‌కి వివరించింది. దీంతో అతను చాకచక్యంగా వ్యవహరించాడు. ఆత్మలకు నేరుగా బంగారు ఇస్తే అవి ఏమైనా చేస్తాయని భయపెట్టాడు. ఆ బంగారం త నకు ఇస్తే తాను వెళ్లి మీ స్నేహితుల ఆత్మలకు బంగారం అందజేస్తానని నమ్మించాడు. ఈ క్రమంలో ఇంట్లో ఉన్న బంగారాన్ని కొద్దికొద్దిగా నవీన్‌కు అందజేసింది.
అయితే, బంగారం మాయమవుతున్న విషయాన్ని తల్లిదండ్రులు ఒకరోజు పసిగట్టి కూతురును నిలదీశారు. అప్పుడు ఆత్మలు, దెయ్యాలు అంటూ పిచ్చిపిచ్చిగా వ్యవహరించిందని తల్లిదండ్రులు ‘సాక్షి’కి వివరించారు. బంగారం తప్పకుండా తిరిగి వస్తుందని తల్లిదండ్రులను సైతం ఆమె నమ్మించింది. ఇలా నెలరోజుల్లో నవీన్ ఆమె నుంచి 18 తులాల బంగారాన్ని కాజేశాడు. ఈ విషయం ఎక్కడ బయట పడుతుందోనని నవీన్ తన తండ్రి, స్నేహితుల ద్వారా ఆమెను కిడ్నాప్ డ్రామాను నడిపాడు.
విద్యార్థిని తల్లిదండ్రులకు సైతం నవీన్ గుర్తుతెలియని వ్యక్తిగా ఫోన్‌చేసి బెదిరించాడు. బాధిత కుటుంబసభ్యులు తమ కుమార్తెకు జరిగిన అన్యాయాన్ని, మాయమైన బంగారం గురించి డీఎస్పీ బాలకోటికి ఫిర్యాదు చేశారు. ఫోన్ నెంబర్లు, ఫేస్‌బుక్ అకౌంట్లను పోలీసులకు అందించారు. బాధితుల ఫిర్యాదు మేరకు టౌన్ ఎస్‌ఐ సైదాబాబు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేపట్టారు.ఒక్కరోజులోనే నిందితుడిని గుర్తించి కేసును ఛేదించి 18 తులాల బంగారాన్ని స్వాధీనం చేసుకున్నారు. నిందితుడు నవీన్‌ను అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించారని ఎస్‌ఐ తెలిపారు.