ఒకరు విశాఖపట్నంకు చెందిన అంతర్‌రాష్ట్ర దొంగ
మరొకరు శ్రీకాకుళం జిల్లాకు చెందిన పాత నిందితుడు
నిందితుల నుంచి రూ.10.60 లక్షల సొత్తు స్వాధీనం
వివరాలు వెల్లడించిన ఏఎస్పీ రామానాయక్
ఒంగోలు క్రైం : ఒంగోలు సీసీఎస్ పోలీసులు ఇద్దరు దొంగలను అరెస్టు చేశారు. వారిలో ఒకరు అంతర్ రాష్ట్ర దొంగ కాగా, మరొకరు అంతర్ జిల్లా దొంగ. స్థానిక సీసీఎస్ పోలీస్‌స్టేషన్‌లో శుక్రవారం సాయంత్రం ఏర్పాటుచేసిన విలేకరుల సమావేశంలో సీసీఎస్ డీఎస్పీ కేశన వెంకటేశ్వర్లుతో కలిసి జిల్లా అదనపు ఎస్పీ బి.రామానాయక్ ఆ వివరాలు వెల్లడించారు. వారు తెలిపిన వివరాల ప్రకారం... ఒంగోలుతో పాటు జిల్లాలో దొంగతనాలపై ప్రత్యేక నిఘా కోసం రెండు బృందాలు ఏర్పాటు చేశారు. ఒంగోలు ఆర్టీసీ బస్టాండ్ సమీపంలో అనుమానాస్పదంగా తిరుగుతున్న అంతర్ రాష్ట్ర దొంగ వాండ్రాసి ఆనందకుమార్ (29)ను ఆయా బృందాలు అదుపులోకి తీసుకున్నాయి.
అతని నుంచి 48 సవర్ల బంగారు ఆభరణాలు, 1.5 కేజీల వెండి వస్తువులు స్వాధీనం చేసుకున్నారు. వాటి విలువ రూ.10 లక్షల వరకూ ఉంది. ఆనంద్‌కుమార్ విశాఖపట్నం మధురవాడ జంక్షన్ వాసి. గతంలో విశాఖపట్నంలోని జనరల్ స్టోర్‌లో పనిచేస్తూ డ్యాన్స్ ఈవెంట్లు కూడా చేసేవాడు. అయితే, దొంగతనాలకు అలవాటు పడి విశాఖపట్నంతో పాటు అనంతపురం, ఏలూరు, ప్రాంతాల్లో పలు దొంగతనాలకు పాల్పడ్డాడు. అతనిపై విశాఖపట్నంతో పాటు గాజువాక, హైదరాబాద్, కూకట్‌పల్లి, పంజాగుట్ట, మయ్యాపూర్, అనంతపురం, భీమవరం ప్రాంతాల్లో దొంగతనం కేసులు ఉన్నాయి.
2015 జూలైలో ఒంగోలు తాలూకా పోలీస్‌స్టేషన్ పరిధిలోని సుజాతనగర్ 10వ లైన్‌లో క్రోసూరి మురళీధర్ ఇంట్లో 5 సవర్ల బంగారు ఆభరణాలు దొంగిలించాడు. అదేరోజు సాయంత్రం తాలూకా పరిధిలోని రాజీవ్‌నగర్‌లో పచ్చవ వరలక్ష్మి ఇంట్లో ఎవరూ లేని సమయంలో తాళాలు పగులగొట్టి 1.5 కేజీల వెండి వస్తువులు, ఒక సవర బంగారు వస్తువు అపహరించుకుపోయాడు. ఇతర జిల్లాల్లోనూ అనేక చోరీలకు పాల్పడ్డాడు.
రెండో దొంగ పాత నిందితుడే...
పట్టుబడిన రెండోదొంగ శ్రీకాకుళం జిల్లా బుడితికి చెందిన గురివిల్ల అప్పలనాయుడు కాగా, ఇతను ప్రస్తుతం సింగరాయకొండలోని సోమరాజుపల్లి పంచాయతీ టి.పి.నగర్‌లో నివాసం ఉంటున్నాడు. గతంలో జిల్లాలో పలు దొంగతనాలు చేసి ఆయా కేసుల్లో పట్టుబడి రిమాండ్‌కు వెళ్లాడు. ఈ నెల 2వ తేదీ జైలు నుంచి బయటకు వచ్చాడు. మళ్లీ ఒంగోలు తాలూకా పోలీస్‌స్టేషన్ పరిధిలోని ఎన్‌జీవో కాలనీలో నివాసముంటున్న ఇంజినీరింగ్ విద్యార్థులు గదిలో చొరబడి రూ.60 వేల విలువైన రెండు ల్యాప్‌ట్యాప్‌లు అపహరించాడు.
రెండోసారి పోలీసులకు పట్టుబడ్డాడు. ఇద్దరు దొంగలను పట్టుకున్న సీసీఎస్ డీఎస్పీ వెంకటేశ్వరరావుతో పాటు సీఐ ఎ.ఎన్.ఆర్.కె.రెడ్డి, తాలూకా సీఐ ఎస్.ఆంటోనిరాజ్, సీసీఎస్ ఎస్సైలు ఎస్.కె.నాయబ్స్రూల్, పి.రామిరెడ్డి, హెడ్ కానిస్టేబుళ్లు బాల, కోటి, సిబ్బంది అంజిబాబు, సాయి, ప్రసాదు, శాంత, ఖాదర్, సందాని, శేషులను ఏఎస్పీ రామానాయక్, ఎస్పీ శ్రీకాంత్‌లు అభినందించారు.
ఇద్దరు దొంగలు అరెస్టు
Published Sat, Aug 22 2015 4:15 AM | Last Updated on Sun, Sep 3 2017 7:52 AM
Advertisement
Advertisement