అవినీతికి అడ్డాగా సీసీఎస్‌! | CSS Police corruption in Hyderabad | Sakshi
Sakshi News home page

అవినీతికి అడ్డాగా సీసీఎస్‌!

Published Sat, Jun 15 2024 6:58 AM | Last Updated on Sat, Jun 15 2024 6:58 AM

CSS Police corruption in Hyderabad

సాక్షి, సిటీబ్యూరో: హైదరాబాద్‌ పోలీసు విభాగానికి గుండెకాయ వంటి నగర నేర పరిశోధన విభాగం (సీసీఎస్‌) అవినీతికి అడ్డాగా మారిపోయింది. ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో గత నెల 21న ఏసీపీ టీఎస్‌ ఉమామహేశ్వరరావును ఏసీబీ అధికారులు అరెస్టు చేశారు. తాజాగా గురువారం ఈఓడబ్ల్యూ టీమ్‌–7 ఇన్‌స్పెక్టర్‌ సుధాకర్‌ రూ.3 లక్షల లంచం తీసుకుంటూ రెడ్‌ హ్యాండెడ్‌గా పట్టుబడ్డారు.

ఉన్నతాధికారుల పర్యవేక్షణ లోపం కారణంగానే ప్రతిష్టాత్మకమైన ఈ విభాగం ప్రతిష్ట దిగజారుతోందనే ఆరోపణ వినిపిస్తోంది. సంచలనాత్మక నేరాలతో పాటు భారీ స్కాములను సీసీఎస్‌ అధికారులు దర్యాప్తు చేస్తారు. రూ.25 లక్షల కంటే ఎక్కువ మొత్తంతో ముడిపడి ఉన్న సొత్తు సంబంధిత నేరాలు, రూ.75 లక్షలకు మించిన మొత్తంతో కూడిన మోసాల కేసులు సీసీఎస్‌ పరిధిలోని వస్తాయి. ఈ విభాగమే నేరుగా కొన్ని కేసులు నమోదు చేస్తుంది. నగరంలోని ఇతర పోలీసుస్టేషన్లలో నమోదైన వాటిని సిటీ పోలీసు కమిషనర్‌ దర్యాప్తు నిమిత్తం ఈ విభాగానికి బదిలీ చేస్తుంటారు. సీసీఎస్‌ దర్యాప్తు చేసే కేసుల్లో అత్యధికం రూ.కోట్లతో ముడిపడి ఉంటాయి. 

ప్రతి అంశంలోనూ కాసుల పంటే... 
ఈ నేపథ్యంలోనే సీసీఎస్‌లో పని చేసే అధికారులకు ఆ ఆలోచన ఉండాలే కానీ ప్రతి అంశంలోనూ కాసులు దండుకునే అవకాశం ఉంటుంది. ఒకప్పుడు సీసీఎస్‌ పోలీసులు తమకు వచి్చన ప్రతి ఫిర్యాదునూ కేసుగా నమోదు చేసే వాళ్లు. ఈ విధానం దురి్వనియోగం అవుతోందని భావించిన అధికారులు ఆరి్థక నేరాల్లో కేసు నమోదుకు ముందు ప్రాథమిక విచారణ (పీఈ) తప్పనిసరి చేశారు. ఇక్కడ నుంచే సీసీఎస్‌ అధికారుల అవినీతి దందా మొదలవుతోంది. పీఈలో భాగంగా విచారణాధికారి ఫిర్యాదుదారుడిని పిలిచి వివరాలు సేకరిస్తారు. ఫిర్యాదులోనే వివరాలకు సంబంధించిన ఆధారాలు, ఇతర అంశాలను తమకు అందజేయాల్సిందిగా కోరతారు. ఇక్కడ బాధితుల నుంచి డబ్బు డిమాండ్‌ చేయడంతో మొదలయ్య కథ కేసు నమోదు, దర్యాప్తు, నిందితుల అరెస్టు, సీఆరీ్పసీ 41–ఏ నోటీసుల జారీ, ఆస్తుల జప్తు, ఛార్జ్ షీట్ దాఖలు... ఇలా ప్రతి దశలోనూ కొందరు అధికారులు రేటు కట్టి మరీ వసూలు చేస్తున్నారు.  

‘సివిల్‌–క్రిమినల్‌’ మధ్య చిన్న గీతే... 
ప్రస్తుతం అమలులో ఉన్న చట్టం ప్రకారం సివిల్‌ వివాదాల్లోకి పోలీసులు తలదూర్చ కూడదు. కేవలం క్రిమినల్‌ కేసులు మాత్రమే నమోదు చేసుకుని దర్యాప్తు చేయాల్సి ఉంటుంది. ఈ అంశం కూడా సీసీఎస్‌ అధికారులకు కలిసి వస్తోంది. సీసీఎస్‌లో నమోదయ్యే, ఫిర్యాదులుగా వచ్చే ఆర్థిక నేరాల్లో చాలా వాటిని సివిల్‌–క్రిమినల్‌ అని విడదీయడానికి మధ్యలో చాలా చిన్న సాంకేతిక గీత మాత్రమే ఉంటుంది. ఇది కూడా కొందరు అవినీతి అధికారులకు కలిసి వస్తోంది. సివిల్‌ కేసును క్రిమినల్‌గా మార్చి అరెస్టు చేస్తానంటూ నిందితుల నుంచి, క్రిమినల్‌ కేసులు అయినప్పటికీ సివిల్‌గా తేలుస్తానంటూ బెదిరించి ఫిర్యాదుదారుల నుంచి అందినకాడికి దండుకుంటున్న వాళ్లు కోకొల్లలు. ‘సాహితీ’ కేసులకు దర్యాప్తు అధికారిగా వ్యవహరించిన ఏసీపీ ఉమామహేశ్వరరావు రెండు పక్షాలను బెదిరించి దండుకున్నారనే ఆరోపణలు ఉన్నాయి. తాజాగా ఇన్‌స్పెక్టర్‌ సుధాకర్‌ నిందితుడి నుంచి డబ్బు డిమాండ్‌ చేసి, తీసుకుని, తీసుకుంటూ రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుబడ్డారు.

విఫలమైన ఉన్నతాధికారులు...
నగర నేర పరిశోధన విభాగంలో వరుస వివాదాలు చోటు చేసుకుకోవడం వెనుక సీసీఎస్‌ ఉన్నతాధికారుల వైఫల్యం ఉందనే ఆరోపణ వినిపిస్తున్నాయి. వేల మంది జీవితాలతో ముడిపడి ఉన్న ‘సాహితి’ కేసులను దర్యాప్తు చేస్తున్న ఏసీపీ ఉమామహేశ్వరరావును ఏసీబీ అధికారులు అరెస్టు చేసిన తర్వాత కూడా అధికారులు మేల్కొలేదు. ప్రక్షాళన చేసి, పర్యవేక్షణ పెంచడం ద్వారా అవినీతిని నిర్మూలించే చర్యలు తీసుకోలేదు. ఈ కారణంగానే ఇన్‌స్పెక్టర్‌ సుధాకర్‌ ధైర్యంగా సీసీఎస్‌ కార్యాలయం ఎదురుగానే లంచం తీసుకోవడానికి సిద్ధమై రెడ్‌ హ్యాండెడ్‌గా చిక్కాడు. ఇప్పటికైనా నగర ఉన్నతాధికారులు మేల్కొని సీసీఎస్‌ను అన్ని స్థాయిల్లోనూ ప్రక్షాళన చేయాల్సిన అవసరం ఉంది. అలాకాకుంటే ఈ అవినీతి తిమింగలాల కారణంగా అటు ఫిర్యాదుదారులు–ఇటు నిందితులు ఇరువురూ బాధితులుగా మారే ప్రమాదం ఉంది.  

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement