సాక్షి, హైదరాబాద్: తెలుగు అకాడమీ ఫిక్స్‌డ్ డిపాజిట్ కుంభకోణం కేసులో కీలక పరిణామం చోటుచేసుకుంది ఇప్పటి వరకు దర్యాప్తు చేసిన సీసీఎస్ పోలీసులు ఇకపై కేసు విచారణను ఏసీబీ చేతికి అప్పగించనున్నారు. తెలుగు అకాడమీ నిధుల గోల్‌మాల్ కేసులో బ్యాంకు అధికారులు, సిబ్బంది పాత్ర ఉన్నట్లు సీసీఎస్ పోలీసులు గుర్తించారు. క్రిమినల్ చర్యలతో పాటు అధికార దుర్వినియోగానికి నిందితులు పాల్పడినట్లు గుర్తించారు.
చదవండి: నిధుల మాయం వెనుక మాఫియా!
ప్రభుత్వ ఉద్యోగులు కాబట్టి సీసీఎస్ విచారణలో న్యాయపరమైన ఇబ్బందులు తలెత్తుతున్నాయి. దీంతో ఆర్థిక అవకతవకల్లో ప్రభుత్వ సిబ్బంది పాత్ర ఉంటే.. కేసు దర్యాప్తులో వారిని ఏసీబీ కోర్టులోనే ప్రవేశపెట్టాల్సి ఉంటుంది. ఈ నేపథ్యంలోనే అకాడమీకి సంబంధించి నమోదైన మూడు ఎఫ్‌ఐఆర్‌లను సీసీఎస్ అధికారులు ఏసీబీకి పంపించారు. అవినీతి నివారణ చట్టం(పీసీ) కింద ఏసీబీ విచారణ చేయనుంది. ఈ కేసులో ప్రైవేటు వ్యక్తులు కూడా నిందితులుగా ఉన్నందున కేసు పూర్తిస్థాయి దర్యాప్తు సీసీఎస్ చేస్తుందని.. ప్రభుత్వ ఉద్యోగులుగా ఉన్న నిందితులకు సంబంధించి మాత్రమే ఏసీబీ దర్యాప్తు చేస్తుందని సీసీఎస్ జేసీపీ మహంతి వెల్లడించారు.
చదవండి: దొరక్కూడదని ధ్వంసం చేశాడు
కాగా ఉమ్మడి తెలుగు రాష్ట్రాలకు చెందిన తెలుగు అకాడమీ నిధులు రూ.64.5 కోట్లు గోల్‌మాల్ అవ్వడం తెలిసిందే. ప్రధాన నిందితుడు వెంకట సాయి కుమార్ సహా 18మందిని పోలీసులు అరెస్ట్ చేశారు. తెలుగు అకాడమీ ఏఓ రమేష్‌తో పాటు ఔట్ సోర్సింగ్ ఉద్యోగుల పాత్ర ఉన్నట్లు పోలీసులు గుర్తించారు. ప్రభుత్వ బ్యాంక్ అధికారుల పాత్రపై సైతం ఏసీబీ విచారణ జరపనుంది.
Comments
Please login to add a commentAdd a comment